విజయనగరం క్రైం: జిల్లాలోని సబ్‌జైళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా జిల్లా కేంద్రంలో ఉన్న సబ్ జైళ్లలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన తర్వాత మిగిలిన సబ్ జైళ్లలో కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం చేపడుతున్నట్లు సంబంధిత శాఖాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి జిల్లా కేంద్రంలోని సబ్‌జైల్‌లో ప్రధాన ద్వారం వద్ద సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. దీంతో జైలుకు ఎవరు వచ్చింది.. ఖైదీలు ఎవరితో మాట్లాడుతున్నదీ..తదితర వివరాలన్నీ కెమెరాల ద్వారా గుర్తించవచ్చు. ఖైదీలెవ్వరైనా పారిపోవడానికి ప్రయత్నించినా సులువుగా కనిపెట్టే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని ఎస్.కోట, బొబ్బిలి, పార్వతీపురం, చీపురుపల్లి ప్రాంతాల్లోని సబ్‌జైళ్లలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు.
జైళ్లలో ఆన్‌లైన్ సేవలు..
త్వరలో అన్ని సబ్‌జైళ్లలో ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఖైదీల పూర్తి సమాచారం కంప్యూటర్‌లో పొందుపరచడం వల్ల కోర్టుల్లో సమాచారం తెలియజేయడం సులువవుతుంది. అలాగే విడుదల చేసేటప్పుడు కూడా చేపట్టాల్సిన పనులు త్వరితగతిన పూర్తయ్యే అవకాశం ఉంది. వీటికి తోడు వీడియో కాన్ఫరెన్స్ పరికరాలు ఏర్పాటు చేయడం వల్ల ఇకపై జైలు నుంచే విచారణ చేపట్టనున్నారు.
జైళ్ల నుంచి ఖైదీలు పారిపోయే సంఘటనలు మనం చాలా వినే ఉంటాం. ఇకపై అలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. అన్ని సబ్ జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా ఖైదీల కదలికలపై గట్టి నిఘా వేయనున్నారు. అలాగే ప్రమాదకరమైన ఖైదీలకు జైలు నుంచే విచారణ చేపట్టేందుకు వీడియో కాన్ఫరెన్స్ సెట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఖైదీల పూర్తి సమాచారాన్ని కూడా కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నారు.
అన్ని సబ్‌జైళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు
జిల్లాలోని అన్ని సబ్‌జైళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తాం. ముందుగా జిల్లా కేంద్రంలోని జైలులో ఏర్పాటు చేశాం. అలాగే సోమవారం నుంచి జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణ చేపట్టనున్నారు.
- డి.లక్ష్మయ్య, జిల్లా జైలర్
సబ్ జైళ్లలో నిఘా నేత్రాలు
Published Sun, Feb 28 2016 12:06 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM
Advertisement
Advertisement