సాధ్యమైనంత త్వరలో రాజధాని తరలింపు
సాక్షి, హైదరాబాద్: సాధ్యమైనంత త్వరలో రాజధానిని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. ఆయన బుధవారం మేయర్లు, మున్సిపల్ చైర్మన్లకు జరిగిన సదస్సు ముగింపు సమావేశంలో పాల్గొన్నారు. మేయర్లు, మున్సిపల్ చైర్మన్లకు కూర్చోవడానికి సీట్లైనా ఉన్నాయని, తమకు అదికూడా లేదని, గెస్ట్‌హౌస్‌ల నుంచి పనిచేస్తున్నామని వ్యాఖ్యానించారు. తాత్కాలిక రాజధానికి భవనాలు చూడాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
ప్రతి మున్సిపాలిటీని హెల్త్ సిటీగా, నాలెడ్జ్ హబ్‌గా, అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దాలని మేయర్లకు, మున్సిపల్ చైర్మన్లకు సూచించారు. మున్సిపాలిటీల్లో పౌరసేవలు సత్వరమే అందేలా చూడాలని, రేషన్‌కార్డులు, పెన్షన్లు, భూముల వివరాలూ అన్నీ ఆధార్‌తో అనుసంధానించాలని చెప్పారు. ప్రతి ఇంటికీ మంచినీళ్లు, ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు వేయనున్నట్టు తెలిపారు. పైపులైన్ ద్వారా గ్యాస్ అందించేందుకు కృషి చేస్తామని, రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు గ్యాస్ కనెక్టివిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిది ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయని, మరో ఐదు ఎయిర్‌పోర్ట్‌లకు కృషి చేస్తామని చంద్రబాబు తెలిపారు. అంతేగాకుండా మొత్తం 14 ఓడ రేవులను అభివృద్ధి చేసి ఎగుమతులను ప్రోత్సహిస్తామన్నారు.