సాక్షి, అమరావతి : ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టడానికి తాము వ్యతిరేకం కాదని, తాము కూడా సమర్థిస్తున్నామని, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. అసెంబ్లీలో గురువారం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 2017లోనే తాము బ్రిటీష్ కౌన్సిల్‌తో అవగాహనా ఒప్పందం చేసుకుని లక్ష మంది విద్యార్థులకు ఇంగ్లిష్‌లో శిక్షణ ఇచ్చామని చెప్పారు. దీనిపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కలుగజేసుకుని లక్ష మందికి శిక్షణ పేరుతో ముందుగానే డబ్బు చెల్లించారని, 30 వేల మందికి కూడా శిక్షణ ఇవ్వలేదని, ఇది పెద్ద బోగస్ అని అన్నారు.
దీనిపై విచారణ చేయిస్తామని చెప్పారు. తాము ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు సాక్షిలో వ్యతిరేకంగా వార్తలు రాశారని చంద్రబాబు అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. పత్రికల్లో వచ్చిన వార్తలు కాదని, అలా అంటే నీ పాంప్లెట్ పేపర్ ఈనాడులో వచ్చిన వార్తల గురించి చాలా చెప్పాల్సి ఉంటుందన్నారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సాక్షి పేపరు, చానెల్ (టీవీ) ఉన్నాయని, టీఆర్‌ఎస్ పార్టీకి పేపరు, చానెల్ ఉందని, శివసేన పార్టీకి సామ్నా పత్రిక ఉందని, తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఒక్క పేపరుగానీ, ఒక్క చానెల్‌గానీ లేదన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా సభ్యులంతా నవ్వుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment