
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను అర్ధాంతరంగా నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం కావడంతో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ‘అసలు ఏమి జరిగింది’ అని ఆరా తీయడం మొదలు పెట్టింది. సోమవారం పలువర్గాల నుంచి వివరాల సేకరణ మొదలుపెట్టింది. ఏ నివేదికల ఆధారంగా ఎన్నికల కమిషనర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవడంపై కేంద్ర ఇంటలిజెన్స్ అధికారులు దృష్టిపెట్టారని తెలిసింది. ఎన్నికల నిలిపివేత వంటి కీలక నిర్ణయానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌పై ఎన్నికల కమిషనర్ విలేకరుల సమావేశంలో సంతకం చేశారని తెలిసి ఆశ్చర్యపోయారని సమాచారం.
ఎన్నికలను నిలిపివేస్తున్నట్టు నిర్ణయం తీసుకొని, గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశాక విలేకరుల సమావేశంలో వివరాలను ప్రకటించారా.. లేక ముందు విలేకరుల సమావేశంలో ప్రకటించి, ఆ తర్వాత గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారా అన్న సమాచారం తెలుసుకున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయంపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్‌తో భేటీ కావడం, ఆ తర్వాత పరిణామాలపై కేంద్ర ఇంటలిజెన్స్ అధికారులు ఆరా తీశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సోమవారం ఉదయమే గవర్నర్‌తో భేటీ అంశాలనూ పరిశీలనకు తీసుకున్నట్టు తెలిసింది.