
తెలంగాణపై చంద్రబాబుది గందరగోళ వైఖరి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అంశంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వైఖరి మొదటి నుంచీ గందరగోళంగానే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ వ్యాఖ్యానించారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో శనివారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని రాష్ట్ర విభజన అంశంలో తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రబాబు తాజాగా ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు రాసిన లేఖ విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా.. ఆయన పైవిధంగా బదులిచ్చారు. తెలంగాణకు అనుకూలంగా బాబు స్పష్టంగా కేంద్రానికి లేఖ రాసినందున దీనిపై ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాబోయే సాధారణ ఎన్నికల దృష్టితోనే విభజనపై నిర్ణయం తీసుకుందనుకోవడం వింతేమీ లేదన్నారు.
సీపీఐ ఆషామాషీగా తెలంగాణకు అనుకూలమైన వైఖరి తీసుకోలేదని, 1999 నుంచి ఈ అంశంపై తమ పార్టీలో చర్చ జరిగిందని చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ అనుమతితో 2000లో తెలంగాణ పది జిల్లాల పార్టీ కమిటీలు వరంగల్‌లో సమావేశమై ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్లతో వరంగల్ డిక్లరేషన్‌ను ప్రకటించామని గుర్తుచేశారు. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ తమ డిమాండ్లను పరిష్కరించలేదని చెప్పారు. ఆ తర్వాతే కేసీఆర్ బయటకొచ్చి టీఆర్‌ఎస్ పార్టీ పెట్టారన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మేం మారుతున్నామని నారాయణ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే రాష్ట్రపతి పాలనకు అనుకూలంగా ఉన్నాయని, అది మంచిది కాదని హితవు పలికారు. ఎంత పనికిమాలిన ముఖ్యమంత్రి ఉన్నా పర్వాలేదుగానీ రాష్ట్రపతిపాలన రావడం మాత్రం ఆహ్వానించదగినది కాదన్నారు.
సమస్యలున్నాయని విభజనను ఆపక్కర్లేదు
ఏవో కొన్ని సమస్యలు, ఇబ్బందులూ ఉన్నాయని ఇప్పుడు రాష్ట్ర విభజన ప్రక్రియను ఆపాల్సిన అవసరం లేద ని నారాయణ అన్నారు. రాష్ట్రం ఒక్కటిగా ఉన్నా, రెండుగా ఉన్నా సమస్యలనేవి ఉంటాయన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కోస్తా, రాయలసీమలో జరుగుతున్న ఉద్యమాలను మూడు రకాల కేటగిరీలుగా విభజించవచ్చన్నారు. మొదటిది నిరుద్యోగ యువకులు, విద్యార్థులు చేస్తున్నదని.. వాళ్లు పుట్టినప్పటి నుంచి దాదాపు 45 ఏళ్ల కాలం హైదరాబాద్ తమ రాజధాని అనుకొని ఉద్యోగాల కోసం వచ్చిపోతున్నారని, ఇప్పుడు ఎలా వదిలి పొమ్మంటారని వాళ్లందరూ భావిస్తున్నారన్నారు. రాయలసీమకు తాగు, సాగునీటి సమస్యలున్నాయని, విభజన వల్ల ఇలాంటివి పెరుగుతాయని ఆ ప్రాంత ప్రజలు భయపడుతున్నారన్నారు. మూడోది రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం చేస్తున్న ఉద్యమమని చెప్పారు. న్యాయబద్ధంగా ఆలోచించి డిమాండ్లు చేస్తున్న వారి సమస్యలను పరిష్కరించే బాధ్యతను కేంద్రం తీసుకోవాలని సూచించారు. తెలంగాణపై ఢిల్లీ ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్ పెట్టి తాను ప్రతిపక్ష నాయకుడి తరహాలో మాట్లాడారని తప్పుపట్టారు. రాష్ట్ర విభజన జరిగినా, జరగకపోయినా నక్సల్స్ సమస్య పెరుగుతుందని అర్థం లేని వాదనలు తెరపైకి తీసుకువస్తున్నారని తప్పుపట్టారు.
ప్రత్యేక సీమకు మద్దతివ్వం..
విభజనకు లింకు పెట్టి ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర డిమాండ్ ఉన్నందున దానికి తమ పార్టీ మద్దతు ఇవ్వబోదని నారాయణ చెప్పారు. సీమ అభివృద్ధి కోసం జరిగే పోరాటంలో సీపీఐ నేతలు ముందుంటారన్నారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీలో కొత్తగా ఏర్పాటైన కమిటీ కేవలం పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకోవడానికి ఉద్దేశించినదని, దానికీ తమలాంటి వారికి ఎటువంటి సంబంధం లేదని నారాయణ స్పష్టంచేశారు.