
సాక్షి, గుంటూరు : ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన వాడికి ఈ రాష్ట్ర ప్రజలు ఓ లెక్కా అంటూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సోదరి షర్మిల దుయ్యబట్టారు. శనివారం ఇక్కడ జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగిస్తూ.. బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఎవరికి వచ్చిందని ప్రశ్నించారు. జయంతికి, వర్థంతికి తేడా తెలియని ఓ పప్పును ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇది పుత్రోత్సాహం కాదా అని ప్రశ్నించారు. అ..ఆలు కూడా రాని వానికి అగ్ర తాంబూలం ఇచ్చారని మండిపడ్డారు. ప్యాకేజీకి, కమిషన్‌లకు ఆశపడి బాబు హోదాను వద్దన్నారని ఆరోపించారు. హోదా రాకపోవడానికి బాబే కారణమన్నారు.
ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు.. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు.. రోజుకో మాట పూటకో వేషం వేస్తున్న బాబును చూసి ఊసరవెల్లి కూడా పారిపోతుందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం జగన్ చేయని ప్రయత్నం లేదని పేర్కొన్నారు. హోదా కోసం ఆఖరికి వైఎస్సార్‌సీపీ ఎంపీలు పదవి త్యాగం కూడా చేశారని గుర్తు చేశారు. ఈ ఎన్నికలు మంచికి, చెడుకు.. వెన్నుపోటుకు, విశ్వసనీయతకు మధ్య జరిగే పోరాటమని పేర్కొన్నారు. పదవులు లేకున్నా జగన్ మోహన్ రెడ్డి తొమ్మిదేళ్ల పాటు విలువలతో కూడిన రాజకీయం చేశాడని కొనియాడారు. జగన్ లాంటి మంచి మనిషికి ఒక అవకాశం ఇస్తే వైఎస్సార్ లాగానే ఆయన కూడా ప్రతి వర్గానికి మేలు చేస్తారని హామీ ఇచ్చారు.
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా వేణుగోపాల్‌రెడ్డి అన్నను, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏసురత్నం అన్నను జగనన్న నిలబెట్టారు. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment