'చంద్రబాబు.. ఓ డ్రామాల మాస్టారు'
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ డ్రామాల మాస్టారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి విమర్శించారు. విశాఖలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... శాంతి భద్రతల సమస్య లేనప్పుడు.. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాల్సిన అవసరం గవర్నర్ నరసింహన్కు లేదని ఆయన పేర్కొన్నారు. బీజేపీతో కలిసి కాపురం చేస్తున్నప్పుడు వాళ్లచేతే సెక్షన్ 8 అమలు చేయించుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు.
పబ్లిసిటీ కోసం డ్రామాలెందుకని ఈ సందర్భంగా చంద్రబాబుని ప్రశ్నించారు. చంద్రబాబు తప్పుచేశారు కాబట్టే.. ఆయన వాయిస్ కరెక్టేనని బీజేపీ నమ్మిందని చెవిరెడ్డి పేర్కాన్నారు. ఆ కారణంతో బీజేపీ కార్యకర్త కూడా కనీసం మద్దతివ్వడం లేదన్నారు. పరిపాలన చేసేటప్పుడు హుందాగా ఉందాలని, 'ఓటుకు కోట్లు' కేసులో తప్పు చేయలేదంటే తప్పు చేయలేదని చెప్పాలి.. లేదంటే శిక్షకు సిద్ధపడాలని ఆయన అభిప్రాయపడ్డారు.