సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో ఇందూ ప్రాజెక్టు (టెక్‌జోన్)పై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో మరో ఐదుగురు నిందితులు ఉన్నట్లు ఆలస్యంగా వెల్లడైంది. ఢిల్లీలో సీబీఐ ఉన్నతాధికారి ఒకరు నిందితుల జాబితాను బుధవారం విడుదల చేయడంతో ఈ విషయం వెల్లడైంది. నిందితుల జాబితాలో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఆయనకు చెందిన జీ2 కార్పొరేట్ సర్వీసెస్ కంపెనీ, భూమి రియల్ ఎస్టేట్ కంపెనీ (శ్యామ్‌ప్రసాద్‌రెడ్డికి చెందినది), కార్మెల్ ఏసియా హోల్డింగ్స్, ఇందూ గ్రూప్ చార్టెడ్ అకౌంటెంట్ సీవీ కోటేశ్వర్‌రావు ఉన్నారు.
వీరితో కలిపి ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య పదిహేనుకు చేరింది. ఈ కేసులో నిందితులుగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వి.విజయసాయిరెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డి (ఇందూ సంస్థల చైర్మన్), శ్యాంప్రసాద్‌రెడ్డికి చెందిన ఇందూ ప్రాజెక్ట్స్, ఇందూ టెక్‌జోన్, రత్నప్రభ (అప్పటి ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి), సబితా ఇంద్రారెడ్డి (అప్పటి ఐటీ శాఖ మంత్రి), బీపీ ఆచార్య (సీనియర్ ఐఏఎస్), పార్థసారధి (ఏపీఐఐసీ అప్పటి సలహాదారు)లు నిందితులుగా ఉన్నారు.