24న ఢిల్లీలో నిర్వహించే ధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానిద్దాం : వైఎస్ జగన్
మనతో కలసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుని పోరాటం చేద్దాం
రాష్ట్రంలో సాగుతున్న దారుణకాండను వారికి వివరిద్దాం
ఢిల్లీ ధర్నా తర్వాత పార్లమెంటు ఉభయ సభల్లోనూ గళమెత్తాలి.. రాష్ట్రంలోని ఘటనలతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం.. అందుకే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నాం
అదే విషయంపై పార్లమెంటులో నినదించాలి.. అలా చంద్రబాబుకు గట్టి హెచ్చరికలు పంపాలి
లేకపోతే ఈ దారుణాలకు అడ్డుకట్ట పడదు
అసెంబ్లీ సమావేశాల్లోనూ నిరసన.. గవర్నర్ ప్రసంగం సమయంలో ప్రభుత్వాన్ని నిలదీద్దాం
ఈ అరాచకాలు ఒక పార్టీకి పరిమితం కావు.. అవి ప్రజాస్వామ్య మనుగడకే పెద్ద దెబ్బ
లక్షలాది మంది పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది
వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ సమావేశంలో ఎంపీలకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం
ఢిల్లీలో ధర్నా కార్యక్రమానికి అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నాం. ఈ పోరాటంలో మనతో వచ్చే అన్ని పార్టీలను కలుపుకుని పోదాం. ధర్నాలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులంతా పాల్గొంటారు. రాష్ట్రంలో కొనసాగుతున్న దారుణకాండను యావత్ దేశం దృష్టికి తీసుకెళ్దాం. రాష్ట్రంలో గత 45 రోజులుగా ఏం జరుగుతోందో వివరిద్దాం. ధర్నా అనంతరం పార్టీ ఎంపీలు పార్లమెంట్‌కు హాజరవ్వాలి. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసంపై ఉభయ సభల్లో గట్టిగా మాట్లాడాలి. ఇక్కడ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న దురాగతాలను అందరి దృష్టికి తీసుకెళ్లాలి.
– వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, విధ్వంసాలు సృష్టిస్తూ చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దారుణకాండను యావత్ దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీలో ఈ నెల 24వ తేదీ బుధవారం నిర్వహించే ధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు.
గత 45 రోజులుగా రాష్ట్రంలో ఏం జరుగుతోందో వివరించి.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటంలో కలిసి వచ్చే అన్ని పార్టీలనూ కలుపుకుపోదామని ఎంపీలకు సూచించారు. ధర్నా అనంతరం పార్లమెంట్‌కు హాజరై రాష్ట్రంలో సాగుతున్న ఆటవిక పాలనపై గళమెత్తాలని దిశా నిర్దేశం చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కక్షతో చేస్తున్న దురాగతాలను తమ సభల్లోని సభ్యులందరి దృష్టికి తీసుకెళ్లాలని ఉద్భోధించారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం ఆయన తాడే పల్లిలోని క్యాంప్ ఆఫీసులో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. సమావేశాల్లో అనునరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. ‘ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర హోం మంత్రి అపాయింట్‌మెంట్లు కోరాం. అపాయింట్‌మెంట్లు రాగానే.. వారికీ ఇక్కడి పరిస్థితిని వివరిస్తాం. ఢిల్లీలో ధర్నా, నిరసన కార్యక్రమానికి సంబంధించి ఒక్కో ఎంపీ ఒక్కో బాధ్యత తీసుకోవాలి. వెంటనే ఢిల్లీ వెళ్లి ఆ పనుల్లో నిమగ్నం కావాలి.
ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు ప్రజల్లో మరింత ఆగ్రహానికి దారి తీస్తున్నాయి. అందుకే మనం రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తున్నాం. అలా చంద్రబాబుకు గట్టిగా హెచ్చరికలు పంపాలి. పోరాటం చేయకపోతే దారుణాలకు అడ్డుకట్ట పడదు. అసెంబ్లీ సమావేశాల్లోనూ నిరసన వ్యక్తం చేస్తాం. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సమయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రాష్ట్రంలో దారుణాలు, అరాచకాలు, ఇక్కడ జరుగుతున్న ఘటనలపై అందరూ గళమెత్తాల్సిన అవసరం ఉంది’ అని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
ప్రజాస్వామ్య మనుగడకే పెను ప్రమాదం
రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఘటనలు ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు. అవి ప్రజాస్వామ్య మనుగడకు పెద్ద దెబ్బ. అందుకే అన్ని పార్టీలకూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి వివరించాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందింది. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల మీద దారుణంగా దాడులు జరగుతున్నాయి.
వినుకొండలో రషీద్ హత్యే ఇందుకు పరాకాష్ట. ఆ హత్య వీడియో దృశ్యాలు.. రాష్ట్రంలో దారుణంగా ఉన్న శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ప్రజలందరూ చూస్తుండగా, నడిరోడ్డు మీద కత్తితో నరికి చంపిన తీరు అత్యంత అమానుషం. తమ రాజకీయ ప్రత్యర్థులకు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ఒక మెసేజ్ పంపడానికి చేసిన ప్రయత్నం ఇది.
రషీద్ హత్యపై వక్రీకరణకు యత్నం
వినుకొండలో దారుణ హత్యకు గురైన పార్టీ కార్యకర్త రషీద్ ఒక వైన్ షాపులో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. ఆ రాజకీయ హత్య ఘటనను వక్రీకరించడానికి ఎల్లో మీడియా సహాయంతో ప్రభుత్వం నానా ప్రయత్నాలు చేస్తోంది. ఏదో బైక్ కాల్చిన ఘటనకు, ఇప్పుడు జరిగిన దారుణ హత్యకు ముడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఆ కాలిన బైక్.. వైఎస్సార్‌సీపీ వాళ్లది. ఇందుకు సంబంధించి కేసు కూడా నమోదైంది. దాన్ని కూడా ట్విస్ట్ చేసి, నానా తప్పుడు రాతలు రాస్తున్నారు.
అసలు తమ కొడుకు ఏం తప్పు చేశాడని రషీద్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ‘సీఎంగా వైఎస్ జగన్ ఉంటే.. అంతా మంచి జరుగుతుందని నమ్మడం మా తప్పు అవుతుందా?’ అని వారు ప్రశ్నిస్తున్నారు. హంతకుడైన జిలానీ.. లోకేశ్ పుట్టిన రోజున, స్థానిక ఎమ్మెల్యే భార్యకు స్వయంగా కేక్ తినిపించిన ఫొటోలను రషీద్ తల్లిదండ్రులు చూపారు. స్థానిక ఎమ్మెల్యేతో కూడా కలిసి దిగిన హంతకుడి ఫొటోలను వారు చూపించారు.
హత్యలు.. హత్యాయత్నాలు.. వేధింపులు.. విధ్వంసాలు
పల్నాడు జిల్లాకు కొత్త ఎస్పీ వచ్చిన రెండు మూడు రోజుల్లోనే హత్యతో సహా పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. అంతకు ముందు మల్లికా గార్గ్ జిల్లా ఎస్పీగా ఉన్నారు. ఆమె సమర్థురాలు. అందుకే ఆమెను ఉద్దేశ పూర్వకంగా బదిలీ చేశారు. తమకు అనుకూలంగా ఉండే ఎస్పీని నియమించుకుని ఈ దారుణాలు చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ 45 రోజుల్లో 36 మంది రాజకీయ హత్యలకు గురయ్యారు. 300కు పైగా హత్యాయత్నాలు జరిగాయి.
తెలుగుదేశం పార్టీ వారి వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 560 చోట్ల ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. ఇళ్లల్లోకి చొరబడుతున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. షాపులను కాల్చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులకు చెందిన చీనీ చెట్లు నరికేస్తున్నారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులు సైతం ధ్వంసం చేశారు. ఇవి కాక 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయి. హత్యలు, దాడులు చేయడానికి టీడీపీ వాళ్లకి లైసెన్స్ ఇచ్చినట్టుగా ఉంది.
ఎంపీపైనా యథేచ్ఛగా దాడి
మరోవైపు తన సొంత పార్లమెంటు నియోజకవర్గంలో, తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలోనే ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడులు చేశారు. కావాలనే అక్కడ టీడీపీ మనుషులు ఉండేలా, పోలీసులతో ప్లాన్ చేసి మరీ దాడులు చేశారు. మాజీ ఎంపీ రెడ్డప్ప ఒక న్యాయవాది. ఎంపీ మిథున్‌రెడ్డి పుంగనూరులో ఆయన ఇంటికి వెళ్తే, రాళ్లతో దాడి చేసి.. వాహనాలు కూడా ధ్వంసం చేశారు. మాజీ ఎంపీ రెడ్డప్పకు చెందిన వాహనాన్ని దగ్ధం చేశారు. అన్ని తప్పులు చేసిన వారే, తిరిగి మన పార్టీ వాళ్ల మీద కేసులు పెడుతున్నారు.
ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుందా?
రాష్ట్రంలో 15 ఏళ్లుగా వైఎస్సార్‌సీపీ ప్రస్థానం సాగుతోంది. చంద్రబాబు ఆశించినట్టుగా వైఎస్సార్‌సీపీని అణగదొక్కలేరు. ఎవరు అధికారంలో ఉన్నా ఇలాంటి దాడులు మంచివి కావు. అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో లేని పార్టీ మీద దాడులు చేయడం ధర్మమా? ఇలాగైతే ప్రజాస్వామ్యానికి విలువ ఏముంటుంది? ప్రభుత్వాలు చేసే మంచి పనుల ఆధారంగా ఆ పార్టీ పరిస్థితులు ఉంటాయి. గత ఎన్నికల్లో మనం 86 శాతం సీట్లను గెలిచాం.
అయినా ఇలాంటి ఘటనలు జరగలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఓటు వేయని వారికి కూడా ఇంటింటికీ వెళ్లి పథకాలు ఇచ్చాం. దాడులను ఎప్పుడూ ప్రోత్సహించలేదు. ప్రజలందరినీ సమానంగా చూశాం. అందరికీ పారదర్శకంగా సేవలు అందించాం. ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు కాకపోవడంపై ఎవ్వరూ ప్రశ్నించకూడదన్నదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. దీనిపై ఎవరూ నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు చేయకూడదన్నదే ప్రభుత్వ ఆలోచన.
అందుకే దగ్గరుండి విధ్వంసకాండను ప్రోత్సహిస్తున్నారు. పార్టీకి కార్యకర్తలు చాలా ముఖ్యం. ఎక్కడ కార్యకర్తలకు నష్టం జరిగినా వెంటనే స్పందించడం, వారిని కాపాడుకోవడం మన బాధ్యత. ఆయా కుటుంబాలకు తోడుగా నిలవాలి. కార్యకర్తలందరి తరఫున గట్టిగా నిలబడాలి. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీకి లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది.
Comments
Please login to add a commentAdd a comment