చర్చనీయాంశంగా మారిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక
వినుకొండ: రాష్ట్ర రాజధాని ఏర్పాటుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికలో వినుకొండకు ప్రాధాన్యం ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. రాజధానిగా ఎంపిక చేస్తే వెనకబడిన వినుకొండ ప్రాంతం దశ తిరుగుతుందని స్థానికులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు వినుకొండ మధ్యలో ఉంటుంది. రాజధాని ఏర్పాటుకు అన్ని మౌలిక వసతులు పుష్కలంగా ఉన్న ప్రాంతాల జాబితాలో వినుకొండ అగ్రస్థానంలో ఉంది.
అందుకే శివరామకృష్ణన్ కమిటీ రాజధాని ఏర్పాటుకు వినుకొండ-మార్టూరు అనుకూలంగా ఉండవచ్చని తన నివేదికలో పేర్కొంది. నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం, కూత వేటు దూరంలోని దొనకొండ, మాచర్ల ప్రాంతాలూ రాజధానికి అనుకూలంగా ఉండవచ్చని నివేదికలో పేర్కొన్నారు. రాజధాని ఏర్పాటుకు కావాల్సిన ప్రభుత్వ భూములు, నీటి వనరులు ఇక్కడ పుష్కలంగాఉన్నాయి. సాగర్ జలాలు, గుండ్లకమ్మ నది పరీవాహక ప్రాంతం, నల్లమల అటవీ ప్రాంతం, ప్రభుత్వ భూములు ఉండడంతో వినుకొండ ప్రాంతంపై కమిటీ మొగ్గుచూపినట్లుగా భావిస్తున్నారు.
అదేసమయంలో విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు సరికాదని కమిటీ తేల్చింది. కమిటీ సభ్యుల సిఫార్సు మేరకు రాష్ట్ర రాజధానిగా ఏర్పాటైతే వినుకొండ పంట పండినట్లే. ఈ ప్రాంతానికి దశ మారుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. కమిటీ నివేదిక బహిర్గతం కావడంతో రియల్టర్‌లు ఇక్కడకు మకాం మార్చే అవకాశం ఉంది. కొంతకాలంగా భూములు, స్థలాల కొనుగోళ్లు మందకొండిగా జరుగుతున్నాయి. ఇప్పుడు భూముల ధరలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
రాజధానికి అనుకూలం
రాష్ట్ర రాజధానికి వినుకొండ అనుకూలమైన ప్రదేశం. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ప్రకారం ఇక్కడే రాజధాని ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాజధాని ఏర్పాటుకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు ఇక్కడ ఉన్నాయి. వినుకొండ , కురిచేడు ప్రాంతాల్లో వ్యవసాయానికి పనికిరాని వేల ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. రాజధాని ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి.
- బొల్లా బ్రహ్మనాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత
వినుకొండ దశ తిరిగేనా..?
Published Fri, Aug 29 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM
Advertisement
Advertisement