మా ఘోష వింటారా?! | Central cabinet approval to polavaram combined in seemandhra | Sakshi
Sakshi News home page

మా ఘోష వింటారా?!

Published Tue, Feb 11 2014 2:43 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

Central cabinet approval to polavaram combined in seemandhra

 వేలేరుపాడు/అశ్వారావుపేట, న్యూస్‌లైన్: పోలవరం కారణంగా ఒరిస్సా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మునిగిపోతున్నది కేవలం 13 గ్రామాలే. అయినా వీరికి పరిహారం కోసం కేంద్రం గంగవైలెత్తి ఉరకలు పెడుతోంది. ప్రభుత్వంతో పాటు అక్కడి ప్రజాప్రతినిధులు కూడా పోలవరానికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు.  కానీ, మన రాష్ట్రంలో మునిగిపోతోంది 205 గ్రామాలు. నష్టపోతున్నది లక్షన్నర మంది ప్రజానీకం. ఇప్పుడు వీరి భవితవ్యం ఏమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు.

 నష్టపరిహారం, పునరావాసం సమస్యలకు తోడు ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం ఇక్కడి వారిని మరింత మానసిక  క్షోభకు గురిచేస్తోంది. అసలు మన ప్రజాప్రతినిధులు ఏం చే స్తున్నారో... అమాయక గిరిజనుల పక్షాన ఏం పోరాటాలు చేశారో... వారి బతుకు బండి సజావుగా సాగేందుకు ఎలా సహకరించారో .. వెతుక్కున్నా అర్థం కావడం లేదు.

ఈ పరిస్థితుల్లో అసలు పోలవరం ముంపు ప్రాంతాల్లోని వాస్తవిక పరిస్థితిపై ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక కథనం......
 పరిహారం పరిహాసమేనా?
 పోలవరం ప్రాజెక్ట్ వల్ల రెండు డివిజన్‌లలో వేలేరుపాడు, కుక్కునూరు, భద్రాచలం, వీఆర్‌పురం, చింతూరు, కూనవరం, బూర్గంపహాడ్ మండలాల్లో   38 వేల కుటుంబాల వారు నిర్వాసితులు కానున్నారు. ఆయా గ్రామాల్లో నీటిపారుదల శాఖ అందించిన లెక్కల ప్రకారం 72వేల ఎకరాలకు నష్టపరిహారం అందించాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు ప్రభుత్వం 22, 500 ఎకరాలకు రూ.165 కోట్ల మేర పరిహారం అందించింది.

ఇంకా యాభైవేల ఎకరాలకు సుమారు రూ.400 కోట్లకు పైగా పరిహారం చెల్లించాల్సి ఉంది. గిరిజనులకు భూమికి బదులు భూమి 32,220 ఎకరాలు అధికారిక లెక్కల ప్రకారం చూపించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు అధికారులు  కేవలం 1695 ఎకరాలను మాత్రమే గుర్తించగలిగారు. ఎక్కడా సెంటుభూమి గిరిజనులకు ఇవ్వలేదు. కానీ రెవెన్యూ పహణీ రికార్డుల్లో పట్టాదారు కాలంలో  రైతుల పేర్లు లేకుండా  ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ పేరును ప్రభుత్వం నమోదు చేయిస్తోంది.

 ఇలా వేలేరుపాడు, కుక్కునూరు, కూనవరం, భద్రాచలం, విఆర్‌పురం,చింతూరు మండలాల్లో 90 గ్రామాల్లో  3, 771 మంది గిరిజనులు తమకు చెందిన పదివేల 175 ఎకరాల 11 కుంటల భూమిపై పట్టాహక్కు కోల్పోయారు. ఆయా మండలాల్లో పహణీ రికార్డులో పట్టాదారు, అనుభవదారు కాలమ్‌లో గిరిజనుల పేర్లకు బదులు ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ పేర్లు రాస్తున్నారు. మీ సేవకేంద్రాల్లో  తీసుకునే పహణీనకళ్లలో   కూడా  ఆ గ్రామాల సర్వేనెంబర్‌లన్నీ ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ పేరుతో  నింపి ఉన్నాయి.

