వైకుంఠంలో ఇకపై సెల్‌ఫోన్లు నిషేధం
సాక్షి, తిరుమల: తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోకి సెల్‌ఫోన్లు తీసుకెళ్లటంపై ఇప్పటికే నిషేధం ఉంది. దీన్ని సక్రమంగా అమలు చేయాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని జేఈవో శ్రీనివాసరాజు శనివారం మరోసారి ఉత్తర్వులు ఇచ్చారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది వద్ద సెల్‌ఫోన్లు ఉండటం వల్ల దర్శన దందా అడ్డూ అదుపూ లేకుండా పోతోందని జేఈవో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సెల్‌ఫోన్లతోనే దర్శనాల దందా
శ్రీవారి దర్శనానికి మొదటి, రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లే ప్రధాన ప్రవేశ మార్గాలు. ఇక్కడ ఏఈవో స్థాయి నుంచి అటెండర్ స్థాయి వరకు, ఇతరత్రా భద్రతా సిబ్బంది వందల సంఖ్యలో పని చేస్తుంటారు. భద్రతా కారణాలతో శ్రీవారి ఆలయంతో పాటు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లలో సెల్‌ఫోన్లను నిషేధించారు. అయితే ఈ ఉత్తర్వుల అమలు అంతంత మాత్రంగానే ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు అన్ని విభాగాల సిబ్బంది దర్శనాల దందాకు వినియోగిస్తూ కాసులు దండుకుంటున్నారు. దీనిపై ఈవో, జేఈవోలకు ఫిర్యాదులు కూడా అందాయి. అక్రమ దందాల్లో పాత్రధారులైన అన్ని విభాగాల సిబ్బందిని ఏరివేసే కార్యక్రమానికి తెరతీసారు. రెండు రోజుల ముందు దర్శన దందా చేస్తూ పట్టుబడిన ఓ సూపరిండెంటెంట్‌తో పాటు మరో పోటు కార్మికుడిపై వేటు వేయాలని నిర్ణయించారు.
వైర్‌లెస్ సెట్లతోనే విధులు నిర్వహించాలి
వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లలో దర్శన దందాలకు సెల్‌ఫోన్లు కూడా ఓ కారణంగా ఉందని జేఈవో భావించారు. గతంలో ఉన్న నిషేధాజ్ఞలనే ఇకపై కచ్చితంగా అమలు చేయాలని శనివారం మరోసారి ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో డెప్యూటీ ఈవో, ఏఈవో అధికారుల మినహా మిగిలిన సిబ్బంది అందరూ టీటీడీ వైర్‌సెల్ సెట్ల ద్వారానే సమాచారాన్ని ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. అలా కాదని అతిక్రమిస్తే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.