జలవనరులు, భూగర్భ జలాలు, వైద్యశాఖల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు
విజయవాడ: జలవనరులు, భూగర్భ జలాలు, వైద్యశాఖల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.వేసవిలో తాగునీటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వడదెబ్బ నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు.
మండల స్థాయిలో జలవనరుల శాఖ ఏఈ నోడల్ అధికారిగా వ్యవహరించి తాగునీటి సరఫరా ఏర్పాట్లను పర్యవేక్షించాలని తెలిపారు.కరవు రహితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు చేపట్టిన 10లక్షల పంటకుంటల నిర్మాణాన్నిశరవేగంగా పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తున్న సమయంలో అధికార యంత్రాంగం కూడా వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఉచిత ఇసుక ప్రయోజనాలు పేద కుటుంబాలకు దక్కాలే చూడాలని అధికారులకు చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు.ఏదైనా రీచ్ లో ఎవరైనా ఇష్టానుసారంగా వ్వవహరిస్తే అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
కలెక్టర్, జేసీ,ఆర్డీవో,డీఎస్పీ,ఎమ్మార్వో అన్నిస్థాయిల అధికారులు సమిష్టి బాధ్యతతో సమన్వయంగా వ్యవహరించి ఇసుక అక్రమ తవ్వకాలకు కళ్లెం వేయాలన్నారు. చలివేంద్రాలను ఏర్పాటు చేసి ఓఆర్ ఎస్ పాకెట్లను పంపిణీ చేయాలన్నారు. వడదెబ్బ నివారణలో వైద్యశాఖ అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సూచించారు.