 పాల్వంచ పోలవరం యూనిట్-1 పరిధిలోని వేలేరుపాడు,కుక్కునూరు, కూనవరం మండలాల్లో 2,160 ఎకరాల పట్టాలు కలిగిన 787 మంది గిరిజనులకు భూమికి బదులు భూమి చూపించాల్సి ఉంది. 238 మంది గిరిజన రైతులకు చెందిన 873  ఎకరాల డీ పట్టాభూములకు కూడా భూమికిబదులు భూమి ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు భూసేకరణ చేపట్టిన పాల్వంచ యూనిట్-2పరిధిలోని కూనవరం, వేలేరుపాడు, మండలాల్లో తాళ్ళగుడెం,కొండాయిగుడెం, వుల్పర్‌పేట, బొజ్జరాయిగుడెం,గొమ్మువారిగుడెం,తాట్కూరుగొమ్ము,చిగురుమామిడి,నార్లవరం,తదితర గ్రామాల్లో 562 మంది గిరిజన రైతులు 1671.31 ఎకరాలు,  భద్రాచలం యూనిట్ 2 పరిధిలోని కూనవరం,విఆర్‌పురం,చింతూరు,మండలాల్లోని 40 గ్రామాల్లో 1944 మంది గిరిజనులు 5వేల20.06 ఎకరాలు భూమిని కోల్పోయారు. భద్రాచలం యూనిట్-2 పరిధిలోని భద్రాచలం, కూనవరం మండలాల్లో 20 గ్రామాల్లో 190 మంది గిరిజనులకు చెందిన 448.94 ఎకరాలు భూమికి బదులు భూమి చూపించాల్సి ఉంది.

 ఇందులో ఒక్క గ్రామంలో కూడా  ఏ ఒక్క  గిరిజనుడికి భూమి చూపించకుండానే  రికార్డుల్లో  వారి పేర్లను తొలగించారు. ఇంతలోనే మళ్లీ సీమాంధ్రలో కలిపే అంశం  తెరపైకి వచ్చింది. దీంతో తమ భవిష్యత్ ఎలా ఉంటుందోనని బాధితులు ఆందోళన చెందుతున్నారు.   ఇప్పటి వరకు తెలంగాణలో కొనసాగిన తమ గ్రామాలు ఆంధ్రాలో కలపడం  ఎంతవరకు న్యాయమని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

  మోడల్ కాలనీలు వృధాయేనా...?
 మీరు కోరుకున్న చోట పునరావాసం కల్పిస్తాం...అంతా మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది...అంటూ అధికారులు గతంలో   చెప్పిన మాటలకు  ఈ ప్రాంత నిర్వాసితులు తలొగ్గారు. తాముకోరుకున్న చోటనే  పునరావాసం కల్పిస్తున్నారని గ్రామాలు ఖాళీచేసేందుకు ఒప్పుకున్నారు. కానీ  అధికారులు ఆనాడు చెప్పిన మాటలు  నేడు నీటిమీద రాతలయ్యాయి.  జిల్లాలో ఐదేళ్ల క్రితం  నిర్వాసితుల కోసం మూడుచోట్ల తొమ్మిది కోట్ల వ్యయంతో   పునరావాస కాలనీలు నిర్మించారు.

 వేలేరుపాడు మండలం కొయిదా గ్రామపంచాయతీలోని పేరంటపల్లి, కాకీస్‌నూరు, టేకుపల్లి గ్రామాల్లో 333 గిరిజన కుటుంబాలకు అశ్వారావుపేట మండలం మద్దికొండలో మోడల్ కాలనీ నిర్మించారు. ఇక్కడ ప్రభుత్వం 23ఎకరాల 12కుంటల భూమిని కొనుగోలు చేసింది. ఈ పంచాయతీ పరిధిలో వ్యవసాయానికి అవసరమైన 425 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇక్కడ మొత్తం రూ.5 కోట్ల వరకు వెచ్చించారు.

 ఇదే మండలంలోని పూచిరాల కాలనీకి చెందిన 122 కుటుంబాల కోసం వేలేరుపాడు మండలం రాళ్లపుడిలో ఐదేళ్ల క్రితం పునరావాస కాలనీ పనులు చేపట్టారు.  ఇక్కడ రూ.3 కోట్ల వరకు వెచ్చించారు. కూనవరం మండలంలోని నిర్వాసితుల కోసం చర్ల మండలం కలివేరు వద్ద 12 ఇళ్లు నిర్మించారు. ఈ మూడు చోట్ల  మోడల్ కాలనీలు  నిరుపయోగంగా ఉన్నాయి.

 పరిహారం  పంపిణీలోనూ మోసం...
 జిల్లాలో నిర్వాసితులు భూనష్టపరిహారం పంపిణీలో కూడా మోసపోయారు.   ఇక్కడి ముంపు ప్రాంతంలో కేటగిరి-1కు లక్షాపదిహేనువేలు, కేటగిరి-2కు లక్షా30 వేలు, కేటగిరి-3కు లక్షా45 వేలు ఇచ్చారు. సారవంతమైన భూములైనప్పటికీ లక్షా45 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పశ్చిమ,తూర్పు జిల్లాల్లో కేటగిరిల తేడాలేకుండా  పంపిణీ జరిగింది. ఏ భూమికైనా సరే రూ.3లక్షల నుంచి రూ.3లక్షల50 వేలవరకు అందించారు.

