
‘దేశంలో డిజిటల్ లావాదేవీలు పెంచడానికి నా ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. ఇక ప్రతీ ఫోన్ బ్యాంక్‌లా పని చేస్తుంది. అతి తక్కువ ఖర్చుతో ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను ప్రవేశపెట్టాం. త్వరలోనే
తొలి క్యాష్‌లెస్ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దనున్నా.’
– తూర్పుగోదావరి జిల్లాలోని ‘మోరి’ని గత ఏడాది క్యాష్‌లెస్ గ్రామంగా ప్రకటిస్తున్నప్పుడు సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి.
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్‌వర్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాష్‌లెస్ లావాదేవీలు బాగా తగ్గిపోయాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా హాజరై 100 శాతం క్యాష్‌లెస్ గ్రామంగా ప్రకటించిన మోరి గ్రామంలో కూడా ఇప్పుడు పూర్తిగా నగదు లావాదేవీలే జరుగుతున్నాయి. ఆ సమయంలో ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి బ్యాంకులు వివిధ జిల్లాల్లోని పలు గ్రామాలను ‘క్యాష్‌లెస్’గా తీర్చిదిద్దడానికి దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించాయి. ప్రస్తుతం ఈ గ్రామాల్లోనూ ఆ ఊసే లేదు. పెద్ద నోట్ల రద్దు జరిగి ఈ నెల 8వ తేదీకి ఏడాది కానుండటంతో రాష్ట్రంలో క్యాష్‌లెస్ లావాదేవీల పరిస్థితి ఏ విధంగా ఉందనే విషయమై ‘సాక్షి’ క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. తమ ఊర్లను బ్యాంకులు దత్తత తీసుకున్న సంగతి ఆయా గ్రామాల్లో 90 శాతం మంది ప్రజలు ఇపుడు మరచిపోయారంటే పరిస్థితి ఎలా మారిపోయిందో స్పష్టమవుతోంది. అప్పట్లో బలవంతం వల్ల స్వైపింగ్ మెషిన్లు కొనుగోలు చేసిన వ్యాపారులు బ్యాంకు చార్జీలు భరించలేక వాటిని తిరిగి ఇచ్చేయడం గమనార్హం.
నగదుకే మోరీ జై...
తూర్పుగోదావరి జిల్లాలోని మోరీ గ్రామం జీడిపప్పు, చేనేతకు ప్రసిద్ధి. సుమారు 1400 కుటుంబాలున్న ఈ గ్రామాన్ని డిసెంబర్ 28న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే తొలి స్మార్ట్ విలేజ్‌గానే కాకుండా 100% క్యాష్‌లెస్ గ్రామంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఇక మోరీ గ్రామ ప్రజలకు నగదుతో పనిలేదని అంతా ఫోన్ ద్వారానే లావాదేవీలు జరుపుతారని చెప్పారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికీ ఓ స్మార్ట్‌ఫోన్‌ను అందజేశారు. వ్యాపారులకు స్వైపింగ్ మెషీన్లు ఇచ్చారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ గ్రామంలో ఫైబర్ నెట్ ద్వారా ప్రతి ఇంటికీ ఇంటర్నెట్, కేబుల్ కనెక్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి జన్‌ధన్ ఖాతాను ప్రారంభింప చేసి ఆ ఖాతాలను ఆధార్ నంబరుతో అనుసంధానం చేశారు. గ్రామంలో 8 చోట్ల ఉచిత వైఫై కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఆధార్ చెల్లింపు వ్యవస్థకు కావాల్సిన ఫింగర్ ప్రింట్ స్కానర్ ధర రూ.2,000 అయితే వాటిని రూ.1,000 చొప్పున సబ్సిడీతో అందజేశారు. కానీ ఇప్పుడు ఈ గ్రామంలో అంతటా నగదు లావాదేవీలే జరుగుతున్నాయి. ఫైబర్ గ్రిడ్ కనెక్షన్ ద్వారా కేవలం కేబుల్ టీవీ ప్రసారాలు తప్ప ఇంటర్నెట్ పని చేయడం లేదు. వారిచ్చిన స్మార్ట్ ఫోన్లు మొరాయించాయి. ఫింగర్ ప్రింట్ వ్యవస్థ పని చేయడం లేదు. దీంతో ప్రజలు నగదు లావాదేవీలకే మొగ్గు చూపుతున్నారు. ఉచిత వైఫై కేంద్రాలు కూడా పని చేయడం లేదు. కాగా, చేనేత సొసైటీలకు మాత్రం పెద్ద నోట్లు రద్దు కాకముందు నుంచీ ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. జీడిపిక్కల ఒలుపు కేంద్రాల్లోపనిచేసే కూలీలకు రోజువారీ వేతనాలను నగదు రూపంలోనే చెల్లిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. కూలీలు కూడా నగదు తీసుకోవడాన్నే ఇష్టపడుతున్నారు. నెట్‌వర్క్ అంతంత మాత్రం కావడంతో స్వైపింగ్ మెషిన్లు సరిగా పని చేయడం లేదని మెడికల్ షాపు యజమానులు, ఇతర వ్యాపారులు చెబుతున్నారు.
రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి..
పెద్ద నోట్ల రద్దు సమయంలో ఒకటి, రెండు నెలలు క్యాష్‌లెస్... డిజిటల్ బ్యాంకింగ్ అంటూ అధికారులు హడావుడి చేశారు. ప్రజలు దీనికి అలవాటు పడలేక పోవడంతో నగదు లావాదేవీలు మళ్లీ పెరిగాయి. దీంతో ‘క్యాష్‌లెస్’ ఊసే లేకుండాపోయింది. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మండలం కన్నమడకల, గుట్టపాడు, ఎస్.కొం తలపాడు, పాలకొలను గ్రామాలను సిండికేట్ బ్యాంక్ క్యాష్‌లెస్ గ్రామాలుగా ప్రకటించింది. కానీ ఇప్పుడు ఈ గ్రామాల్లో కూడా అత్యధిక లావాదేవీలు నగదు రూపం లోనే జరుగుతున్నాయి. నగదు రహిత లావాదేవీలు లేకపోవడం, అవి జరిగినా.. జరగకపోయినా స్వైపింగ్ మెషీన్లకు ప్రతీనెలా సర్వీసు చార్జీ కింద రూ.1,400 వరకు చెల్లించాల్సి వస్తుండటంతో చాలామంది వ్యాపారస్తులు వాటిని తిరిగి ఇచ్చేశారు. ప్రకాశం జిల్లాలో ఆంధ్రా బ్యాంక్ దత్తత తీసుకున్న టంగుటూరు మండలంలోని తూర్పు నాయుడుపాలెం, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు దత్తత తీసుకున్న కాకుటూరిపాలెంలో కూడా ఇదే విధమైన పరిస్థితులు కనిపించాయి. రేషన్‌తో సహా అన్నీ నగదు రూపంలోనే లావాదేవీలు నిర్వహిస్తున్నామని, అసలు ఈ బ్యాంకులు తమ గ్రామాలను దత్తత తీసుకున్న విషయమే తెలియదని ఈ గ్రామాల వారు చెపుతుండటం విశేషం. ఇతర జిల్లాల్లో బ్యాంకులు దత్తత తీసుకున్న గ్రామాల్లోనూ పరిస్థితులు ఇంతకన్నా భిన్నంగా ఏమీలేవు.
సాగని నగదు రహిత లావాదేవీలు
నగదు రహిత లావాదేవీలు సక్రమంగా సాగడం లేదు. పేటీఎం, స్వైపింగ్ పద్ధతుల ద్వారా ఇప్పటి వరకు సుమారు రూ.15 వేల లావాదేవీలు చేశాను. అయితే నా బ్యాంకు అకౌంటుకు ఆ మేరకు డబ్బులు జమ కాలేదు. బ్యాంకు అధికారులను సంప్రదిస్తున్నా సమస్య పరిష్కారం కాలేదు. లావాదేవీల స్లిప్‌లు అలాగే ఉండిపోయాయి. జాగ్రత్త చేయమని బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు. చిన్నపాటి వ్యాపారం చేసుకునే నాకు కష్టంగా ఉంది. దీంతో నగదు రూపంలోనే లావాదేవీలు కొనసాగిస్తున్నా.
– సీహెచ్ పెదనందయ్య, మహలక్ష్మి మెడికల్ స్టోర్, మోరి, తూర్పుగోదావరి జిల్లా
నగదుతోనే లావాదేవీలు..
మా గ్రామంలో నగదు రహిత లావా దేవీలు జరగడం లేదు. గ్రామంలోని వారంతా డబ్బులుతోనే లావాదేవీలు నిర్వహించుకుంటున్నారు. మా గ్రామాన్ని బ్యాంకు దత్తత తీసుకుందని మీరు చెప్పటమే తప్ప మాకు తెలియదు. అవగాహనా కార్యక్రమాలు నిర్వహించలేదు. నగదురహిత లావాదేవీలు అంతా ఉష్.
– దామచర్ల కొండలరావు, రైతు, తూర్పునాయుడుపాలెం, ప్రకాశం జిల్లా
సర్వీసు చార్జీలతో నష్టం..
మా ఊళ్లో నాతో పాటు మరో ఇద్దరికి స్వైపింగ్ మిషన్లు ఇచ్చారు. మొదటి నెలలో రూ.25 వేల నగదు రహిత లావాదేవీలు జరిగాయి. ఆ తర్వాత తగ్గిపోతూ వచ్చింది. అయితే బ్యాంకర్లు ప్రతినెల రూ.1350 నుంచి రూ.1850 వరకు సర్వీసు చార్జీ విధిస్తూ రావడంతో లావాదేవీలను నిలిపేశాను. అయినా సర్వీసు చార్జీలు చెల్లించాలని బ్యాంకు అధికారులు ఇప్పటికీ నోటీసులు పంపుతున్నారు. సర్వీస్ చార్జీలను రద్దుచేస్తేనే డిజిటల్ బ్యాంకింగ్ పుంజుకునే అవకాశం ఉంది.
– భాస్కర్‌రెడ్డి, చిరువ్యాపారి, గుట్టపాడు, ఓర్వకల్ మండలం, కర్నూలు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment