నల్లగొండ : సుదీర్ఘ కాలం తర్వాత పుర పీఠాలు కొలువుదీరబోతున్నాయి. మూడున్నరేళ్ల తర్వాత మళ్లీ పాలక వర్గాల ప్రవేశంతో మున్సిపాలిటీల్లో రాజకీయ వాతావరణం సాక్షాత్కారం కాబోతుంది. మున్సిపాలిటీ పాలక వర్గాల పదవీ కాలం 2010 అక్టోబర్‌లో ముగిసింది. అప్పటి నుంచి ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేక అధికారుల సారథ్యంలోనే పాలన కొనసాగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు పూర్తికాగా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పాలక వర్గాలు మున్సిపాలిటీల్లో అడుగుపెట్టనున్నాయి. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ వార్డులను సొంతం చేసుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో టీడీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ సభ్యులు గెలుపొందారు. కాగా చైర్మన్, వైస్‌చైర్మన్లతో పాటు కోఆప్షన్ సభ్యులను గురువారం ఎన్నుకుంటారు. అన్ని స్థానాలకు కలిపి మొత్తం 34 పదవులు భర్తీకా నున్నాయి.
‘హస్త’గతమయ్యేనా?
నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు ఎక్కువ మంది గెలుపొందారు. కాబట్టి చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులకు అవసరమయ్యే మెజార్టీ కాంగ్రెస్‌కు సరిపోతుంది. కాగా కోదాడ, భువనగిరి, సూర్యాపేట మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. దీంతో క్యాంపు రాజకీయాలకు తెరతీసిన రాజకీయ పార్టీలు కౌన్సిలర్లను వివిధ ప్రాంతాలకు తరలించారు. ఎలాగైనా చైర్మన్ పీఠాలను సొంతం చేసుకోవాలన్న ప్రయత్నంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీలు పోటీ పడ్డాయి. టీఆర్‌ఎస్‌కు మున్సిపాలిటీల్లో తగినంత బలం లేకున్నా కాంగ్రెస్, టీడీపీలకు చెందిన కౌన్సిలర్లను తమపార్టీలో చేర్చుకుని చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే నల్లగొండ, సూర్యాపేటలలో మంత్రి జగదీష్‌రెడ్డి నేతృత్వంలో టీడీపీ, కాంగ్రెస్‌లకు చెందిన కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో ఆ రెండు మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పోటీ పడుతున్నాయి.
హంగ్ స్థానాల్లో ఎన్నిక రసవత్తరం
కోదాడ, సూర్యాపేట, భువనగిరి మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. దీంతో ఈ మూడు స్థానాల్లో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్‌లు నువ్వా.. నేనా.. అన్న రీతిలో పోటీ పడుతున్నాయి. కోదాడలో చైర్మన్ పీఠాన్ని సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్‌కు సంఖ్యా బలం తక్కువగా ఉన్నందున స్థానిక ఎమ్మెల్యే నలమాద పద్మావతి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎక్స్‌ఆఫీషియో సభ్యుల హోదాలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కావున ఇక్కడ చైర్మన్ పీఠం అనివార్యంగానే కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లనుంది. సూర్యాపేటలో బీజేపీ, టీడీపీల మధ్య సయోధ్య కుదిరిన పక్షంలో ఇరు పార్టీల ఒప్పందం ప్రకారం చైర్మన్ పీఠం టీడీపీ వశమయ్యే అవ కాశం ఉంది. భువనగిరి మున్సిపాలిటీ లో కూడా ఈ రెండు పార్టీల అంగీకారం మేరకు చైర్మన్ పీఠం బీజేపీకి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. మొత్తంగా ఏడు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఐదు చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల బీజేపీ, టీడీపీకి దక్కే అవకాశాలు ఉన్నాయి.
భారీ బందోబస్తు
పుర పీఠాల ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీ కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎన్నిక లు జ రిగే సమావేశ మందిరాల్లోకి కౌన్సిలర్లు, వారి కుటుంబ సభ్యులు, ఎక్స్‌ఆఫీషియో సభ్యులుగా ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రమే లోపలికి అనుమతిస్తారు.
ఎన్నిక ఇలా..
ఉదయం 10 గంటలకు ఎన్నికల ప్రత్యేక అధికారి, మున్సిపల్ కమిషనర్‌ల సమక్షంలో సభ ప్రారంభమవుతుంది. తొలుత గెలుపొందిన సభ్యులచే తెలుగులో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత చైర్మన్, వైస్‌చైర్మన్‌లను ఎన్నుకునేందుకు అర్హులైన వారిలో సగంమంది సమావేశ ం ప్రారంభమైన గంటలోపు హాజరైతే కోరం ఉన్నట్లు పరిగణిస్తారు. చైర్మన్ పదవికి పోటీ చేసే వారి పేరును ఒక సభ్యుడు సూచిస్తాడు. మరో సభ్యుడు దానిని సమర్థించాల్సి ఉంటుంది. ఒకరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే చేతులెత్తే పద్ధతి ద్వారా వారు ఓటు వేయాల్సి ఉంటుంది. ఎవరికి ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉంటే వారిని చైర్మన్‌గా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఇద్దరు అభ్యర్థులకు సరిసమానంగా ఓట్లు వస్తే అప్పుడు డ్రా ద్వారా చైర్మన్‌ను ఖరారు చేస్తారు.
నేడు పుర పీఠాలకు ఎన్నిక
Published Thu, Jul 3 2014 2:54 AM | Last Updated on Mon, Sep 17 2018 4:52 PM