అమరావతి: మంత్రి పదవి ఇవ్వలేదని గోరంట్ల బుచ్చయ్యచౌదరి రచ్చ చేయడం సరికాదని , అసలు ఆయనకు పదవి ఇవ్వడం ఎలా సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గంలో ఇప్పటికే ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు చాలామంది ఉన్నారని, ఆ విషయం తెలిసి కూడా బహిరంగంగా వ్యాఖ్యలు చేసి పార్టీ పరువును బజారుకు ఈడ్చారని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. చంద్రబాబు నిన్న రాత్రి ఉండవల్లిలోని తన నివాసంలో తూర్పు గోదావరి జిల్లా టీడీపీ సమన్వయ సమావేశం నిర్వహించారు.
విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు... మంత్రి పదవి ఇవ్వలేదని రాజీనామా చేయడం సరికాదని అన్నారు. సమావేశానికి బుచ్చయ్య చౌదరి గైర్హాజరైనా, ఆయన గురించి చంద్రబాబు చాలా సమయం మాట్లాడారు. జిల్లాలో పార్టీ పరిస్ధితుల గురించి విశ్లేషించిన ఆయన.. నేతల మధ్య సమన్వయం లేదంటూ మంత్రి యనమల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రూ గురించి ప్రస్తావించినట్టు తెలిసింది.
మరోవైపు మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న బుచ్చయ్య చౌదరి మరోసారి ఉద్వేగానికి లోనయ్యారు. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదని, విలువలే ముఖ్యమన్నారు. అధికారంలో ఉన్నవారు ప్రలోభాలకు గురి చేయడం సర్వసాధారణమైందన్నారు. కొందరు రాజకీయాన్ని వృత్తిగా భావిస్తూ తప్పుడు పనులు చేస్తున్నారని మండిపడ్డారు.
వచ్చే నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశానికి తాను వస్తానో, రానో తనకు తెలియదన్నారు. టీడీపీలో జరుగుతున్న చర్యలకు నిరసనగానే ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశానని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు, ప్రలోభాలు పరాకాష్టకు చేరాయని ఆయన ధ్వజమెత్తారు.