   పరిహారం  పంపిణీ  జరిగిన ఆ జిల్లాల మండలాల్లో 1/70 చట్టం అమలులో  ఉంది. ఖమ్మం జిల్లాలో1/70 చట్టం అమలులోఉన్న గోదావరి పరివాహక ప్రాంతాల్లో  సారవంతమైన నల్లరేగడి నేలలున్నాయి. పశ్చిమ,తూర్పుగోదావరి జిల్లాల రైతులు వలసవచ్చి ఈ ప్రాంతంలో పంటలు సాగుచేసిన దాఖలాలు కూడా ఉన్నాయి.  ఇక్కడ మార్కెట్ విలువను ఉన్నతాధికారులుతగ్గించి చూపించారు.

 ప్రభుత్వసొమ్ము ఆదాచేసినట్లు గుర్తింపుపొందాలని  రైతులను ముంచారు. ఏది ఏమైనా తెలంగాణను వీడేదిలేదంటూ తమకు ఈ ప్రాంతంలోనే పునరావాసం కల్పించాలని, ఎకరాకు కనీస ధర ఐదులక్షలు ఇవ్వాలని, కుటుంబంలో 18 ఏళ్లు నిండిన యువకులకు ప్యాకేజీ అమలయ్యేలా చూడాలని, కుటుంబంలో అర్హత ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, కోరుకున్న చోట పునరావాసం కల్పించాలని నిర్వాసితులు కోరుతున్నారు.

 సంబంధాలను తెంచుకోమంటారా?
 ఈ ప్రాంత వాసుల సంబంధ బాంధవ్యాలు  పరిసర మండలాలతో ఉండటంతో అంతా దగ్గర గ్రామాల్లో స్థిరపడాలని అనుకున్నారు. అందువల్లనే గ్రామాలు ఖాళీచేసేందుకు మానసికంగా నిర్వాసితులు  సిద్ధపడ్డారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ గ్రామాలన్నిటినీ సీమాంధ్రలో కలిపేందుకు ఆలోచిస్తుండటంతో ముంపు ప్రాంత బాధితులు కలవర పడుతున్నారు. ఎన్నడూ తమకు సంబంధంలేని సీమాంధ్ర ప్రాంతంలో ఎక్కడ పునరావాసం కల్పిస్తారో? అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

 పశ్చిమ,తూర్పుగోదావరి జిల్లాల్లో ఎక్కడైనా తమ ప్రాంతానికి దూరంగా పునరావాసం కల్పిస్తే తమ పరిస్థితి ఏమిటని కలవరపడుతున్నారు. ఒక రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రం వెళితే తమకు  బతకగలిగే భరోసా ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పచ్చని అడవి తల్లిని నమ్ముకొని ఇక్కడి గిరిజనులు బతుకుతున్నారు. మైదాన ప్రాంతంలో అయితే వీరికి ఇబ్బందికర పరిస్థితులు చోటుచేసుకుంటాయనే వాదనలు బలంగా ఉన్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. ప్రధానంగా అటవీ ద్వారా పొందాల్సిన అటవీ ఆదాయవనరులు  కోల్పోతారు.

 చేపల  వేట అంటే  గిరిజనులకు అమితమైన ప్రేమ. గోదావరి పరివాహక ప్రాంతమైనందున చేపలవేట  ఎక్కువగా సాగిస్తుంటారు. ఇది కూడా వీరు కోల్పోతున్నారు. పోలవరం  ప్రాజెక్ట్   ముంపుతో ఈ ప్రాంతాన్ని  జలసమాధిచేస్తున్నందున ఈ ప్రాంత పోలవరం  రిజర్వాయర్  పై చేపలు  వేటాడేందుకు తమకే పూర్తి హక్కులు కల్పించాలని గిరిజనులు  డిమాండ్ చేస్తున్నారు.

 ఎప్పుడైనా మునిగేదే!
 పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినా.. కాకున్నా.. వేలేరుపాడు, కుక్కునూరు, భద్రాచలం, వీఆర్ పురం, చింతూరు, కూనవరం, భద్రాచలం మండలాల్లోని పలు గ్రామాలు ఏటా వరదలకు మునకకు గురవుతుంటాయి. గోదావరి ప్రవాహం ఉధృతంగా లేకున్నా.. భద్రాచలం దాటిన తర్వాత శబరి నది ప్రవాహం ఊపందుకుంటే గోదావరి ఉప్పొంగుతుంది.. పరీవాహక ప్రాంతాలను ముంచెత్తుతుంది.

