పోలవరంలో అక్రమాలు బయటపెట్టిన ‘సాక్షి’పై మరో కేసు | Sate Govt decided to file another case on Sakshi Paper | Sakshi
Sakshi News home page

పోలవరంలో అక్రమాలు బయటపెట్టిన ‘సాక్షి’పై మరో కేసు

Published Thu, May 3 2018 3:47 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

Sate Govt decided to file another case on Sakshi Paper

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, సహాయ.. పునరావాస ప్యాకేజీలో భారీ ఎత్తున చోటుచేసుకున్న అక్రమాలను మార్చి 13వ తేదీ నుంచి 16 వరకూ సాక్ష్యాధారాలతోసహా వరుస కథనాల ద్వారా బయటపెట్టిన ‘సాక్షి’ దిన పత్రికపై కోర్టులో మరో కేసు వేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణ, సహాయ, పునరావాస ప్యాకేజీలో అక్రమాలకు పాల్పడిన వారిలో కేఆర్‌పురం ఐటీడీఏ గత పీవో షాన్‌మోహన్‌తోపాటూ మరికొందరు ఐఏఎస్‌లున్నారని పలు ప్రజాసంఘాల ప్రతినిధులు, బాధిత నిర్వాసితులు, గిరిజనులు వెల్లడించారు. బాధిత నిర్వాసితులు, గిరిజనులు, ప్రజాసంఘాల ప్రతినిధులు చేసిన ఆరోపణలతోపాటు అక్రమాలకు సంబంధించిన ఆధారపత్రాలతో ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురించింది. వీటిపై ప్రభుత్వంగానీ, సంబంధిత అధికారులుగానీ ఎలాంటి వివరణలు, ఖండనలు ఇవ్వలేదు.

అదే సమయంలో ఈ కథనాలపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాల్సిన సర్కారు పెద్దలు తద్భిన్నంగా ‘సాక్షి’పై కక్ష సాధింపులకు దిగారు. ‘సాక్షి’ మీద పరువు నష్టం దావా వేయాలని అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో ‘సాక్షి’ ఎడిటర్‌పై కోర్టులో కేసు వేసేందుకు షాన్‌మోహన్‌కు అనుమతి ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిరాధార కథనాలు ప్రచురించారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం.. ‘సాక్షి’ ప్రచురించిన కథనాలకు ఇప్పటివరకు వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కూ ఇదే రీతిలో కోర్టులో కేసు వేసేందుకు సర్కారు గత నెల 20న అనుమతివ్వడం విదితమే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement