కైకలూరు : కేంద్ర ప్రభుత్వం నిషేధించిన క్యాట్‌ఫిష్ సాగు కొల్లేరు గ్రామాల్లో యథేచ్ఛగా కొనసాగుతోంది. కైకలూరు మండలం శృంగవరప్పాడు నుంచి కర్ణాటక రాష్ట్రానికి రవాణా అవుతోన్న లారీని పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దుల్లో అటవీశాఖ అధికారులు మంగళవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. చటాకాయి గ్రామానికి చెందిన లారీ లోపల టార్ఫాలిన్ కవర్‌లో నీటిని పోసి 8 టన్నుల చేపలను తరలిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న వీటి విలువ రూ.4 లక్షలు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
శృంగవరప్పాడుకు చెందిన డాబా శ్రీను, సైదు దుర్గాంజనేయులుకి చెందిన సరకుగా భావించిన అధికారులు విచారణ సాగిస్తున్నారు. లారీ డ్రైవర్ తాతారావును అదుపులోకి తీసుకున్నారు. లారీని కైకలూరు అటవీశాఖ కార్యాలయం వద్ద ఉంచారు. ఆ సమయంలో చటాకాయికి చెందిన బలే కల్యాణం రాముడు నుంచి వివరాలు సేకరించారు. అటవీశాఖ డీఆర్వో జి.ఈశ్వరరావు నేతృత్వంలో సిబ్బంది రాజేష్, లాజర్, సతీష్, దీనబాబు, నరేష్, కిరణ్ దాడిలో పాల్గొన్నారు. ఫిషరీష్, రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం అందించి పట్టుకున్న క్వాట్‌ఫిష్‌ను పర్యావరణం దెబ్బతినకుండా పూడ్చుతామని డీఆర్వో తెలిపారు.
మంత్రి చెప్పినా మార్పు లేదు
సాక్షిత్తూ స్థానిక ఎమ్మెల్యే, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తన నియోజకవర్గంలో అనారోగ్యకర క్యాట్‌ఫిష్ చేపల రవాణాను అడ్డుకోవాలని పదే పదే చెబుతున్నా అధికారుల్లో చలనం లేదు. నిత్యం క్యాట్‌ఫిష్ రవాణా గుట్టుచప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది.
క్యాట్‌ఫిష్ లారీ పట్టివేత
Published Wed, Feb 24 2016 12:26 AM | Last Updated on Sun, Sep 3 2017 6:15 PM
Advertisement