గూడూరు టౌన్: చిరుతపులి సంచారంతో గిరిజనులు బెంబేలెత్తుతున్నారు. శుక్రవారం రాత్రి చెన్నూరు గ్రామంలోని పంట పొలాల్లో చిరుత సంచరించడాన్ని స్థానికులు గుర్తించారు. సవకతోటల్లో పనిచేసేందుకు వచ్చిన గిరిజనుల సమూహం ఉన్న చోటుకు చిరుత వచ్చింది. తొలుత జంగిడిపిల్లి(అడవిపిల్లి)అని భావించారు. అది జనం అలికిడి గమనించి ఒక్కసారిగా గాండ్రించడంతో వారు పరుగులు తీసారు. చిరుత ఎక్కడ దాడి చేస్తుందోనని భయాందోళనతో సమీపంలోని కటాలమ్మ దేవస్థానంలో రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఉదయం చుట్టుపక్కల వారికి చిరుత సంచరిస్తుందని చెప్పడంతో ఆ ప్రాంతమంతా కాలిగుర్తుల కోసం వెతుకులాడగా బురదగా ఉన్న ప్రాంతంలో గుర్తులు కనిపించాయి.
ఓబూళాపురం నుంచి క్రిష్ణపట్నం ఓడరేవుకు రైల్వేమార్గాన్ని అటవీ ప్రాంతంలో నిర్మిస్తుండటంతో అక్కడ యంత్రాల ధ్వనికి అటవీ ప్రాంతంలోని వన్య ప్రాణులు, క్రూరమృగాలు గ్రామాల వైపు పరుగులు తీస్తున్నాయి. ఈ విషయాన్ని గూడూరు అటవీశాఖ సెక్షన్ అధికారి ప్రతాప్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్ళగా చెన్నూరు గ్రామంలో చిరుత సంచరించనట్లు అక్కడి వారు సమచారం ఇవ్వడంతో సిబ్బందిని పంపి దాని అడుగుజాడలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇటీవల సైదాపురం మండలం తూర్పుపూండ్లలో జరిగిన దాడికి సంబంధించి అక్కడి అడుగుజాడలను సేకరించి ల్యాబ్‌కు పంపగా అది చిరుతపులి కాదని హైనా అయి ఉండవచ్చన్న నివేదికలను ల్యాబ్ అధికారులు అందజేసారని స్పష్టం చేశారు.
అటవీ అధికారుల పరిశీలన
గూడూరు టౌన్: గూడూరు రూరల్ పరిధిలోని చెన్నూరు గ్రామం సవకతోటల్లో చిరుత తిరుగుతుందని తెలియడంతో అటవీశాఖాధికారులు అక్కడకు చేరుకుని గిరిజనులను విచారించారు. ఈ సందర్భంగా గిరిజనులు శుక్రవారం రాత్రి రెండు అడుగుల ఎత్తు, మూడు అడుగులు పొడవున్న చిరుతపులిని చూశామని చెప్పడంతో వారు సవకతోటల్లో చిరుతపులి పాదముద్రలను పరిశీలించారు. జీపీఎస్ సిస్టం ద్వారా తనిఖీలు చేశారు.
చిరుతపులి, హైనాలు ఉన్న ప్రదేశం నుంచి 25 కి.మీ మేర తిరుగుతుంటుందని మొలకలపూండ్ల ప్రాంతం నుంచి చెన్నూరుకు సవకతోటల్లో 3 కీ.మీ మాత్రమే దూరం కావడంతో హైనా అక్కడకు వచ్చి ఉంటుందని అటవీశాఖధికారులు తెలిపారు.పాదముద్రల కొలతలు, ఫొటోలు తీసి ల్యాబ్‌కు పంపుతున్నామని అటవీశాఖాధికారులు మహ్మద్‌ఖాసీం, రవీంద్ర చెప్పారు. బోనును చెన్నూరు తోటల్లో ఏర్పాటు చేయడంతో పాటు సిబ్బందితో కలసి ఆ పరిసర ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తామన్నారు.
చెన్నూరు తోటల్లో చిరుత సంచారం
Published Sun, Mar 15 2015 1:51 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement