
సోమవారం ఛత్తీస్‌గఢ్ రాజధాని నయా రాయ్‌పూర్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌తో సమావేశమైన సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం ఛత్తీస్‌గఢ్ పర్యటనలో రెండు రాష్ట్రాల నిర్ణయం
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌తో చంద్రబాబు భేటీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు రెండు రాష్ట్రాల ఉమ్మడి అభివృద్ధికి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు వివిధ శాఖల సీనియర్ అధికారులు ఈ టాస్క్‌ఫోర్స్‌లో సభ్యులుగా ఉంటారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రులు డాక్టర్ పి.నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల కిషోర్‌బాబు, ఎంపీలు సి.ఎం.రమేష్, గల్లా జయదేవ్, ఇతర పారిశ్రామికవేత్తలతో కూడిన ప్రతినిధి బృందం ఉంది. వీరు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. స్థానికంగా పరిపాలన తీరు, పాలనలో ఐటీ వినియోగం, ప్రజా పంపిణీ వ్యవస్థ తీరు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులు, వాటిని తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఇచ్చిపుచ్చుకోవాల్సిన సహకారంపై చర్చించారు. చంద్రబాబు బృందం ఆ రాష్ట్ర రాజధాని నయా రాయపూర్ నిర్మాణ తీరుతో పాటు భూ సేకరణకు అనుసరించిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. స్థానిక అధికారులతో చర్చించారు. ఆ రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలపై చర్చించారు. పారిశ్రామికవేత్తలతో భేటీలో ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ కూడా పాల్గొన్నారు. స్థానికంగా సత్య సాయిబాబా ట్రస్ట్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సత్యసాయి సంజీవిని ఆస్పత్రిని కూడా పరిశీలించారు. కబన గ్రామాన్ని చంద్రబాబు బృందం సందర్శించింది.
నా పర్యటన ఫలప్రదమైంది...
చంద్రబాబు రాయపూర్‌లో రమణ్‌సింగ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడుతూ.. తన పర్యటన ఫలప్రదమైందని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య పలు అంశాల్లో పరస్పర సహకారం కోసం టాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేసుకోవాలని ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో నిర్ణయించామన్నారు. నయా రాయ్‌పూర్ నిర్మాణానికి భూ సేకరణ జరిగిన తీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేస్తూ భూ సేకరణ జరిగిందన్నారు. ఏపీ కూడా నూతన రాష్ట్రమేనని, ఛత్తీస్‌గఢ్‌లా తమకూ ఆర్థిక ఇబ్బందులున్నాయని చెప్పారు. తమ రాష్ట్రంలో నూతన రాజధాని నిర్మాణం జరగబోతోందని, అక్కడ మౌలిక సదుపాయాలు, హార్డ్‌వేర్, ఆగ్రో ప్రాసెసింగ్ త దితర రంగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు అంశం కోర్టు పరిధిలో ఉందంటూ దీనిపై వ్యాఖ్యానించేందుకు రమణ్‌సింగ్ నిరాకరించారు.
పోలవరం నిర్మాణానికి సహకరించాలని కోరా
సోమవారం రాత్రి 10 గంటలకు హైదరాబాద్ తిరిగివచ్చిన చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుపై ఏపీ, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య 1978, 1980ల్లో జరిగిన ఒప్పందాల గురించి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణసింగ్‌కు వివరించి.. ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాల్సిందిగా కోరినట్లు తెలిపారు. ‘‘పోలవరం నిర్మాణం వల్ల తమ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవుతాయని రమణ్‌సింగ్ పేర్కొన్నారు. కేంద్రం పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున ఉదారంగా పునరావాస ప్యాకేజీ ఇస్తుందని, అందుకు అంగీకరించాలని ఆయనను కోరాను’’ అని సీఎం చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య, ముఖ్యంగా రాయ్‌పూర్ నుంచి విశాఖపట్నం వరకూ జాతీయ రహదారి నిర్మాణం, రోడ్డు, రైలు, విమాన మార్గాలను మెరుగు పరచటంపై ప్రత్యేకంగా దృష్టి సారించేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు బాబు తెలిపారు. నయా రాయ్‌పూర్ నిర్మాణానికి చేపట్టిన భూ సేకరణ, సమీకరణ విధానాలు, కొత్త చట్టాల గురించి, అక్కడి ప్రజా పంపిణీ విధానం, విలువ ఆధారిత పన్ను (వ్యాట్), కార్మిక సంక్షేమంతో పాటు పలు శాఖల్లో ఐటీని వినియోగిస్తున్న విధానాలను అధ్యయనం చేశామని వివరించారు. ఈ పర్యటన మంచి ఫలితాలను ఇస్తుందన్నారు.
తెలంగాణలో ఉన్న వారు కూడా తెలుగువారే.. సమానంగా చూడాలి...
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఫాస్ట్ ఉత్తర్వులపై చంద్రబాబు స్పందిస్తూ.. ‘‘తెలంగాణలో ఉన్న వారు కూడా తెలుగువారే. తెలంగాణలో స్థానికతను నిరూపించుకున్న వారికే ఫీజులు చెల్లిస్తామని ఆ ప్రభుత్వం చెప్పింది. దీనివల్ల విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 58 శాతం ఫీజు భరిస్తానని నేను గతంలోనే ప్రతిపాదించాను. ఆ ప్రభుత్వం నా మీద పడింది. ఇది సరికాదు. అందరినీ సమానంగా చూడాలి. హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశాను. ఈ నగరం వల్లే తెలంగాణకు మిగులు బడ్జెట్ వచ్చింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటే తెలంగాణ ఆదాయం దెబ్బతింటుంది. తెలంగాణ ప్రభుత్వం విభిన్నంగా ప్రవర్తిస్తోంది. అభ్యంతరం పెట్టకుండా సహకరించాలి’’ అని పేర్కొన్నారు.