జన్మభూమి పండగ రూ.కోటి దండగ
- తూతూ మంత్రంగా ముగిసిన గ్రామసభలు
- నిర్వహణ పేరిట భారీగా నిధులు డ్రా
- ‘కోడ్' ఉన్నా కొత్త పింఛన్లు పంపిణీ
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వం మంజూరుచేసిన కోటి రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుచేసినట్లు అధికారులు లెక్కలు చూపడం తప్ప తప్ప జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రజలకు ఒరిగిందేమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఈ నెల 3 నుంచి ప్రారంభమైన రెండో విడత జన్మభూమి - మా ఊరు ఆదివారంతో ముగిసింది. ఈ సభల్లో డ్వాక్రా సంఘాల పొదుపు ఖాతాల్లో రూ.3 వేల చొప్పున జమ చేసి సంబంధిత పత్రాలను అట్టహాసంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఉన్న పింఛన్లలో కోతేసి వాటి స్థానంలో కొత్తగా మంజూరుచేసిన పింఛన్లను కూడా ఈ సభల్లోనే పంపిణీ చేయాలనుకున్నారు. నీరు- చెట్టు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వంటి కార్యక్రమాలతో పాటు నెల వారీగా పంపిణీ చేసే పింఛన్లు, పీడీఎస్ సరకుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టాలని తలపోశారు. సభల నిర్వహణ కోసం జిల్లాకు ఏకంగా రూ.కోటి మంజూరు చేశారు. అర్బన్ ప్రాంతాల్లో కమిషనర్లు, రూరల్‌లో మండల పరిషత్ అధికారుల అకౌంట్లకు ఈ నిధులు జమ చేశారు.
సభలకు ప్రజాప్రతినిధులు దూరం
ఇంతలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఈ కార్యక్రమం మొక్కుబడి తంతుగానే ముగిసింది. కొత్త పింఛన్లతో పాటు, డ్వాక్రా సంఘాల పొదుపు ఖాతాలకు రూ.3 వేల జమచేసే కార్యక్రమాలపై ఎన్నికల సంఘం ఆంక్షలు పెట్టింది. ప్రభుత్వ భజన, రాజకీయ ఉపన్యాసాలకు ఆస్కారం లేకపోవడంతో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ సభల పట్ల ఆసక్తి చూపలేదు. ఈ నెల 6న ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక పర్యటన కూడా రద్దయింది. ఇక జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, సీహెచ్ అయ్యన్న పాత్రుడులు ఒకటి రెండు సభలకే పరిమితమయ్యారు.స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ సభల జోలికి పోలేదు.
జరగకపోయినా.. జరిగినట్టు..
పెదబయలు మండలం పెదకొడపల్లి గ్రామస్తులు తమ గ్రామానికి రోడ్లు నిర్మించడం లేదంటూ ఆగ్రహంతో తొలిరోజు సభను బాయ్ కాట్ చేశారు. మిగిలిన 924 పంచాయతీలతో పాటు జీవీఎంసీ, ఇతర మున్సిపాలటీల్లోని 190 వార్డుల్లో సభలు జరిగాయని లెక్క తేల్చేరు. ఈ మేరకు జన్మభూమి నిర్వహణకు మంజూరైన కోటీ ఖర్చయినట్టుగా లెక్కలు చూపారు. కానీ వాస్తవంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించాల్సిన 1144 సభల్లో కనీసం మూడో వంతు సభలు కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. అవి కూడా మొక్కుబడిగానే సాగాయి. సభలు జరిగిన చోట పెద్ద ఎత్తున రైతులు, డ్వాక్రా మహిళల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. సభలు జరగకపోయినా.. జరిగినట్టు రికార్డుల్లో పేర్కొంటూ..సభల నిర్వహణకు టెంట్‌లు, ఇతరసౌకర్యాల పేరిట మండలాలకు కేటాయించిన సొమ్మును పూర్తిస్థాయిలో ఖర్చు చేసినట్టు ఓచర్లు పెట్టి డ్రాచేశారు. సమస్యలు పరిష్కారం మాటెలా ఉన్నా కోటి రూపాయలను మాత్రం ఖర్చుచేయడంలో అధికారులు సఫలీకృతమయ్యారు.
అర్జీలు 20 వేలే!
జిల్లా వ్యాప్తంగా 1113 సభలు నిర్వహించినట్టుగా లెక్కలు చెబుతున్న అధికారులు నెల వారీగా పంపిణీ చేసే రేషన్ సరకులతో పాటు లక్షా 63 వేల 156 మందికి రూ.16.33 కోట్ల విలువైన పింఛన్లను పంపిణీ చేసినట్టు అధికారులు ప్రకటించారు.