స్పీకర్ కోడెల కుమారుడిపై చోరీ కేసు
హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు కేసు నమోదుచేసిన పోలీసులు
నరసరావుపేట టౌన్ (నరసరావుపేట): హైకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు డాక్టర్ కోడెల శివరామకృష్ణతో పాటు మరికొందరిపై పోలీసులు చోరీ కేసు నమోదుచేశారు. ఈనెల 13వ తేదీనే కేసు నమోదుచేసిన పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. కేసు వివరాలు.. గుంటూరు జిల్లా నరసరావుపేటలో నల్లపాటి కేబుల్ విజన్ (ఎన్‌సీవీ) కేబుల్ వైర్లను కె.చానల్ నిర్వాహకుడు డాక్టర్ కోడెల శివరామకృష్ణ, అతడి అనుచరులు ప్రకాష్‌నగర్, పెద్దచెరువు ప్రాంతాల్లో గతేడాది మార్చి 17న ధ్వంసం చేసి డ్రమ్ములు, యాంప్లిఫయర్లను అపహరించారు.
ఈ సంఘటనపై ఎన్‌సీవీ మేనేజింగ్ డైరెక్టర్ లాం కోటేశ్వరరావు ఒన్‌టౌన్, టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా ఫిర్యాదును ఉన్నతాధికారులకు పంపారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు జిల్లా రూరల్ ఎస్పీ, డీఎస్పీ, ఒన్‌టౌన్, టుటౌన్ సీఐలను ఈనెల ఆరోతేదీన కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ మేరకు హాజరైన అధికారులు కేసు నమోదుచేయనందుకు కోర్టుకు క్షమాపణ చెప్పారు. అధికారుల నిర్లక్ష్యంపై చార్జిమెమో ఇచ్చినట్టు రూరల్ ఎస్పీ కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయస్థానం కేసు నమోదుచేసి, నిర్వహించిన దర్యాప్తును మే 9వ తేదీన తనకు నివేదించాలని ఎస్పీని ఆదేశించింది.