గో బ్యాక్‌ అంటే గుజరాత్‌కు పొమ్మని... | Chandrababu naidu reacts narendra modi comments | Sakshi
Sakshi News home page

గో బ్యాక్‌ అంటే గుజరాత్‌కు పొమ్మని...

Published Sun, Feb 10 2019 3:02 PM | Last Updated on Sun, Feb 10 2019 3:02 PM

Chandrababu naidu reacts narendra modi comments - Sakshi

సాక్షి, విజయవాడ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తనను ’గో బ్యాక్’   అన్నందుకు టీడీపీకి ప్రధాని ధన్యవాదాలు చెప్పగా... మరోవైపు చంద్రబాబు గో బ్యాక్‌ అంటే ఢిల్లీ కాదని, గుజరాత్ వెళ్లమని అంటూ కొత్త భాష్యం చెప్పారు. గుంటూరులో జరిగిన బీజేపీ చైతన్య సభలో ప్రధాని మోదీ...చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీంతో మోదీ వ్యాఖ్యలపై చంద్రబాబు అభ్యంతరం తెలిపారు. 

విజయవాడలో ఆదివారం జరిగిన పసుపు-కుంకుమ కార్యక్రమానికి చంద్రబాబు నల్ల చొక్కా ధరించి వచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘ఇళ్లపట్టాల పంపిణీ కోసం గవర్నర్ ఆమోదం కోసం పంపితే మూడు నెలలు పెండింగ్‌లో పెట్టారు.7500 కోట్ల రూపాయిల విలువైన ఆస్తిని పేదలకు పట్టాల రూపంలో పంపిణీ చేస్తున్నాం. నన్ను తిట్టడానికే ఫ్లయిట్‌ వేసుకుని వచ్చారు. ఏపీకి ఆయన ఏం చేశారో చెప్పలేని స్థితిలో ఉన్నారు. తిట్టడం సులభం..పనులు చేయడం కష్టం.

మోదీని ఎవరు క్షమించరు. తల్లిని చంపి బిడ్డను కాపాడారు. తల్లిని కాపడతానని మోదీ చెప్పారు. తల్లిని దగా చేసిన వ్యక్తి మోదీ. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి మట్టి, నీరు తెచ్చి మన మొహం మీద కొట్టారు. మోదీకి, నాకు వ్యక్తిగత విభేదాలు లేవు. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని 14 సీట్లు ఇస్తే కేవలం 4సీట్లు గెలిచారు. పొత్తుతో నష్టపోయింది మేమే. సీఐజీ అడిగితే లెక‍్కలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. లెక్కలు అడగాల్సింది మీరు కాదు. రాజధానికి డబ్బులు ఇవ్వరు. పోలవరం డీపీఆర్ ఆమోదం తెలపరు. వెనుకబడిన జిల్లాలకు నిధుల ఊసు కూడా ఎత్తరని’ అన్నారు.

లోకేష్ తండ్రిగా గర్వపడుతున్నా..
తండ్రీ, కొడుకుల అవినీతి పాలన అంతం అయ్యేరోజు దగ్గరలోనే ఉందన్న ప్రధాని వ్యాఖ్యలపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. లోకేష్ తండ్రిగా నేను గర్వపడుతున్నా. మోదీకి కుటుంబం లేదు. అనుబంధాలు తెలియవు. విడాకులు ఇవ్వకుండానే యశోద బెన్‌ను దూరం పెట్టారు. నేను మాట్లాడితే మోదీ తల ఎక్కడ పెట్టుకుంటారు. నా కుటుంబాన్ని చూసి నేను గర్విస్తున్నా. నాది యూ టర్న్ కాదు. నాది రైట్‌ టర్న్. మోదీ నమ్మించి మోసం చేశారు. అందుకే ఎదురు తిరిగా. గుజరాత్ కన్నా ఏపీ అభివృద్ధి చెందుతోందని మోదదీ అసూయ అమరావతి నా సొంత నిర్మాణం కాదు. హుందాతనాన్ని మరిచి మోదీ మాట్లాడుతున్నారు. ఆయన అసూయ పడేలే అమరావతి నిర్మాణం చేసి చూపిస్తా. 

అందుకే ఎదురు తిరిగా..
మేం బానిసలం కాదు. అప్పులు చేసి రాజధాని కడుతుంటే పన్నులు వసూలు చేస్తున్నారు. మోదీకి కేవలం ప్రచారం ఆర్భాటం. గురువుకు నామాలు పెట్టిన సంస్కృతి మీది. ఓటమిలో సీనియర్‌ అని నన్ను విమర్శలు చేస్తున్నారు. నేను ఎవరికీ భయపడను. ఒకరి దగ్గర మోకరిల్లాల్సిన అవసరం నాకు లేదు. ఏపీలో ఉన్న పెట్రోలియం ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు తరలించి, మన సంపదను దోచుకునేందుకు చూస్తున్నారు. ఇక పెద్ద నోట్ల రద్దు పిచ్చి తుగ్లక్ చర్య. దేశాన్ని, రాజకీయాలను మోదీ కలుషితం చేస్తున్నారు. ఆయన తనకు కావాల్సిన వ్యక్తులకు దేశాన్ని దోచిపెడుతున్నారు. మహా కూటమి తలుచుకుంటే మోదీ ఇంటికి పోవడం ఖాయం. 

మోదీకి ఇంతకన్నా అవమానం ఏముంటుంది..
ఆంధ్రప్రదేశ్‌కు ఏమీ చెయ్యకుండా రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోదీ సభకు ప్రజలు హాజరు కాలేదు. ప్రధాని సభకు రెండు మూడు వేలకు మించి రాలేదు. ప్రధాని మోదీకి ఇంతకన్నా అవమానం ఏముంటుంది. ఆంధ్రుల్లో ఆత్మాభిమానం మెండు, తెలుగు వారు సర్వెంట్లు కాదు. నా పిలుపును అనుసరించి రాష్ట్రవ్యాప్తంగా తెలుగు ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు.తెలుగు ప్రజల వ్యతిరేకత వేడికి గతంలో మోదీ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు తగుదునమ్మా అంటూ వచ్చిన ఆయనకి ప్రజల నిరసన జ్వాలలు తగిలాయి. సభా వేదిక బయట ఒక్క పురుగు లేకపోతే అడ్డుకున్నామన్నది హాస్యాస్పద’ మని వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement