సాక్షి, అమరావతి : మహానటుడు ఎన్టీ రామారావు పేరును కాలగర్భంలో కలిపేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు తరం కాదని.. వెన్నుపోటుతో పార్టీని లాగేసుకున్న చంద్రబాబు స్వర్గీయ ఎన్టీఆర్ చెప్పినట్లుగా ‘జామాత.. దశమగ్రహమే’ అని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరం వచ్చినప్పుడల్లా ఆయన ఫొటోకు దండేసి.. ఆయన పేరును వాడుకున్న నీచమైన వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తుతున్నారు.
ఈ దశమగ్రహాన్ని సాగనంపే రోజులు వచ్చాయని.. కాలగర్భంలోనూ కలిసిపోతాడని శాపనార్థాలు పెడుతున్నారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు, అన్న నందమూరి తారకరామారావు పేరును ఏ ప్రభుత్వ పథకానికీ లేకుండా చేసేందుకు చంద్రబాబు, ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణతో కలసి ఎన్టీఆర్‌ను దూషించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకోవడమే కాకుండా.. అసలు ఆయన పేరే ఎక్కడా కనిపించకుండా చేసేందుకు ఇద్దరూ కలసి పన్నిన కుట్రపై ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పేరు ఇంకా ఎందుకు మార్చలేదు అన్న ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో.. తెలుగుదేశం వ్యవస్థాపకుడు అన్న ఎన్టీ రామారావును ఉద్దేశించి ‘‘వాణ్ణి అనవసరంగా క్యారీ చేస్తున్నాం.. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీలోంచి వాడి పేరు ఎత్తేసి మన మీడియాలో ఫుల్ పబ్లిసిటీ ఇద్దాం. ఆరు నెలల తర్వాత ఇక చూసుకో..’’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమానులు భగ్గుమంటున్నారు.
బాబు మాటలు విని బాధపడుతున్నాం
ఎన్టీఆర్ అభిమానిగా చంద్రబాబు మాటలు విని చాలా బాధపడుతున్నాం. అన్న ఎన్టీఆర్ ఫొటోను పార్టీ సభ్యత్వ పుస్తకాలపై తొలగించడానికి చేసిన ప్రయత్నాలను పార్టీలోని వారంతా వ్యతిరేకించడంతో చంద్రబాబు మళ్లీ ఎన్టీఆర్ ఫొటోను ముద్రించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన పథకాలకు చంద్రన్న కానుక, చంద్రన్న పెళ్లి కానుక, చంద్రన్న బీమా అంటూ ఆయన పేరు పెట్టుకున్నాడే కానీ ఎన్టీఆర్ పేరు ఎక్కడా పెట్టలేదు.
ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలతోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ మరణానంతరం ఆయన అభిమానుల ప్రతి ఇంటిలోనూ ఎన్టీఆర్ ఫొటో ఉంది. అలాంటి ఎన్టీఆర్ పేరును తొలగిస్తానంటూ చంద్రబాబు అనడం చాలా దారుణం. ఏ మాత్రం గౌరవం లేకుండా వాడు, వీడు అంటూ మాట్లాడం శోచనీయం. ఎన్టీఆర్ అభిమానులు ఒక సారి ఆలోచించుకోవాలి. చంద్రబాబు వెన్నుపోటుకు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించింది. ఇప్పుడు చంద్రబాబు మాటలకు ఆ ఆత్మ మరింతగా క్షోభిస్తుంది. ఇప్పటికైనా ఎన్టీఆర్ అభిమానులు ఆలోచించి చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలి.
– నల్లమోతు రమేష్ చౌదరి
మరోసారి వెన్నుపోటు
రాజ్యాధికారం కోసం మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆయన పేరును ఆరోగ్యశ్రీ పథకం నుంచి తొలగించడానికి ప్రయత్నించి మరోసారి వెన్నుపోటుదారుడిగా ముద్రపడ్డారు. భారతదేశ రాజకీయాల్లో చంద్రబాబును మించిన మోసగాడు ఉండడు.
– చావా వెంకటేశ్వరరావు, గంపలగూడెం
ప్రజాసేవకు అనర్హుడు
ఆరోగ్యశ్రీ పథకం పేరును మార్పు చేయాలనే ఆలోచన రావడమే చంద్రబాబు పతనానికి తొలిమెట్టు. తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన ఎన్టీఆర్ పేరును తొలగించేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు వంటి కుట్రదారులు ప్రజాసేవకు అనర్హులు.
– శీలం నాగనర్సిరెడ్డి, మునుకుళ్ల
Comments
Please login to add a commentAdd a comment