
సాక్షి, విశాఖపట్నం : రెండు తెలుగు రాష్ట్రాలకూ చంద్రబాబునాయుడే సీఎం.. నరసింహన్ కేవలం ఏపీకి మాత్రమే గవర్నర్.. ఏపీ అధికారుల స్వామిభక్తో, నిర్లక్ష్యానికి నిదర్శనమో కానీ వైజాగ్‌లో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో ఈ పొరపాట్లు దొర్లాయి. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించి, యువతకు ఉపాధి అవకాశాలు సమకూర్చేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన భాగస్వామ్య సదస్సు షెడ్యూల్ తప్పులతడకగా రూపొందింది.
ఆయా కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందాలపై సంతకాలు చేయాల్సిన సెషన్‌లోనే చంద్రబాబును అధికారులు ఉభయరాష్ట్రాలకూ సీఎంను చేసేసి..గవర్నర్‌ను ఏపీకి పరిమితం చేసేశారు. ఇక కంపెనీలు నిర్ధిష్టంగా ఎంతమేర పెట్టుబడులు పెడుతున్నాయో వివరించకుండా లక్షల కోట్ల పెట్టుబడులంటూ ఆర్భాటంగా ప్రకటించేశారు. అసలు ఈ పెట్టుబడులు కాగితాలకే పరిమితమవుతాయా..? కార్యాచరణకు కదిలివస్తాయా..? అనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి.