దేవరపల్లి బస్టాండ్ సెంటర్లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడుతున్న వైఎస్ షర్మిల
సాక్షి, దేవరపల్లి : ఎన్నికల ముందు చంద్రబాబు సంక్షేమ పథకాల పేరుతో ఎంగిలి మెతుకులు విదుల్చుతున్నాడని, నమ్మి మోసపోవద్దని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం దేవరపల్లి బస్టాండ్ సెంటర్లో గురువారం రాత్రి జరిగిన ఎన్నికల బహిరంగ సభలో షర్మిల పాల్గొని మాట్లాడారు. గత ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు.
అవినీతి, అబద్ధాలకు మారుపేరు చంద్రబాబు అని ఆమె విమర్శించారు. ఐదు సంవత్సరాల పాలనతో పేదలకు అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అద్భుతంగా అమలుచేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి దక్కుతుందన్నారు. ప్రత్యేక హోదాను నీరు కార్చడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదని ఆమె అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగనన్న కట్టబడి ఉన్నారని ఆమె వివరించారు. జగనన్నను ముఖ్యమంత్రిని చేస్తే ప్రత్యేక హోదా సాధించుకోవచ్చునని కోరారు. అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్సార్ సీపీ అండగా ఉండి న్యాయం చేస్తుందన్నారు.
రెండు ఓట్లు వైసీపీకే వేయాలి..
ఈ నెల 11న జరగనున్న ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా తలారి వెంకట్రావు, ఎంపీగా మార్గాని భరత్‌రామ్‌ను అత్యధిగ మెజార్టీతో గెలిపించి జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని ఆమె కోరారు. ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ చంద్రబాబును నమ్మి ఓట్లు వేస్తే ప్రజలను నట్టేట ముంచుతాడన్నారు. వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ ద్వారా ప్రతీ బీసీ వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవడం జరుగుతుందన్నారు. వైఎస్సార్ సీపీలో బీసీలకు తగిన న్యాయం జరుగుతుందన్నారు.
ఫ్యాన్ గుర్తును ప్రతీ గ్రామానికి తీసుకువెళ్లి వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామని ఆయన సూచించారు. గుండుగొలను–కొవ్వూరు జాతీయ రహదారిని వైసీపీ అధికారంలోకి రాగానే యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని ఆయన అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు మాట్లాడుతూ మోసాల చంద్రబాబు కపట ప్రేమతో మీ ముందుకు వస్తున్నాడు.. నమ్మి మోసకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రభుత్వ పథకాలను పచ్చచొక్కాల నేతలకు కట్టబెట్టిన ఘనత చంద్రబాబుదని ఆయన ఆరోపించారు.
సభలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శులు నరహరిశెట్టి రాజేంద్రబాబు, కె.వి.కె. దుర్గారావు, చెలికాని రాజబాబు, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కారుమంచి రమేష్, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొమ్మండ్రు రమేష్, ఉభయగోదావరి జిల్లాల మహిళా విభాగం కన్వీనర్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, నియోజకవర్గ కన్వీనర్ ఆచంట అనసూయ, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు కూచిపూడి సతీష్, గగ్గర శ్రీనివాస్, పడమట సుబోష్‌చంద్రబోస్, ప్రతాపనేని వాసు, పలువురు నాయకులు, పార్టీ శ్రేణులు, మహిళలు, యువకులు, అభిమానులు పాల్గొన్నారు.
వైఎస్ షర్మిలకు ఘనస్వాగతం
ఎన్నికల ప్రచార సభలో పాల్గొనటానికి దేవరపల్లి వచ్చిన వైఎస్ షర్మిలకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి షర్మిలకు స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment