
కూలీల కాల్చివేతపై సీబీఐ దర్యాప్తు
శేషాచలం ఎన్‌కౌంటర్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశం
రూ. 5 లక్షల చొప్పున తక్షణ మధ్యంతర పరిహారం చెల్లించాలి
సమాచారం ఇవ్వడంలో ఏపీ విముఖత ప్రదర్శిస్తోంది
వచ్చే నెల 9న ఏపీ సీఎస్, డీజీపీ హాజరుకావాలి
న్యూఢిల్లీ: శేషాచలం ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తు జరిపించాలని, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని ఎన్‌హెచ్‌ఆర్సీ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 7, 2015న తమిళనాడుకు చెందిన ఆరోపిత ఎర్రచందనం స్మగ్లర్లు శేషాచలం అడవుల్లో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన సంఘటనపై కేంద్ర మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) సూమోటోగా కేసు నమోదు చేసింది. బాధితుల పూర్వాపరాలను, ఎఫ్‌ఐఆర్ ఆలస్యంగా నమోదైన తీరును, సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ప్రకటనలను, సంఘటన స్థలంలో స్వాధీనం చేసుకున్న ఆయుధాల స్వభావం పరిశీలించిన మీదట, ప్రత్యక్ష సాక్షులు శేఖర్, ఎ.బాలచంద్రన్, ఎం.ఇలాంగో వాంగ్మూలాలు విన్న తరువాత, రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘటనపై ప్రాథమిక సమాచారం పంచుకోవడానికి ఇష్టపడటం లేదని గ్రహించిన తరువాత కొన్ని విషయాలను ఈ కమిషన్ గ్రహించింది. 1. శేషాచలం అడవుల్లో పోలీసులు 20 మందిని చంపివేయడం తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని చెప్పడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. 2. బాధితులు నిరుపేద కుటుంబాలకు చెందిన వారు. 3. ఎన్‌హెచ్‌ఆర్సీ దర్యాప్తు గానీ, ఇతర నిష్పాక్షిక దర్యాప్తు సంస్థ అంతిమ నివేదిక వచ్చేంతవరకు ఆయా కుటుంబాలు ఆకలితో చనిపోయే పరిస్థితి రానివ్వరాదు. ఈ నేపథ్యంలో కమిషన్ మొత్తం ఆరు ఆదేశాలు, సిఫారసులు చేసింది.
ఇవీ ఆదేశాలు, సిఫారసులు
1. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున తక్షణ మధ్యంతర సాయంగా ఏపీ ప్రభుత్వం అందజేయాలి. పరిహారం చెల్లించినట్టుగా ఆధారాలతో ఎనిమిది వారాల్లో నివేదిక ఇవ్వాలి.
2. చనిపోయినవారిలో 13 మంది గిరిజనుల కుటుంబాలకు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని 12(4)వ నిబంధన కింద ఆర్థిక సాయం సక్రమంగా అందేలా చిత్తూరు జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకుని ఎనిమిది వారాల్లో నివేదిక సమర్పించాలి.
3. భారత, ఏపీ ప్రభుత్వాలు ఈ సంఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి. ఇందుకు అవసరమైన లాంఛనాలు పూర్తిచేసి నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలి.
4. ఈ కేసులను దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను తమిళనాడులోని అధీకృత మెజిస్ట్రేట్ వద్ద నమోదు చేయించాలి.
5. ప్రత్యక్ష సాక్షులు శేఖర్, ఎ.బాలచంద్రన్, ఎం.ఇలాంగో, వారి కుటుంబ సభ్యులు, పంచాయతీ అధ్యక్షులకు వారు నివసిస్తున్న ప్రాంతంలో తగిన రక్షణను కొనసాగించేలా తమిళనాడు డీజీపీ చర్యలు తీసుకోవాలి.
6. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ జూన్ 9న ఉదయం 11 గంటలకు కమిషన్ ముందు స్వయంగా హాజరుకావాలి. కమిషన్ అడిగిన సమాచారంతో హాజరుకావాలి.
సీఎస్‌తో డీజీపీ చర్చలు
సాక్షి, హైదరాబాద్: శేషాచలం ఎన్‌కౌంటర్‌పై ఎన్‌హెచ్‌ఆర్సీ సీబీఐ విచారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫారసు చేసిన నేపథ్యంలో డీజీపీ జేవీ రాముడు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో సమావేశమయ్యారు. సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఎన్‌హెచ్‌ఆర్సీ సూచించడం పోలీసు అధికారుల్లో కలకలం రేపింది. శుక్రవారం ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశాలు వెలువడగానే డీజీపీ జేవీ రాముడు హడావుడిగా సచివాలయం చేరుకుని ఐవైఆర్ కృష్ణారావుతో చర్చలు జరిపారు. అనుసరించాల్సిన విధానంపై సుదీర్ఘంగా చర్చించారు.