నాసిరకం మెటీరియల్‌తో సీసీరోడ్ల నిర్మాణం
క్వాలిటీ కంట్రోల్ తనిఖీల్లో బట్టబయలు
బెర్మ్‌లు, డ్రైన్లు నిర్మించకుండానే నిధులు డ్రా
అడ్వాన్స్ రికార్డింగ్ అంటూ పనులు పూర్తి కాకుండానే ఎంబుక్‌ల్లో నమోదు చేసేశారు. మెటీరియల్ పేరుతో నిధులు పక్కదారి పట్టించేశారు. ఆగమేఘాల మీద హడావుడిగా నిర్మించిన సీసీరోడ్ల నిర్మాణంలో డొల్లతనం నెలరోజులు తిరక్కుండానే బయటపడుతోంది. అధికారులు ఏ స్థాయిలోచేతివాటం ప్రదర్శించిందీ అత్యంత లోప భూయిష్టంగా ఉన్న సీసీ రోడ్లను చూస్తే ఇట్టే అర్థమవుతోంది. కనీసం బెర్మ్‌లు, కాలువలు నిర్మించకుండానే నిధులు డ్రా చేసేశారు. క్వాలిటీ కంట్రోల్ అధికారుల పరిశీలనలో నిర్మాణంలో డొల్లతనం బయటపడింది.
విశాఖపట్నం: జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు.14వ ఆర్థిక సంఘం నిధులను జోడించి ఉపాధి హామీ మెటీరియల్ కాంపొనెంట్ నిధులు మురిగిపోకూడదన్న తలంపుతో మార్చి నెలాఖరులోగా ఆఘమేఘాలమీద బిల్లులు మంజూరయ్యాయి. పనులు పూర్తయినట్టుగా ఎంబుక్‌లో రికార్డు చేసి మమా అనిపించారు. అయినప్పటికీ రూ.159కోట్ల కాంపొనెంట్ నిధులను మాత్రమే ఖర్చుచేయగలిగారు. రూ.40కోట్లు మురిగిపోయాయి. తొలుత 50ః50 నిష్పత్తితో రూ.69.27 కోట్లతో పనులు చేపట్టారు. అయినా కాంపొనెంట్ నిధులు రూ.256 కోట్లు మిగిలిపోవడంతో 90ః10 శాతం నిష్పత్తిలో పనులకు అనుమతి ఇచ్చారు. రూ.199కోట్ల ఉపాధి కాంపొనెంట్ నిధులకు 14వ ఆర్థిక సంఘం నిధులు జోడించి మొత్తం రూ.298 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. మొత్తంగా మూడువందల కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్టుగా అధికారులు ప్రకటించారు. వీటి నాణ్యత మేడిపండు చందంగా ఉంది. 15 రోజులపాటు క్వాలిటీ కంట్రోల్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలో వీటి నిర్మాణంలో చోటుచేసుకున్న అవినీతి బయటపడింది.
నిబంధనలు ఇలా చెబుతున్నా..
సీసీ రోడ్ల నిర్మాణంలో నిబంధనలు కఠిన తరం చేశారు. ఎం-30 స్టాండర్డ్(ఒకశాతం సిమెంట్, ఒకటిన్నర శాతం పిక్క, మూడు శాతం ఇసుక)లో రోడ్ల నిర్మాణం చేపట్టాలి. కనీసం 28 రోజులు పాటు వేసిన సీసీ రోడ్ లేదా డ్రైన్‌ను వాటరింగ్ చేయాలి. నాణ్యతలో, వాటర్ ప్యూరింగ్‌లో నిబంధనలకు ఉల్లంఘిస్తే రూ.లక్షకు 25వేల చొప్పున కోత పెట్టొచ్చు.. పర్యవేక్షించిన ఏఈ, డీఈలపై క్రమశిక్షణ చర్యలే కాదు తీవ్రతను బట్టి క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది.
అంతా లోపభూయిష్టమే..: నిబంధనల ప్రకారం నిర్మాణం చేపట్టలేదని విజిలెన్స్‌అండ్ మోటనరింగ్ కమిటీతో పాటు క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారుల పరిశీలనలో గుర్తించినట్టు సమాచారం. తొలివిడతలో 50ః50నిష్పత్తిలో చేపట్టిన సీసీ రోడ్లలో నాణ్యత బాగానే ఉన్నప్పటికీ 90ః10నిష్పత్తిలో చేపట్టిన సీసీ రోడ్లలోనే చాలా చోట్ల లోపభూయిష్టంగా ఉంది. నాసిరకం మెటీరియల్‌తో వీటిని నిర్మించినట్టుగా స్పష్టమవుతోంది. దీనికి తోడు జిల్లాలో ఏ ఒక్క సీసీరోడ్‌కు బెర్మ్‌లు, డ్రైన్లు నిర్మించిన దాఖలాలు లేవు. దీంతో బెర్మ్‌ల్లేని సీసీరోడ్లపై వెళ్లే వాహన చోదకులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. రెండో విడతలో చేపట్టిన సీసీ రోడ్లలో సుమారు మూడోవంతు నిధులు పక్కదారి పట్టి ఉంటాయని క్వాలిటీ అధికారులే అంచనా వేస్తున్నారు. ఈ పనుల్లో నాణ్యత ప్రమాణాలపై మరో పక్క థర్డ్ పార్టీ ఎంక్వయిరీ కూడా జరుగుతోంది. తమ నివేదికలను నెలాఖరుకు ఉన్నతాధికారులకు అందజేస్తామని క్వాలిటీ కంట్రోల్ అధికారులు చెబుతు న్నారు.