
పోలవరంలో దొంగలు పడ్డారు!!
అత్యంత ప్రతిష్ఠాతమమైన పోలవరం ప్రాజెక్టులో దొంగలు పడుతున్నారు. అక్కడకు ప్రతిరోజూ టన్నుల కొద్దీ వస్తున్న సిమెంటులో కొంత మొత్తాన్ని జాగ్రత్తగా పక్కకు పెట్టేసి అమ్మేసుకుంటున్నారు. ఇందులో సబ్ కాంట్రాక్టర్ల దగ్గర పనిచేసే ఉద్యోగుల నుంచి లారీ డ్రైవర్ల వరకు అందరికీ భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. బహిరంగ మార్కెట్లో సిమెంటు బస్తా ధర రూ. 350-400 వరకు పలుకుతుండగా, ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు కావడంతో సిమెంటు కంపెనీలు ఒక్కో బస్తాను రూ. 230 చొప్పునే ఇవ్వడానికి అంగీకరించాయి. అయితే ఈ సిమెంటునే ఇప్పుడు కొంతమంది పక్కకు తప్పించి అమ్మేసుకుంటున్నారు.
ఇక్కడకు సిమెంటును బస్తాల్లో కాకుండా ట్యాంకర్లలో తీసుకొస్తారు. ఒక్కో ట్యాంకర్‌లో సుమారు 25 టన్నుల సిమెంటు పడుతుంది. తెలంగాణ ప్రాంతంలో ఉన్న సిమెంటు ఫ్యాక్టరీల నుంచి జంగారెడ్డిగూడెం, పోలవరం మీదుగా ఇక్కడకు సిమెంటు వస్తుంది. ఇది పక్కదారి పడుతున్నట్లు 'సాక్షి'కి సమాచారం అందడంతో పక్కాగా నిఘా ఉంచింది. అందులో సిమెంటు దొంగలు అడ్డంగా దొరికిపోయారు. ఇక్కడకు రోజుకు 30 లారీల వరకు వస్తుంటే, నాలుగైదు లారీలనే ఈ దొంగలు టార్గెట్ చేసుకుంటున్నారు. గతంలో లారీలో మిగిలిపోయిన సిమెంటును మాత్రం తీసి అమ్ముకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం రోజుకు నాలుగైదు లారీలను ఎంచుకుని, వాటిలో ఒక్కోదాంట్లోంచి 2-4 టన్నుల వరకు సిమెంటును ముందే తీసేస్తున్నారు. దాన్ని అక్కడే వేరే బస్తాలలోకి ఎక్కించి అక్కడినుంచి బయటకు తరలిస్తున్నారు.
సబ్ కాంట్రాక్టర్ల దగ్గర పనిచేసే కొంతమంది సిబ్బందితో లారీ డ్రైవర్లు కుమ్మక్కై సిమెంటు తరలిస్తున్నారు. వీళ్లు ఒక్కో బస్తాను రూ. 200 చొప్పున అమ్ముతున్నారు. బయటి మార్కెట్ ధరతో పోలిస్తే సగం ధరకే సిమెంటు దొరుకుతుండటంతో దీనికి గిరాకీ కూడా బాగానే ఉంది. ఇలా అమ్మడానికి కూడా వాళ్లు కొన్ని పాయింట్లు పెట్టుకున్నారు. అలాంటి పాయింట్లలో ఒకటైన గోపాలపురం మండలం జగన్నాధపురం వద్ద వీళ్లు బస్తాల్లోకి సిమెంటు నింపుతుండగా సాక్షి కెమెరాకు దొరికేశారు. సిమెంటు ఎక్కడినుంచి తెస్తున్నారని, ఎక్కడిదని గట్టిగా ప్రశ్నించగా ఏమీ చేయొద్దంటూ కాళ్లావేళ్లా పడ్డారు. అయితే లారీలోంచి మాత్రం సిమెంటును తీయడం, దాన్ని బస్తాల్లో నింపడం లాంటివన్నీ రికార్డు కావడంతో స్పష్టమైన ఆధారాలు లభించినట్లయింది.