సాక్షి, అమరావతి: దేశంలో గ్రామాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచడానికి మొత్తం రూ.1,40,881 కోట్లతో గ్రామీణ స్వచ్ఛ భారత్–2 కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గ్రామాల్లో రోడ్లపై మురుగు నీరు, చెత్త కుప్పలు లేకుండా పనులు చేపడతారు. అలాగే వాడిన ప్లాస్టిక్ వస్తువులను తిరిగి వినియోగించడానికి వీలుగా వాటిని సేకరిస్తారు. గ్రామీణ స్వచ్ఛ భారత్–2 కార్యక్రమ అమలుకు సంబంధించిన సవరణ విధివిధానాలను శుక్రవారం కేంద్ర మంచినీటి సరఫరా, పారిశుధ్య అమలు శాఖ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్రాలకు లేఖలు రాసింది.
► మహాత్మాగాంధీ 150 జయంతోత్సవాలను పురస్కరించుకొని 2014 అక్టోబర్ 2న ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ మిషన్‌కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 2019 అక్టోబర్ 2 వరకు మొదటి దశ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేపట్టారు.
► గ్రామీణ ప్రజలకు మరింతగా పరిశుభ్రతను అలవాటు చేయాలన్న లక్ష్యంతో ఇప్పుడు ‘గ్రామీణ స్వచ్ఛ భారత్–2’కు శ్రీకారం చుట్టారు.
► ఇందులో భాగంగా ఈ ఆర్థిక ఏడాది నుంచి 2025 మార్చి నెలాఖరు వరకు ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
► ఈ కార్యక్రమాల అమలుకు ఆయా గ్రామాల జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తారు. ఇందుకయ్యే ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం, 60 శాతం కేంద్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.
► చెత్త సేకరణకు ఐదు వేల జనాభా పైబడిన గ్రామంలో ఒక్కొక్కరికి రూ.45 చొప్పున, ఐదు వేల లోపు జనాభా ఉండే గ్రామంలో ఒక్కొక్కరికి రూ.60 చొప్పున లెక్కగట్టి నిధులు కేటాయిస్తారు.
► గ్రామాల్లో మురుగునీటి వ్యవస్థ పర్యవేక్షణకు 5 వేల లోపు జనాభా ఉండే గ్రామంలో ఒక్కొక్కరికి రూ.280 చొప్పున, 5 వేల పైబడి జనాభా ఉన్న గ్రామంలో ఒక్కొక్కరికి రూ.660 చొప్పున నిధులు ఇస్తారు.
రాష్ట్రంలో 1,320 పెద్ద గ్రామాల్లో కార్యక్రమం
► 2020–21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమ అమలుకు రూ.1,700 కోట్లతో ప్రణాళికను సిద్ధం చేసి కేంద్రం ఆమోదానికి పంపారు.
► రాష్ట్రంలో తొలి ఏడాది మండలానికి రెండు గ్రామాల చొప్పున 1,320 పెద్ద గ్రామాల్లో కార్యక్రమ అమలుకు ప్రణాళిక సిద్ధం చేశామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment