సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ కేంద్ర మంత్రుల బృందానికి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎందుకు లేఖ రాయడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యురాలు ఆర్.కె.రోజా ప్రశ్నించారు. అలా లేఖ రాయకపోవడం ద్వారా వారిద్దరూ విభజనకు సహకరిస్తున్నారని సోమవారం విలేకరుల భేటీలో దుయ్యబట్టారు. జీవోఎం లేఖకు కాంగ్రెస్ ఎలాంటి బదులూ ఇవ్వలేదని, టీడీ పీ నేతలేమో ఏమీ చెప్పకుండా నానుస్తున్నారని ఆక్షేపించారు.
బాబు ప్రతి అడుగూ విభజనకు సహకరించేదిగానే ఉందన్నారు. ‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజన జరగరాదంటూ మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జీవోఎంకు లేఖ రాశారు. తొమ్మిదేళ్లు సీఎంగా, ఇప్పుడు విపక్ష నేతగా ఉన్న బాబు విభజనపై తన వైఖరిని వెల్లడిస్తూ జీవోఎంకు లేఖ రాయకుండా తప్పించుకు పారిపోతున్నారు. జీవోఎంను బహిష్కరిస్తున్నానని చెప్పడం ద్వారా విభజనకు సహకరిస్తున్నారు. గతంలో ఇచ్చిన విభజన లేఖను ఆయన ఎందుకు వెనక్కు తీసుకోవడం లేదు? ఏమీ చెప్పకుండా ఆత్మగౌరవ యాత్రకు ఎందుకు బయల్దేరుతున్నారు’’ అని ప్రశ్నించారు.
మంత్రులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు
మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని.. నల్లగొండ జిల్లాలో తుపాను బాధిత రైతులను పరామర్శించకుండా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను అడ్డుకున్నారని వైఎస్‌ఆర్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది.