ఛైర్మన్‌కు చెక్ | Chairman of the Czech | Sakshi
Sakshi News home page

ఛైర్మన్‌కు చెక్

Published Thu, Jan 1 2015 6:49 AM | Last Updated on Fri, Mar 22 2019 6:16 PM

Chairman of the Czech

  • సమావేశానికి డుమ్మా కొట్టిన 11 మంది టీడీపీ కౌన్సిలర్లు
  • హైకమాండ్ దృష్టికి చైర్మన్ వ్యవహార శైలి
  • ప్రొద్దుటూరు టౌన్: ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ఏకంగా 11 మంది టీడీపీ కౌన్సిలర్లు గైర్హాజరు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఛైర్మన్ ఉండేల గురివిరెడ్డికి చెక్ పెట్టేందుకే ఒక వర్గంలోని కౌన్సిలర్లు పూర్తి స్థాయిలో హాజరు కాకుండా తమ బలాన్ని చూపించారా అన్న విధంగా బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.

    గత కొంత కాలంగా ఛైర్మన్‌తోపాటు అతని బావమర్దులు మున్సిపాలిటీలో అన్ని విషయాల్లో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ కనీస గౌరవం కూడా ఇవ్వలేదన్న విషయంపై లోలోపల పలువురు టీడీపీ కౌన్సిలర్లు మథనపడుతూ వచ్చారు. ఏ విషయాన్ని కౌన్సిలర్లు ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లినా ఆలకించే పరిస్థితి లేదన్న ఆవేదనను పలువురు టీడీపీ కౌన్సిలర్లు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు.

    ఈ దశలో చైర్మన్ వ్యవహార శైలిని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లేల లింగారెడ్డితోపాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి రావెల కిశోర్‌బాబు దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో బుధవారం కౌన్సిల్ అజెండాలో రూపొందించిన 50 మంది ఔట్‌సోర్సింగ్ కార్మికులను తీసుకునే అంశంలో కొందరు టీడీపీ కౌన్సిలర్లు పార్టీకి సేవ చేసిన వారితో పాటు తమ వర్గీయుల్లో కొందరిని తీసుకోవాలన్న అంశాన్ని లేవనెత్తారు.

    ఇందుకు ఛైర్మన్ ఒప్పుకోకపోవడంతో సమావేశానికి వచ్చేది లేదని ప్రకటించారు. చెప్పిన విధంగానే టీడీపీ కౌన్సిలర్లల్లో ముఖ్యుడుగా ఉన్న వైస్ చైర్మన్ వైఎస్ జబీవుల్లాతోపాటు అతని వర్గీయులుగా ఉన్న కౌన్సిలర్లు మహ్మద్ రఫీ, హయాతున్, సాబిరాభాను, మరో వర్గం కౌన్సిలర్లు అయిన పిట్టా శ్రీనివాసులు, గంటసాల సావిత్రమ్మ, కాకుమాని ఆనంద్, భ్రమరాంబ, మార్తల రామమునిరెడ్డి, సోమా చెన్నకృష్ణమ్మలు గైర్హాజరయ్యారు.
     
    హైకమాండ్ దృష్టికి సమస్య

    టీడీపీ కౌన్సిలర్లుగా గెలుపొందిన తమకు ఎలాంటి గౌరవం ఇవ్వకుండా చైర్మన్, చైర్మన్ బావమర్దులు వ్యవహరిస్తున్న తీరును కొందరు టీడీపీ కౌన్సిలర్లు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆరు నెలల కాలంలో తమకు సంబంధించిన ఏ ఒక్క చిన్న పని కూడా మున్సిపాలిటీలో కావడం లేదని హైకమాండ్‌కు కౌన్సిలర్లు వివరించినట్లు సమాచారం. అలాంటప్పుడు తాము చైర్మన్‌కు ఎందుకు మద్దతు ఇవ్వాలనే విషయంపై హైకమాండ్‌లోని కొందరు ముఖ్యులతో ఇప్పటికే చర్చించారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ వర్గంలో లుకలుకలు మొదలయ్యాయి.

    బీసీ వర్గంలో ముఖ్యుడుగా ఉన్న ఓ టీడీపీ కౌన్సిలర్ గతంలో ఇక్కడ పనిచేసిన కమిషనర్‌తో సఖ్యతగా ఉన్న విషయంపై చైర్మన్ వర్గీయులు అతనిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని చైర్మన్ కూడా ప్రస్తావించడంతో ఆ కౌన్సిలర్‌తోపాటు ఆయన వర్గీయులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కనీసం కౌన్సిల్‌లో కూడా ఈ కౌన్సిలర్ మాట్లాడాలంటే అదే పార్టీకి చెందిన చైర్మన్ వర్గీయ కౌన్సిలర్లు పక్క నుంచి కామెంట్ చేస్తుండటంతో తీవ్ర ఆవేదనకు ఆ వర్గం గురైంది.

    ఈ విధంగా ఒక అంశంలోనే కాకుండా ప్రతి అంశంలో కూడా చైర్మన్ ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్లను తన కోటరీలుగా పెట్టుకుని వ్యవహరిస్తున్న శైలిపై ఆ పార్టీ కౌన్సిలర్లు హైకమాండ్‌లోని ముఖ్య నాయకుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఏది ఏమైనా టీడీపీలో జరుగుతున్న అంతర్గత పోరు ఆసక్తికరంగా మారింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement