పత్తి కొనుగోలుకు సంబంధించి
రెండు రకాల రికార్డులు స్వాధీనం
సాక్షి ప్రతినిధి, గుంటూరు : గుంటూరు మార్కెట్ యార్డు నుంచి సీబీఐ అధికారులు గురువారం రెండు రకాల రికార్డులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. తక్‌పట్టి, కాటా చిట్టాలను మాత్రమే స్వాధీనం చేసుకోగా, మరో మూడు ముఖ్య రికార్డులను పరిశీలన చేయలేదని తెలుస్తోంది. రైతు నుంచి నేరుగా యార్డుకు పత్తి వచ్చినప్పుడు ఎరైవల్, సేల్స్, డిస్పాచ్ రికార్డుల్లో వాటి వివరాలు నమోదు అవుతాయి.
రికార్డుల ప్రకారం గుంటూరు యార్డుకు సుమారు 3 లక్షల క్వింటాళ్ల పత్తి వచ్చినట్టు చెబుతున్నప్పటికీ, కేవలం 1600 క్వింటాళ్లే వచ్చినట్టు అక్కడి కార్మిక వర్గాలు చెబుతున్నాయి. పత్తి కొనుగోలులోని అక్రమాలను వివిధ దినపత్రికలు ప్రచురించడంతో మార్కెట్ యార్డు అధికారులు అప్రమత్తమై పత్తి యార్డుకు వచ్చినట్టుగా రికార్డులు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పనిలో ఐదుగురు కార్యదర్శులను నియమించేందుకు యార్డు ఉన్నతాధికారులు ప్రయత్నించగా, నలుగురు కార్యదర్శులు ఈ రికార్డుల తారుమారుకు అంగీకరించలేదు.
రవికుమార్ అనే కార్యదర్శి ఈ తారుమారు కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నట్టు తెలుస్తోంది. వీటికి సంబంధించిన రికార్డులను తమ ముందు ఉంచాలని సీబీఐ అధికారులు కోరినప్పుడు యార్డులోని మరో కార్యాలయంలో ఉన్నాయని చెప్పి, రహస్యప్రాంతం నుంచి ఈ రికార్డులు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు రెండు గోతాల రికార్డులను అధికారులకు చూపించగా, సీబీఐ అధికారులు ఒక బాక్సులోనే ముఖ్య రికార్డులను తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది.
ఎరైవల్, సేల్సు, డిస్పాచ్‌లకు సంబంధించిన రికార్డులను మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ ఇస్సార్ అహ్మద్ ఇంతకు ముందే హైదరాబాద్ తీసుకువెళ్లారని, మొదట్లో ఈ అక్రమాలపై విచారణ జరిపినప్పడు తనతోపాటు వీటిని హైదరాబాద్ తీసుకువెళ్లారని, అందుకనే సీబీఐ అధికారులు అతి ముఖ్యమైన ఈ మూడింటిని పరిశీలన చేయలేకపోయారని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు.
యార్డులో సీబీఐ విచారణ
Published Fri, May 8 2015 3:57 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM
Advertisement
Advertisement