విజయనగరం మున్సిపాలిటీ: పంచాయతీలకు వివిధ గ్రాంట్‌ల కింద మంజూరయ్యే నిధులతో పాటు వాటి ఖర్చు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేయడంలో రాష్ట్రంలోనే విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణరాజు తెలిపారు.
జిల్లాలో మొత్తం 490 క్లస్టర్లు ఉండగా... అందులో 231 క్లస్టర్లలో వివరాలను ఆన్‌లైన్ చేసేందుకు అవసరమైన కంప్యూటర్లు, ఇంటర్నెట్ సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇతర అంశాలపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా ఆయన మాట్లాడారు.
ప్రశ్న: గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు?
జవాబు: జిల్లావ్యాప్తంగా 920 గ్రామ పంచాయతీలు ఉండగా... అందులో 905 పంచాయతీల్లో సిమెంట్ రోడ్లు వేసే ప్రక్రియను చేపడుతున్నాం. మిగిలిన 15 పంచాయతీలు గిరిశిఖర గ్రామాలు కావటంతో ఆ ప్రాంతాల్లో పనులు చేపట్టడం లేదు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరిగే రోడ్ల నిర్మాణాలకు రూ.65 కోట్ల నిధులు మంజూరయ్యాయి. 14వ ఆర్థిక సంఘం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాల్లో ఈ రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.
ప్రశ్న: ఆర్థిక సంవత్సరం దగ్గర పడుతోంది.. పన్నుల వసూళ్ల పరిస్థితి..?
జ: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల నుంచి పన్ను, పన్నేతర ఆదాయం కింద రూ.23 కోట్లు వసూలు కావాల్సి ఉంది. మార్చి 31 నాటికి వసూలు చేయాలని 496 పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశాం. ప్రస్తుతం ఈ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ప్రజలు కూడా సహకరించి స్వచ్ఛందంగా పన్నులు చెల్లించాలి.
ప్రశ్న: గ్రామ పంచాయతీల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వహణ ఎంతవరకు వచ్చింది..?
జ: సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వహణకు సంబంధించి తొలి విడతగా 34 మండల కేంద్రాల్లో డంపింగ్ యార్డులను ఏర్పాటుచేస్తున్నాం. అందులో 12 మండలాల్లో పనులు ప్రగతిలో ఉన్నాయి. 920 గ్రామ పంచాయతీలకు 560 పంచాయతీల్లో డంపింగ్‌యార్డుల ఏర్పాటుకు స్థల సేకరణ జరిగింది.
ప్రశ్న: పంచాయతీల పాలన పర్యవేక్షించేందుకు కార్యదర్శులు, ఈఓపీఆర్‌డీల పరిస్థితి?
జ: జిల్లాలో 34 మండలాలు ఉన్నాయి. 29 మంది ఈఓపీఆర్‌డీలు ఉన్నారు. మిగిలిన ఐదు మండలాల్లో ఇన్‌ఛార్జిలుగా పక్క మండలాలకు చెందిన వారికి బాధ్యతలు అప్పగించాం. మొత్తం 920 గ్రామ పంచాయతీలను 490 క్లస్టర్‌లుగా విభజించాం. 496 మంది పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. నవంబర్ నెలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు దరఖాస్తులు ఆహ్వానించాం. 21 మంది కార్యదర్శుల పోస్టులకు ఎంపికయ్యారు. వారికి త్వరలోనే బాధ్యతలు అప్పగిస్తాం.
ప్రశ్న: ఏకగ్రీవ పంచాయతీలకు విడుదలైన నిధుల వినియోగంపై మార్గదర్శకాలు!
జ: జిల్లాలో 126 గ్రామ పంచాయతీలు ఎన్నికల నిర్వహణ లేకుండానే ఏకగ్రీవమయ్యాయి. వాటిలో ఒక్కో పంచాయతీకి రూ.7 కోట్లు చొప్పున మంజూరయ్యాయి. ఈ నిధులతో ఆయా గ్రామ పంచాయతీల్లో జన్మభూమి కార్యక్రమంలో 20 ప్రాధాన్యతాంశాల పనులు చేపట్టాలని ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ట్రెజరీ అధికారులకు అవే సూచనలు పంపించాం.
ప్రశ్న: నగర పంచాయతీలకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారా?
జ: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఎస్.కోట, చీపురుపల్లి, కొత్తవలస మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్పు చేసేందుకు గత డిసెంబర్ 2వ వారంలోనే ప్రతిపాదనలు పంపించాం. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలూ ఇప్పటి వరకూ రాలేదు.
గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు
Published Fri, Jan 15 2016 12:15 AM | Last Updated on Sun, Sep 3 2017 3:41 PM
Advertisement
Advertisement