 గతేడాది జులై, ఆగస్టు నెలల్లో కురిసిన కొద్దిపాటి వర్షాలకే గోదావరి వరద బీభత్సంగా వచ్చి పడింది. దీంతో పరీవాహక మండలాల్లో యాభైశాతం పైగా మునకకు గురయ్యాయి. ముంపు నెల రోజులకు మించకుండా ఉన్నప్పటికీ.. నష్టం కోట్లాదిరూపాయల్లో జరిగింది. కుక్కునూరు మండలంలో గుండేటివాగు, వేలేరుపాడు మండలంలో పెదవాగులు గోదావరి నీరు వెనక్కు ఎగపోటు వేయడంతో గ్రామాలను, గ్రామశివార్లలోని పంట పొలాలను ముంచెత్తుతాయి.

 ఎఫ్‌ఆర్‌ఎల్ రాళ్లు సరయినవేనా..?
 ఫుల్ రిజర్వాయర్ లెవల్ (ఎఫ్‌ఆర్‌ఎల్) రాళ్లు పేరిట పోలవరం రిజర్వాయర్ కట్టాక నిండితే ఇక్కడి దాకా నీళ్లు వస్తాయంటూ అధికారులు రాళ్లను పాతారు. కాగా ఈరాళ్లకు దాదాపు అరకిలోమీటరు దాకా గోదావరి వరద నీళ్లు ఏటా వస్తున్నాయి.

 పోలవరం నిర్మించకుండానే గోదావరి వరదకే ఇంత బీభత్సం జరుగుతుంటే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక..  ఫుల్ రిజర్వాయర్ లెవల్‌కు నీళ్లు ఉండగా.. మరోసారి గోదావరి వరద వస్తే.. అప్పుడు నీటిని ఎవరాపుతారు..? రిజర్వాయర్ గేట్లు, రిజర్వాయర్  ఆపరేషన్ అన్నీ సీమాంధ్ర అధికారుల చేతిలో ఉంటే.. ఇక్కడి భూభాగం మునకకు గురవుతుంటే పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు అధికారులకు సమాచారం ఎలా అందుతుంది..? గోదావరి వరద వచ్చిందంటే నిముషాల్లో నీటి మట్టాలు మారిపోతుంటాయి... ఒకవేళ ముంపు ఎఫ్‌ఆర్‌ఎల్ రాళ్లను దాటి వస్తే ముంపు గ్రామాలను పట్టించుకునే అధికారులెవరు? గతేడాది వరద బాధితులకు బియ్యం, ఆవకాయ పచ్చడి ఇచ్చి చేతులు దులుపుకున్న ఘనత మన అధికారులకు దక్కింది.

 రాష్ట్ర విభజన జరిగాక ఆంధ్ర ప్రజలుగా చెలామణీ అయ్యే మన వాళ్లు మునకకు గురయితే మన అధికారులు వెంటనే స్పందిస్తారా..? తెలంగాణ భూభాగంలో ముంపునకు గురవుతున్న వారికోసం ఆంధ్ర అధికార యంత్రాంగం ఆలోచిస్తుందా..? అనే సందేహాలకు సమాధానాలు వెతుక్కునే పనిలో ముంపు గ్రామాల ప్రజలున్నారు.
 
 పోలవరం కట్టేదాకా కష్టాలేగా..?
 పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు.. నిర్మాణం పూర్తయిన తర్వాతా.. నిర్వాసిత రైతులు వారు కోల్పోయిన భూముల్లో వేసవి కాలంలో.. నీటి నిల్వలు తక్కువగా ఉన్న రోజుల్లో వ్యవసాయం చేసుకోవచ్చని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పుడే చెప్పారు. అయితే.. ముంపు గ్రామాల ప్రజలు నష్టపరిహారం తీసుకున్నా  కొందరు వారి భూముల్లో వైఎస్ ఇచ్చిన భరోసాతో వ్యవసాయం చేసుకుంటున్నారు. పరీవాహక గ్రామాల్లో మంచినీటి పథకాలు గోదావరి నుంచే అమర్చబడ్డాయి.

 వీటితోపాటు ముంపులో లేని గ్రామాలకు కూడా మంచినీటి సరఫరా ఈపథకాల గుండా జరుగుతోంది. రుద్రంకోట వద్ద రూ.11 కోట్లతో తాగునీటి పథకాన్ని నిర్మిస్తున్నారు. ఈపథకం ద్వారా వేలేరుపాడు మండలంలోని అన్ని గ్రామాలకు గోదావరి నీటిని శుద్ది చేసి సరఫరా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర విభజనలో మండలం రెండు ముక్కలయితే.. పథకం ఆంధ్రలో ఉంటే తెలంగాణలోని మిగిలిన గ్రామాలకు తాగునీరు ఇస్తారా.. ఇవ్వరా.. అనే సందేహాలకు సమాధానాలు లేవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement