
మళ్లీ చంద్రబాబు విజన్ 2020
కొత్త అభివృద్ధి వ్యూహాన్ని అమలుచేసేందుకు మరోసారి విజన్ 2020ని టీడీపీ ప్రభుత్వం తెరమీదకు తీసుకొచ్చింది. దాంతోపాటు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు విజన్ 2029 ప్రవేశపెడతామంటోంది. ఈ విషయాలను రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేసేందుకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని అన్నారు.
నిర్దిష్ట రంగాల్లో కార్యక్రమాల అమలు కోసం ఏడు మిషన్‌లను ఏర్పాటు చేస్తామని, ప్రతి మిషన్‌కు ఛైర్ పర్సన్‌గా ముఖ్యమంత్రి ఉంటారని తెలిపారు. అన్ని గ్రామాలనూ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేస్తామని, నెల్లూరు జిల్లాలో స్మార్ట్ సిటీ ఏర్పాటు చేస్తామని యనమల చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా కాకికాడలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని, రాష్ట్రంలోని అన్ని గ్రామాలను గిగాబిట్‌తో అనుసంధానం చేస్తామని అన్నారు. ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తికైనా డిజిటల్ అక్షరాస్యత ఉండాలని, రాష్ట్రాన్ని డిజిటల్ ఆంధ్రప్రదేశ్‌గా రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.