* అనారోగ్యంతో విశాఖలో తుదిశ్వాస విడిచిన ‘నాదబ్రహ్మ’
* కృష్ణమూర్తి మృతిపై పలువురు ప్రముఖుల సంతాపం
* అన్నమయ్య సంకీర్తనల స్వరకల్పనకు ఎనలేని కృషి
విశాఖపట్నం, పిఠాపురం: శాస్త్రీయ సంగీతంలో అఖండ ప్రతిభాశాలి, సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి(86) సోమవారం ఉదయం కన్నుమూశారు. కొద్ది నెలలుగా అనారోగ్యంతో ఉన్న ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. విశాఖలోని ఎంవీపీ కాలనీ సెక్టార్-6లో నివాసముంటున్న కృష్ణమూర్తి తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ కొత్తపల్లిలో 1927, అక్టోబరు 10న నేదునూరి శ్రీరామ్మూర్తి, విజయలక్ష్మి దంపతులకు నాలుగో బిడ్డగా జన్మించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో కంచికామకోటి ఆస్థాన విద్వాంసుడిగా పని చేశారు. టీటీడీ అన్నమయ్య సంకీర్తనల స్వరకల్పనకు ఆయన విశేషంగా కృషి చేశారు. మద్రాసు సంగీత అకాడమీలో 50 ఏళ్ల పాటు పాడారు.
తల్లే తొలి గురువు
నాదబ్రహ్మ నేదునూరి కృష్ణమూర్తికి సంగీతం తల్లి నుంచి వంశపారంపర్యంగా ఉద్భవించింది. మేనమామ, తల్లి విజయలక్ష్మిలు పాడిన అష్టపదులు, తరంగాలు, ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు వింటూ నేదునూరి పెరిగారు. సంగీత ఓనమాల స్వరసాధనకు తల్లే ఆయనకు తొలి గురువు. విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో చేరి ద్వారం నరసింహారావునాయుడు వద్ద మెళకువలు నేర్చుకుని వయొలిన్ వాయిద్యంలో శిక్షణ పొందారు. గురువు సలహా మేరకు గాత్ర సంగీత సాధన కూడా కొనసాగించారు. అనంతరం శ్రీపాద పినాకపాణి శిష్యరికంలో తనదైన శైలిని సృష్టించుకుని సంగీత విద్వాంసుడుగా ఎదిగి అంతర్జాతీయ ఖ్యాతి గడించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రభుత్వ సంగీత కళాశాల్లో ప్రిన్సిపాల్‌గా సేవలందించారు. ఆలిండియా రేడియోలో కర్ణాటక శాస్త్రీయ సంగీత ఆడిటేషన్ బోర్డు సభ్యుడిగా, మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో విశిష్ట కమిటీ సభ్యుడిగా సేవలందించారు. మద్రాసు కృష్ణగాన సభ ఆయనను ‘సంగీత చూడామణి’ బిరుదుతో, మ్యూజిక్ అకాడమీ ‘సంగీత కళానిధి’ బిరుదుతో గౌరవించాయి. స్వరవిలాస్, నాద సుధానిధి, సంగీత విధ్వన్మణి, సంగీత విద్యాభ్యాసం, నాదయోగి, గాన కళాభారతి తదితర 51కి పైగా అవార్డులు ఆయన్ను వరించాయి. నాదసుధా తరంగణి సంస్థ ద్వారా నాదయోగి ఆత్మకథ, 108 భద్రాచలం రామదాసు కీర్తనలు, భక్తిరస కీర్తనలు, 200కి పైగా అన్నమయ్య సంకీర్తనలు, 25 యోగ నారాయణ కీర్తనలను స్వరపరిచారు.
నేదునూరి శిష్యుల్లో ప్రముఖులు
మల్లాది సోదరులు(శ్రీరామప్రసాద్, శ్రీరవికుమార్), స్వర్గీయ డాక్టర్ దోమడ చిట్టబ్బాయి, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, శోభారాజు, కోకా సత్యవతి, వి.లలితా చంద్రశేఖర్, జి.శారదా సుబ్రహ్మణ్యం, డాక్టర్ కె. సరస్వతీ(ఏయూ సంగీత విభాగం ప్రొఫెసర్)
పలువురి సంతాపం
నేదునూరి మృతికి పలువురు సంగీతకారులు, అభిమానులు సంతాపం తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు కామినేని, రఘునాధరెడ్డి, అయ్యన్నపాత్రుడు, గంటాశ్రీనివాసరావు, సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఏపీ మండలి చైర్మన్ చక్రపాణి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, మద్రాసు సంగీత అకాడమీ కార్యదర్శి (చెన్నై) పప్పు వేణుగోపాల్ సంతాపం తెలిపారు.
సంగీత ప్రపంచానికి తీరని లోటు: జగన్
నేదునూరి కృష్ణమూర్తి మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కర్ణాటక సంగీతానికి, తెలుగువారికి ఎనలేని సేవలు అందించారని జగన్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మహా విద్వాంసుడిని కోల్పోయాం
సంగీత ప్రపంచం ఓ మహా విద్వాంసుడిని కోల్పోయింది. ఎందరికో సంగీతంలో మెళకువలు నేర్పిన గురువు దూరమయ్యారు.
- ఆకొండి మధుసూదనరావు, సంగమేశ్వర సంగీత సమాఖ్య కార్యదర్శి పిఠాపురం
ఆయన సంగీతం మరపురానిది
ఆయన సంగీతం వింటే తన్మయత్వానికి లోనయ్యే వాళ్లం. పిఠాపురంలో ఎన్నోసార్లు కచేరీలతో అలరించారు. ఆయన్ను కోల్పోవడం సంగీత ప్రియులకు తీరని లోటు.
- రేగెళ్ల సత్యనారాయణ శర్మ, పిఠాపురం
మూగబోయిన పిఠాపురం
అక్కడ పుట్టిన ‘చిగురు కొమ్మైన చేవ’ అని ఓ గడ్డ పౌరుష ప్రతాపాలను వర్ణించారో కవి. అదే మాదిరిగా తమ బిడ్డ సంగీత ప్రపంచంలో మేరునగంలా నిలిచాడని పిఠాపురం వాసులు స్మరించుకుంటున్నారు. పిఠాపురానికి చెందిన ప్రముఖ కవి అవంత్స సోమసుందర్ సంగీత దిగ్గజం కృష్ణమూర్తి గురించి చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. కృష్ణమూర్తి తండ్రి శ్రీరామ్మూర్తికి పిఠాపురం సంస్థానంలో ఉద్యోగం రావడంతో కుటుంబం అక్కడే స్థిరపడింది.
కృష్ణమూర్తి వారి పూర్వీకుల స్వగ్రామమైన నేదునూరు పేరుతోనే ప్రాచుర్యం పొందారు. స్థానిక కోటవారి వీధిలో ఉండే వారి కుటుంబం అనంతరం ఆకొండి వారి వీధిలోకి మారింది. కృష్ణమూర్తి ఐదో తరగతి వరకు చదువుకుని సంగీతం నేర్చుకోవడానికి సిద్ధమయ్యారు. తొలి కచేరీని ఉప్పాడ కొత్తపల్లిలో గణపతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించారు.
తీపి జ్ఞాపకం
కర్నూలులో వడ్రంగిగా పనిచేసే ఓ కార్మికుడికి సంగీతమంటే ప్రాణం. అక్కడ కచేరీ నిర్వహించడానికి వెళ్లిన నేదునూరికి ఆ వడ్రంగి అప్పటికప్పుడు చేతి గడియారం స్టాండ్ ఒకే చెక్కతో తయారు చేసి ఇచ్చారు. అనంతరం నేదునూరి దాన్ని నాకు ఇచ్చారు. నేను ఇప్పటికీ దాన్ని ఉపయోగిస్తున్నా.
నెల క్రితం చివరిసారి స్వగ్రామానికి..
నేదునూరి పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని గత నెల 2న దర్శించుకున్నారు. శ్రీకుక్కుటేశ్వరస్వామి, శ్రీరాజరాజేశ్వరీదేవి, శ్రీపురుహూతికా అమ్మవారు, దత్తాత్రేయుడు, సాయిబాబాలను దర్శించుకున్నారు. ఆల యాభివృద్ధికి లక్ష రూపాయలను విరాళం గాఅందజేశారు. స్నేహితులను పేరుపేరునా పలకరించారు.
‘సంగీత కళానిధి’ నేదునూరి కన్నుమూత
Published Tue, Dec 9 2014 12:40 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement
Advertisement