మొన్న మొత్తుకుని.. నిన్న మెత్తబడి! | The day before yesterday, yesterday hypotonia mottukuni ..! | Sakshi
Sakshi News home page

మొన్న మొత్తుకుని.. నిన్న మెత్తబడి!

Published Thu, Mar 19 2015 2:16 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

మొన్న మొత్తుకుని.. నిన్న మెత్తబడి! - Sakshi

మొన్న మొత్తుకుని.. నిన్న మెత్తబడి!

  • సాక్షి కథనంపై సీఎం చంద్రబాబు దోబూచులాట
  • ‘సాక్షి’ మీద మంగళవారం శాసనసభ సాక్షిగా అబద్ధాలు మాట్లాడి అడ్డంగా దొరికిపోయిన సీఎం చంద్రబాబు పరిస్థితి.. కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. ‘సాక్షి’పై అబద్ధాలే ఆధారంగా మంగళవారం ఒంటికాలిపై లేచిన ఆయన.. బుధవారం నాటికి ప్లేటు ఫిరాయించి వేరే రూటులో మాట్లాడారు. ఈ క్రమంలో మంగళవారం చెప్పిన అబద్ధాలనే మళ్లీ వల్లెవేశారు. 16నే అథారిటీ సమావేశం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును రీయింబర్స్ చేయాలని అథారిటీ తీర్మానం చేసిందని అబద్ధాలను పునరావృతం చేశారు.
     
    సాక్షి, హైదరాబాద్: ‘పోలవరం ప్రాజెక్టుకు చంద్రగ్రహణం’ పేరిట ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై మంగళవారం నాటి శాసనసభలో గంగవైలెత్తిన సీఎం చంద్రబాబునాయుడు.. బుధవారం మాత్రం నోరు మెదపలేదు. ‘అడ్డంగా దొరికారు’ అంటూ మంగళవారం సభలో చంద్రబాబు చెప్పిన అబద్ధాలను సాక్షాధారాలతో సహా బుధవారం సాక్షి మరో కథనం ప్రచురించింది. దీనిపైనా.. సీఎం ఒడుపుగా తప్పించుకున్నారే తప్ప, మంగళవారం మాదిరి ‘క్షమాపణ’ కోసం పట్టుబట్టలేదు. పోలవరం ప్రాజెక్టుకు చంద్రగ్రహణం ఎలా పట్టిందీ వివరిస్తూ రాసిన కథనం మీద క్షమాపణ చెప్పే వరకు విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మాట్లాడనివ్వబోమని శపథం చేసిన సీఎం.. బుధవారం ఆ విషయాన్ని పట్టించుకోకుండా తప్పించుకున్నారు. ‘సాక్షి’ రాతలను వారి విజ్ఞతకే విడిచిపెడుతున్నామన్నారు. నదుల అనుసంధానంపై 344 కింద జరిగిన చర్చలో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా మాట్లాడినప్పుడు కూడా.. సాగునీటి రంగం, సమస్యలపై సుదీర్ఘంగా మాట్లాడినా.. ‘సాక్షి’ కథనం మీద మాటవరుసకు ప్రస్తావించి ఊరుకున్నారు. మంగళవారం చెప్పిన అబద్ధాలనే బుధవారమూ చెప్పి.. తాను అసత్యం చెప్పలేదనే కలరింగ్ ఇవ్వడానికి ప్రయత్నించారు.
     
    మళ్లీ అదే వల్లింపు!

    మార్చి 12న పోలవరం అథారిటీ సమావేశం హైదరాబాద్‌లో జరిగిందని, సీఎం చెబుతున్నట్లు 16న జరగలేదని ‘సాక్షి’ చెప్పింది. అయితే.. సీఎం చంద్రబాబు మాత్రం బుధవారం కూడా 16నే అథారిటీ సమావేశం జరిగిందని, ఇద్దరు కేంద్ర అధికారులు కూడా పాల్గొన్నారని చెప్పారు. నిజానికి ఆ ఇద్దరు అధికారులు 12న జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. అదే సమావేశంలో అథారిటీ సీఈవో సూచననే.. అథారిటీ నిర్ణయంగా బాబు చెప్పుకొచ్చారు. సమావేశం తీర్మానాల్లో ఆ విషయం లేదనే విషయాన్ని ఆయన విస్మరించారు. ‘ఈ ఏడాది అథారిటీ ఏర్పాటైన తర్వాత ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు చేసిన మొత్తాన్ని రీయింబర్స్ చేయాలి’ అని చేసిన తీర్మానాన్ని, తనకు అనుకూలంగా తీర్మానంలో ఉన్న ‘ఈ ఏడాది’ అనే పదాన్ని ఎగరగొట్టారు. ప్రా జెక్టు నిర్మాణానికి చేసిన ఖర్చును ప్రభుత్వానికి రీయింబర్స్ చేయాలని తీర్మానం చేసినట్లుగా తప్పుడు భాష్యం చెప్పారు. పోల వరం పనుల్లో పరోగతి కనిపించడం లేదని, ఇదే తీరుగా కొనసాగితే పనులు సకాలంలో పూర్తి కావడం సాధ్యం కాదంటూ అథారిటీ సీఈవో రాష్ట్ర ప్రభుత్వానికి నెల క్రితమే లేఖ రాశారని ‘సాక్షి’ పేర్కొంది. దానిపైనా సీఎం తన ప్రసంగంలో ప్రస్తావించలేదు. పనుల జాప్యానికి కారణమవుతున్న కాంట్రాక్టర్‌నే కొనసాగించాలని అథారిటీ భేటీలో సీఈవో ఎందుకు సూచించారంటూ ‘సాక్షి’ అడిగిన ప్రశ్నకూ ఆయన సమాధానం చెప్పలేదు.
     
    దొరికిపోయి దోబూచులాడారు..

    సాక్షి కథనం తప్పంటూ మంగళవారం తీవ్ర విమర్శలు గుప్పించిన బాబు.. బుధవారం ప్రచురించిన కథనంలో అడ్డంగా దొరికిపోయినట్లు గుర్తించి, ఈ అంశం మీద సభలో దోబూచులాడారు. విపక్ష నేత క్షమాపణలు చెప్పాలనే డిమాండ్‌ను విడిచిపెట్టి, ‘సాక్షి’ మళ్లీ బుధవారం కూడా తప్పురాసిందనే ఆరోపణలు చేసి ఊరుకున్నారు. మంగళవారం అంతగా రాద్ధాంతం చేసిన సీఎం బుధవారం అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. అథారిటీ సమావేశంలో చర్చిం చిన మిగతా సాధారణ విషయాలను చదివడానికే పరిమితమయ్యారు. ఇలావుంటే.. అధికార పార్టీ సభ్యుల మధ్య శాసనసభ లాబీల్లో ఈ అంశం చర్చనీయాంశమైంది.  ‘మా నాయకుడు(చంద్రబాబు) తొందరపడి ఆవేశానికి పోయి దొరికిపోయారు’ అని అధికార పార్టీ ఎమ్మెల్యేలు  అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement