‘భాగస్వామ్యం’ వెలవెల! | empty seats in Partnership Summit | Sakshi
Sakshi News home page

‘భాగస్వామ్యం’ వెలవెల!

Published Mon, Feb 26 2018 1:00 PM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM

empty seats in Partnership Summit  - Sakshi

ప్లీనరీ సెషన్‌లో ప్రతినిధులు లేక ఖాళీగా ఉన్న కుర్చీలు

అట్టహాసం, ఆర్భాటంతో ప్రారంభమైన భాగస్వామ్య సదస్సు రెండో రోజు వెలవెలబోయింది. ప్రధాన వేదిక హాలులో వేసిన కుర్చీలు కూడా నిండలేదు. పెట్టుబడిదారులు, దేశవిదేశాల నుంచి వచ్చిన ప్రతినిధుల కోసం వేసిన కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. కళాశాల విద్యార్థులను రప్పించడంతో మొదటి సెషన్‌ వరకు ఫర్వాలేకున్నా.. తర్వాత సెషన్‌ బోసిపోయింది. 1,2,5 నంబరు హాళ్లలో జరిగిన ప్లీనరీ సదస్సుల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. మరోవైపు తొలిరోజుతో పోల్చుకుంటే ఎంవోయూల సంఖ్య పెరిగింది. ఈ రెండు రోజుల్లో కుదుర్చుకున్న ఒప్పందాలతోరూ.2 లక్షల 18 వేల 814 కోట్ల పెట్టుబడులకు చేరింది.  

సాక్షి, విశాఖపట్నం : గత భాగస్వామ్య సదస్సుల్లో కూర్చోవడానికి కుర్చీలు దొరికేవి కావు. ప్రతినిధులు, ఎంవోయూలు కుదుర్చుకోవడానికి వచ్చిన వారు చాలాసేపు నిలబడి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. చోటు లేక మీడియా కోసం కేటాయించిన సీట్లలో కూర్చుండిపోయేవారు. మరి ఈ ఏడాది మూడోసారి జరుగుతున్న సదస్సు అందుకు భిన్నం. ప్రధాన వేదిక హాలులో వేసిన కుర్చీలు నిండడం లేదు. పెట్టుబడిదార్లు, దేశవిదేశాల నుంచి వచ్చిన ప్రతినిధుల కోసం వేసిన కుర్చీల్లో చాలావరకు ఖాళీగానే ఉండిపోతున్నాయి. తొలిరోజు అట్టహాసం, ఆర్భాటంతో పాటు అధికార పార్టీ నాయకులు కూడా సదస్సులోకి చొరబడడంతో ఒకింత కుర్చీలు నిండినట్టు కనిపించాయి. కానీ రెండో రోజు కుర్చీలు ఖాళీగా ఉంటే పరువు పోతుందన్న భావనతో కాలేజీ విద్యార్థినీ విద్యార్థులను రప్పించారు. తొలి ప్లీనరీ సెషన్‌లో ‘ది రిఫారŠమ్స్‌ కాల్క్‌లస్‌–ప్రమోటింగ్‌ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ అనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇతర ప్యానలిస్టులు ప్రసంగించారు.

విద్యార్థినుల రాకతో ఆ సెషన్‌లో మాత్రమే కుర్చీలు నిండాయి. ఆ తర్వాత జరిగిన సెషన్లలో కుర్చీలు సగానికి పైగానే ఖాళీగా దర్శనమిచ్చాయి. హాల్‌ నంబరు 1,2,5 నంబరు హాళ్లలో జరిగిన ప్లీనరీ సదస్సుల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. దీంతో వేదికపై నుంచి వక్తలు ఇచ్చిన ప్రసంగాలు ఖాళీ కుర్చీలకేనన్నట్టుగా మారింది. ఇక అరకొరగా వచ్చిన ప్రతినిధుల్లో కొందరు బయటే ఎక్కువగా కనిపించారు. తొలిరోజులా రెండో రోజు భోజనాల వద్ద కూడా  ప్రతినిధుల తాకిడి అంతగా లేదు. ఇవన్నీ వెరసి సదస్సు రెండోరోజు సదస్సు సందడి కానరాలేదు. వివిధ శాఖల అధికారులు కూడా భాగస్వామ్య  సదస్సు ప్రాÆ గణంలో ఇదే చర్చించుకున్నారు. ఇక ఎంఓయూలు కుదుర్చుకోవడానికి వచ్చిన కొంతమంది ఔత్సాహికులు హడావుడి పడ్డారు. ఇలాంటి వారు హాల్‌నంబరు–2లో ఉన్న కుర్చీలు, టేబుళ్లపైనే ఎంవోయూ పత్రాలను సర్దుబాటు చేసుకున్నారు.

పెరిగిన ఎంవోయూలు : మరోవైపు తొలిరోజుతో పోల్చుకుంటే రెండో రోజు ప్రతినిధుల సంఖ్య తగ్గినా ఎంవోయూల సంఖ్య గణనీయంగా పెరిగింది. మొదటి రోజు శనివారం రూ.44,246 కోట్ల పెట్టుబడులకు 79 సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రెండో రోజు ఆదివారం 285 ఎంవోయూల ద్వారా లక్షా 74 వేల 568 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. ఇందులో ఎనర్జీ రంగంలోనే లక్షా 11 వేల 921 కోట్ల పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు. ఇందుకోసం 34 సంస్థలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ఈ ఏడాది జరుగుతున్న మూడో భాగస్వామ్య సదస్సులో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటికే ఈ రెండు రోజుల్లో కుదుర్చుకున్న ఒప్పందాలతో రూ.2 లక్షల 18 వేల 814 కోట్ల పెట్టుబడులకు చేరింది. మిగిలినవి సదస్సు ఆఖరి రోజైన సోమవారం నాటికి పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు.   

ఇక వన్‌మన్‌ అంబులెన్సులు
పెదవాల్తేరు (విశాఖ తూర్పు) : నగరంలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సు మరో కొత్తరకం వాహనానికి వేదికగా నిలిచింది. చిన్నచిన్న వీధుల్లో రోడ్డు ప్రమాదాలు జరిగితే అంబులెన్సులు వెళ్లడానికి ఆస్కారం ఉండదు. అందుకే వన్‌మన్‌ సర్వీస్‌ అంబులెన్సులకు రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు భాగస్వామ్య సదస్సులో ఈ వాహనాలను ప్రదర్శించారు. ప్రమాదం జరిగిందని ఫిర్యాదు అందిన వెంటనే సింగిల్‌మన్‌ ఆపరేట్‌ చేసే ఈ మినీ అంబులెన్సుల ద్వారానే ఆస్పత్రికి తరలిస్తారు. ముందుగా ప్రాథమిక వైద్యం చేయడానికి అవసరమైన సామగ్రి కూడా ఈ వాహనంలో అందుబాటులో ఉంచుతారు. ఫీడర్‌ పేరిట రూపొందించిన ఈ వాహనంలో రోగికి సీటుబెల్టు బిగించి ఆస్పత్రికి తరలిస్తారు. ముఖ్యంగా బైకు ప్రమాదాలలో గాయపడేవారిని తరలించడానికిగాను ఈ వాహనం ఎంతో సదుపాయంగా ఉంటుందని భావిస్తున్నారు.

డేటా షేరింగ్‌
ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): పెవీలియన్‌లో ఏర్పాటు చేసిన డేటా షేరింగ్‌ విధానం ఆకట్టుకుంది. ఐటీ, ఇండస్ట్రీస్, ఆరోగ్యం, ఇలా అనేక రంగాలకు చెందిన సంక్తిప్త సమాచారాన్ని పుస్తకాల రూపంలో డిజిటల్‌ స్క్రీన్స్‌పై ప్రదర్శించడం ఆకట్టుకుంది. ఆ సమాచారాన్ని సందర్శకులకు అక్కడి సిబ్బంది వివరించడంతో పాటు డిజిటల్‌ స్క్రిన్స్‌ నుంచి నేరుగా మోబైల్స్‌కు ఎక్కించే సౌలభ్యాన్ని అక్కడ ప్రదర్శించారు. వినియోగదారుల మొబైల్స్‌ ద్వారా వారి మెయిల్‌కు వారు కోరుకున్న సమాచారాన్ని సిబ్బంది ఎక్కించారు. దీంతో అనేక మంది సందర్శకులు నచ్చిన సమాచారాన్ని మొబైల్స్‌లోకి ఎక్కించుకునేందుకు ఆసక్తి కనబరిచారు.

రూ.20 కోట్లతో విశాఖలో ఐటీపార్కు
పెదవాల్తేరు(విశాఖతూర్పు): విశాఖలో రూ.20కోట్లతో ఐటీపార్కు ఏర్పాటు చేస్తామని సెల్ఫ్‌పాసెడ్‌టెక్‌ సంస్థ అధినేత కె.ధరణి పేర్కొన్నారు. భాగస్వామ్య సదస్సులో ఎంవోయూ చేయడానికి వచ్చిన ఆమె ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడారు. తాను ఇప్పటికే దుబాయ్, కెనడా దేశాలలో ఐటీ కేంద్రాలు నిర్వహిస్తున్నానన్నారు. అలాగే, హైదరాబాద్, రాజమండ్రి ప్రాంతాలలో కళాశాలలు నిర్వహిస్తున్నానని తెలిపారు. విశాఖలోని రుషికొండ లేదా గంభీరంలో స్థలం కేటాయిస్తే ఐటీపార్కు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ దశలవారీగా 50 నుంచి 150 మందికి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వంతో ఎంఓయు కుదుర్చుకోనుండడం ఆనందంగా ఉందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement