గుజరాత్ అల్లర్లపై విమర్శలా? ప్రధానిపై చంద్రబాబు ధ్వజం
సాక్షి, హైదరాబాద్: అస్సాం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని మన్మోహన్‌సింగ్ అక్కడ జరిగే అల్లర్లపై స్పందించకుండా గుజరాత్ అల్లర్ల గురించి మాట్లాడటం దారుణమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ప్రధాని విలేకరుల సమావేశం వీడ్కోలు సమావేశాన్ని తలపించిందని ఎద్దేవా చేశారు. శుక్రవారం రాత్రి ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మన్మోహన్ కీలుబొమ్మ, తోలుబొమ్మ, మరబొమ్మ ప్రధాని అని వ్యాఖ్యానించారు. సోనియాగాంధీ పెద్ద అనకొండ అని, ఆమె దేశ వ్యాప్తంగా అనకొండలను పెంచి పోషించారన్నారు. ఎకరా సాగుకు రూ. కోటి ఆదాయం వస్తుందని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ విలేకరుల సమావేశానికి సాక్షిని ఆహ్వానించలేదు. వివిధ రూపాల్లో సేకరించిన సమాచారం మేరకు ఈ వార్తనిస్తున్నాం. ఒకవేళ ఆహ్వానించి ఉంటే సాక్షి ఈ కింది ప్రశ్నలు అడిగి సమాధానం కోరేది.
1. కాంగ్రెస్ అవినీతిలో కూరుకుపోయిందని చెబుతున్న మీరే అవిశ్వాస తీర్మానం సందర్భంగా రాష్ట్రంలో ఆ పార్టీ నేతృత్వంలోని పార్టీని ఎందుకు కాపాడినట్టు?
2. ఎఫ్‌డీఐల విషయంలో రాజ్యసభలో మీ పార్టీ ఎంపీలను గైర్హాజరు చేయించి ఎందుకు కాంగ్రెస్‌కు కొమ్ముకాశారు?
3. మీరు అధికారంలో ఉన్నప్పుడు లెక్కలేనన్ని కుంభకోణాలు జరిగాయని అనేక పార్టీలు పుస్తకాలు ముద్రించాయి. మీపై వచ్చిన ఏ ఒక్క ఆరోపణ విషయంలోనూ విచారణను ఎదుర్కోకుండా మీరు అవినీతి గురించి మాట్లాడితే ప్రజలు నమ్ముతారా?
టీడీపీలో తిరిగి చేరిన గద్దె
విజయనగరం జిల్లా చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు శుక్రవారం తిరిగి టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో జరిగిన ఒక కార్యక్రమంలో పి.అశోక్ గజపతిరాజు, శోభా హైమావతి తదితరుల సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.