అట్టహాసంగా రైతుకోసం చంద్రన్న
విజయవాడ : స్థానిక ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ‘రైతు కోసం చంద్రన్న’ కార్యక్రమం ఆద్యంతం అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు అధికారులు జిల్లా నలుమూలల నుంచి రైతులను అధిక సంఖ్యలో తరలించారు. ఐదు గంటలకు పైగా సాగిన ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ సభలా కాకుండా పార్టీ సదస్సులా నిర్వహించారు. మంత్రులు ప్రొటోకాల్‌కు విరుద్ధంగా సబంధంలేని వ్యక్తులను వేదికపై కూర్చోబెట్టి ప్రతిపక్ష పార్టీలను దుమ్మెత్తి పోసేందుకు వేదికగా మార్చుకున్నారు.
తమ ప్రభుత్వం సాధించిన విజ యాల కంటే ప్రతిపక్ష పార్టీ నేతలను విమర్శించేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యకార్యకర్తలు ఎక్కువ సమయాన్ని కేటాయించారు. శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు ఇస్తామని ప్రకటించిన వివిధ శాఖల ఉన్నతాధికారులు బహిరంగ సభ జరిగిన తీరు చూసి పక్కకు వెళ్లిపోయారు. దీంతో కార్యక్రమం ఆసాంతం రాజకీయ వేదికగా, ఎన్నికల సభలా కొనసాగింది. వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హాజరై 117 మంది లబ్ధిదారులకు సబ్సిడీతో కలిపి రూ.774.76 లక్షల విలువైన వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో వివిధ రకాల పరికరాలను పంపిణీ చేశారు.
వ్యవసాయశాఖ నుంచి 58 మంది రైతులకు రూ.2 కోట్ల విలువైన యంత్రాలను అందజేశారు. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో లైవ్‌స్టాక్ యూనిట్లు, ఉద్యాన శాఖ అధికారులు ఫామ్ ఫ్రెష్ విజిటబుల్స్‌కు రుణ సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి వందకు పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరావు, కొల్లు రవీంద్ర, కలెక్టర్ బాబు.ఎ తదితరులు ఈ స్టాళ్లను సందర్శించారు. సంక్షేమ పథకాలపై సమాచార పౌరసంబంధాల శాఖ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను మంత్రులతో పాటు రైతులు కూడా తిలకించారు. రైతు నాయకులు చలసాని ఆంజనేయులు, ఆళ్ల గోపాలకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
50 వేల మంది రైతులకు వాయిస్ మెసేజ్‌లు
రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో వ్యవసాయశాఖ జిల్లాలో 50 వేల మంది రైతులకు నిత్యం వాయిస్ మెసేజ్‌లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని రూపొందించింది. కలెక్టర్ బాబు.ఎ చొరవతో రూపొందించిన ఈ కార్యక్రమాన్ని మంత్రి ప్రత్తిపాటి ప్రారంభించారు. వ్యవసాయశాఖ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలకు సంబంధించి రైతులకు ఎప్పటికప్పుడు వాయిస్ మెసేజ్ రూపంలో సలహాలు, సూచనలు అందిస్తామని కలెక్టర్ తెలిపారు.
రుణమాఫీ దరఖాస్తుల స్వీకరణ
రుణమాఫీ అందని రైతులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులను అందజేశారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం చైర్మన్ కుటుంబరావు రైతుల నుంచి ఈ దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన రైతులు అందరికీ రుణామాఫీ అమలు చేస్తామన్నారు.