నిడదవోలు :ఎండలు మండుతున్నాయి.. పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే ప్రాణ, ఆస్తినష్టాలు నుంచి బయటపడవచ్చు. గృహాలు, అపార్ట్‌మెంట్‌లు, కర్మాగారాలు, గిడ్డంగులు, ఆస్పత్రులు, కళాశాలలు, పాఠశాలల్లో అగ్నిమాపక శాఖ నిబంధనలు కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని అధికారులు
చెబుతున్నారు. 2017–18లో ఇప్పటివరకూ జిల్లావ్యాప్తంగా జరిగిన 1,422 అగ్నిప్రమాదాల్లో 22 మంది మృత్యువాతపడగా 20 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. రూ.10.64 కోట్ల ఆస్తినష్టం సంభవించింది. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాలు జరిగిన తర్వాత క్షతగాత్రులను ఏవిధంగా కాపాడాలనే వివరాలను నిడదవోలు అగ్నిమాపక శాఖ అధికారి జె.శ్రీనివాసరెడ్డి వివరించారు.
జాగ్రత్తలు పాటించాలి
♦ గ్రామీణ పాంత్రాల్లో ఎండిన గడ్డిని మాత్రమే వాములుగా వేయాలి. వాముల నుంచి నివాస గృహాలకు తప్పనిసరిగా 60 అడుగుల దూరం పాటించాలి.
♦ బహిరంగ ప్రదేశాల్లో మంటలను వే యరాదు.
♦ వంట పొయ్యిని పడుకునే ముందు ఆర్పివేయాలి.
♦ పూరిళ్లల్లో నివసించేవారు పొయ్యిలను, బొగ్గు పొయ్యిలను పూర్తిగా ఆర్పివేయాలి.
♦ గృహాల కప్పులను మరీ తక్కువ ఎత్తులో ఉంచరాదు.
♦ నిద్రపోయే ముందు దీపాలు ఆర్పి బెడ్‌లైట్‌లను వెలిగించుకోవాలి.
♦ చిన్నపిల్లలకు అగ్గిపెట్టెలు, లైటర్లు అందుబాటులో ఉంచరాదు.
♦ వంట పూరైన వెంటనే గ్యాస్ రెగ్యులేటర్ కట్టివేయాలి.
♦ గ్యాస్‌స్టౌవ్‌ను సిలిండర్ కంటే ఎత్తులో ఉంచాలి.
♦ వంట గదిలో అదనపు సిలిండర్ ఉంటే దానిని వేరే గదిలోకి మార్చాలి.
♦ గ్యాస్ లీక్ అయినట్టు అనుమానం వస్తే కిటికీలు, తలుపులు వెంటనే తెరవాలి. రెగ్యులేటర్ ఆపివేయాలి.
♦ దూరప్రాంతాలకు ఎక్కువ రోజులు ఉండటానికి వెళ్లేటప్పుడు కచ్చితంగా గ్యాస్ రెగ్యులేటర్ తీసివేయాలి.
♦ పాఠశాలల్లో ప్రమాదాలు జరిగేటప్పుడు విద్యార్థులు బయటకు వచ్చే మార్గాలను యాజమాన్యం ఏర్పాటు చేయాలి. పై అంతస్తునుంచి కిందకు దిగేందుకు మెట్లను విశాలంగా నిర్మించాలి.
♦ పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు, ఫంక్షన్ హాల్స్, సినిమా థియేటర్ల యజమానులు కచ్చితంగా ఎన్‌ఓసీ సర్టిఫికెట్ తీసుకోవాలి. ప్రమాదాల నివారణకు అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచాలి.
బాధితులను ఎలా రక్షించాలంటే..
♦ అగ్నిప్రమాదంలో నిప్పంటుకున్న క్షతగాత్రులను పరుగెత్తకుండా నేలపై దొర్లించాలి. లేదా దుప్పటి చుట్టాలి.
♦ కాలిన శరీర భాగంపై చల్లని నీరు వేయాలి.
♦ పొగతో నిండిన గదుల్లో మోచేతులు, మోకాళ్లపై పాకుతూ బయటకు రావాలి. ఆ సమయంలో నోటికి అడ్డంగా తడిగుడ్డ కట్టుకుని గాలి పీల్చడం ద్వారా పొగ, కార్బన్‌డైయాక్సెడ్‌ను పీల్చకుండా ఆపవచ్చును.
♦ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో బాత్‌రూమ్‌ల్లోకి వెళ్లకుండా ఆరుబయటకు వచ్చే ప్రయత్నం చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment