నెల్లూరు (టౌన్): కార్పొరేషన్ ఎన్నికలతో నెల్లూరు టీడీపీలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం పెను తుపానులా మారింది. పరిస్థితులు చేయి దాటిపోవడంతో ఏకంగా పార్టీ అధినేతే రంగంలోకి దిగారు. కీలకమైన పార్టీ నగర కమిటీని రద్దు చేయడంతో పాటు సీనియర్ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరి కొందరు నేతలకు షోకాజ్ నోటీసులను జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో అంతా తామై వ్యవహరించిన ఇన్‌చార్జీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాలపై మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశం నెల్లూరు టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
సస్పెన్షన్లు..
టీడీపీలో తీవ్ర నిర్ణయాలకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్, సీనియర్ నేత కిలారి వెంకటస్వామినాయుడ్ని సస్పెండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేలూరు రంగారావును పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. తాము బాధ్యత తీసుకున్న డివిజన్లలో అభ్యర్థులను పోటీలో ఉంచలేకపోయారనే ఆరోపణల నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్‌చౌదరికి షోకాజ్ నోటీస్‌ను జారీ చేశారు. సమాధానం చెప్పాల్సిందిగా జెన్ని రమణయ్యను ఆదేశించారు. జిల్లా కమిటీ తర్వాత అత్యంత కీలకమైన పార్టీ నెల్లూరు నగర కమిటీ, 54 డివిజన్ల కమిటీలను కూడా రద్దు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చ ర్చనీయాంశంగా మారింది.
డివిజన్ల వారీగా సమీక్షను చంద్రబాబు నిర్వహించారు. ప్రతి డివిజన్‌కు సంబంధించిన అంశాల్లో పూర్తిగా విఫలమయ్యారంటూ సిటీ, రూరల్ ఇన్‌చార్జీలు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అబ్దుల్ అజీజ్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సమీక్షలు జరిగిన వాతావరణాన్ని గమనిస్తే ఇన్‌చార్జీలపై తీవ్ర చర్యలు తీసుకోనున్నారని, వీరిని పదవుల నుంచి తొలగించనున్నారని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. 54 డివిజన్లకు గాను ఒకటి నుంచి 24 డివిజన్ల సమీక్షను శనివారం నిర్వహించారు.
పోటీ చేసిన అభ్యర్థులతో స్వయంగా మాట్లాడారు. నామినేషన్ పత్రాలను సైతం కొంతమంది సక్రమంగా పూరించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగిలిన 30 డివిజన్లకు సంబంధించిన సమీక్షను మరో వారంలో నిర్వహించనున్నామని ప్రకటించారు. మరో విడత సమీక్ష ఉన్న తరుణంలో ఇన్‌చార్జీలపై వేటుకు సమయం తీసుకోనున్నారనే చర్చ సాగుతోంది. మలి విడత సమీక్ష అనంతరం చర్యలు మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. కాగా తప్పు చేసిన ఇన్‌చార్జీలను వదిలి చోటా నేతలపై చర్యలు తీసుకోవడం బాధగా ఉందని పలువురు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment