సాక్షి, గుంటూరు : ‘ బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? కేవలం చంద్రబాబు గారి కొడుకు లోకేష్‌కు వచ్చింది. ఈ పప్పు గారికి కనీసం జయంతికి, వర్ధంతికి తేడా కూడా తెలియదు. అటువంటి వ్యక్తి ఒకటి కాదు రెండు ఏకంగా మూడు శాఖలకు మంత్రి అయి కూర్చున్నారు. అఆలు రావు గానీ అగ్ర తాంబూలం నాకే కావాలన్నాడట ఎవరో. పప్పు తీరు కూడా అలాగే ఉంది. ఒక్క ఎన్నికలో కూడా గెలవని పప్పుకు ఏ అర్హత ఉందని చంద్రాబాబు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఇది పుత్ర వాత్సల్యం కాదా. ఈసారి పప్పు కచ్చితంగా ఇంటికి పోతారు. ఏమి అర్హత ఉందని లోకేష్‌కు మూడు శాఖలు ఇచ్చారు?’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సోదరి షర్మిల చంద్రబాబును ప్రశ్నించారు. శుక్రవారం నుంచి బస్సు యాత్ర ప్రారంభించిన షర్మిల గుంటూరు జిల్లా తాడికొండలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. వివరాలు ఆమె మాటల్లోనే....
రాజన్న రాజ్యం ఎలా ఉండేది
తాడికొండ ప్రజలకు, ఇక్కడు చేరివచ్చిన ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి చెల్లికి , ప్రతి అన్నకు మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజన్న రాజ్యం ఎలా ఉండేది? ప్రతి పేదవాడి అండగా, ప్రతి రైతుకు ధైర్యంగా కలిగించేలా, ప్రతి మహిళకు భరోసా కలిగించే ఉండేది. ప్రతి విద్యార్థికి అండగా ఉంటూ డాక్టర్ అవుతారా.. ఇంజనీరు అవుతారా.. ఏది కావాలంటే అది చదివిస్తా అంటూ భరోసా ఇచ్చేవాడు. ఆరోగ్యశ్రీతో లక్షల మందికి ప్రాణం పోశారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని శ్రమించారు. ఐదేళ్లలో ఒక్క రూపాయి పన్ను పెంచకుండానే అభివృద్ది చేసి చూపించారు. కుల, మత, మన, తన తేడా లేకుండా ప్రతి ఒక్కరికి మేలు చేశాడు. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన ఎలా ఉంది. రైతు రుణమాఫీ అంటూ చేసిన మొదటి సంతకానికే దిక్కులేదు. డ్వాక్రామహిళలకు రుణమాఫీ చేస్తానన్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. ఐదేళ్లు ఏమి చేయకుండా పసుపు కుంకుమ అంటూ మోసం చేయడానికి వస్తున్నాడు. అక్కా చెల్లెళ్లు మోస పోతారా? ఈ సారి చంద్రబాబు చేతుల్లో మోసపోకండి.
చంద్రబాబును ఇవి అడగండి
గతఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారు. దాంట్లో ఒక్క వాగ్ధానం నిలబెట్టుకోలేదు. ఇప్పుడు చేపలకు ఎరవేసి నట్లు కొత్త పథకాలతో వస్తున్నారు. ఎరవేస్తే ప్రజలు నమ్ముతారా? చిన్న పిల్లలకు చాక్లెట్లు ఇచ్చినట్లుకాదు. ప్రతి ఒక్కరూ చంద్రబాబును నిలదీయండి. అది మీ హక్కు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేస్తామని చెప్పి ఈ ఐదేళ్లలో ఒక్కరికైనా ఇచ్చారా? ఫీజు రీయింబర్స్‌మెంట్ చేశారా. మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చారా. విద్యార్థులకు ఐపాడ్లు ఇచ్చారా? లేదు. ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అని చెప్పి వంచించారు. ఐదేళ్లలో నెలకు రూ.2 వేల ప్రకారం రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ దాదాపు రూ.1.25 లక్షలు చొప్పున చంద్రబాబు బాకీ పడ్డారు. ప్రతి పేదవాడికి మూడు సెంట్ల భూమి, పక్కా ఇళ్లు అన్నారు. ఎక్కడైనా కట్టించారా? చేనేతల మరమగ్గాలకు పూర్తి రుణమాఫీ అన్నారు. ఎన్నికలు పూర్తయ్యేలోపు బాకీ పడ్డ ఇవన్నీ మాకు ఇవ్వండి అని బాబును నిలదీయండి.
జగనన్న లేకుంటే చంద్రబాబు హోదా అనేవాడా?
ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జగనన్న ఢిల్లీలో ధర్నాలు చేశారు. రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశారు. బంద్‌లు, రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు, కొవ్వొత్తుల ర్యాలీలు.. ఇలా ఈ ఐదేళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసం కూడా పెట్టారు. రాజీనామాలూ చేశారు. జగనన్న యువభేరి పేరిట యువతను జాగృతం చేశారు. ఆయనే గనుక ఊరురా తిరిగి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయకపోతే చంద్రబాబు నోటి నుంచి ప్రత్యేక హోదా అనే మాట వచ్చి ఉండేదా? హోదా వద్దు.. ప్యాకేజీ కావాలన్న చంద్రబాబును యూటర్న్ తీసుకునేలా చేసింది జగనన్న కాదా? ఈ విషయాల గురించి చంద్రబాబు నిజం చెప్పాలి. కానీ ఆయన చెప్పరు. చంద్రబాబు నైజం గురించి నాన్న గారు ఒకమాట చెప్పేవారు.. ఎప్పుడైతే చంద్రబాబు నిజం చెబుతారో అప్పుడు ఆయన తల వేయి ముక్కలవుతుందట. పాపం అందుకే ఆయన ఎప్పుడూ అబద్ధాలే చెబుతుంటారు.
ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు.. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు.. రోజుకో మాట పూటకో వేషం వేస్తున్న బాబును చూసి ఊసరవెల్లి కూడా పారిపోతుంది. కేసు నుంచి తప్పించుకోవడానికి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారు. ఆ రోజు నుంచి గత ఏడు నెలల వరకు కేసీఆర్‌తో పొత్తు పెట్టుకోవాలని చూశారు. పొత్తు పెట్టుకోవాలని చూసింది చంద్రబాబు అయితే ఇప్పుడు మాతో పొత్తు అంటున్నాడు. మాకు కేసీఆర్‌తో పొత్తు లేదు. సింహం సింగిల్‌గానే వస్తుంది. వైఎస్సార్‌సీపీ సింగిల్‌గానే గెలుస్తుందని ప్రతి సర్వే చెబుతుంది. పదవులు లేకున్నా జగన్ మోహన్ రెడ్డి తొమ్మిదేళ్ల పాటు విలువలతో కూడిన రాజకీయం చేశాడని కొనియాడారు. జగన్ లాంటి మంచి మనిషికి ఒక అవకాశం ఇస్తే వైఎస్సార్ లాగానే ఆయన కూడా ప్రతి వర్గానికి మేలు చేస్తారని అన్నారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా వేణుగోపాల్‌రెడ్డి అన్నను, ఎమ్మెల్యే అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవిను జగనన్న నిలబెట్టారు. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment