సాక్షి ప్రతినిధి, కాకినాడ : టీడీపీ అధినేత చంద్రబాబు టిక్కెట్ల పంపిణీలో వేస్తున్న ఎత్తులు క్షేత్రస్థాయిలో బెడిసి కొడుతున్నాయి. ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని, వారి సమక్షంలోనే అభ్యర్థులను ప్రకటిస్తామన్న బాబు ప్రయోగం పార్టీలో ఆశావహుల మధ్య చిచ్చురేపి బజారుకెక్కిస్తోంది.
ఒక నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశిస్తున్న నేతలు.. అధిష్టానం నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌కు సంబంధించి.. ప్రజాభిప్రాయం పేరుతో ఒకరికి వ్యతిరేకంగా మరొకరు సమాచారం వెళ్లే ఎత్తులు వేస్తున్నారు. ఈ విషయంలో రాజమండ్రి నగర నేతలు మరో అడుగు ముందుకేయడంతో పార్టీ రచ్చకెక్కింది. మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పార్టీ అధికార ప్రతినిధి గన్ని కృష్ణల మధ్య రాజకీయ వైరం పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతి సందర్భంలో కొనసాగుతూనే ఉంది. తాజాగా అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు ఇచ్చేందుకు చేపడుతున్నట్టు చెబుతున్న అభిప్రాయ సేకరణ వీరి మధ్య వైరాన్ని మరోసారి రగుల్కొలిపింది.
రాజమండ్రి సిటీ సీటు కేటాయించే విషయంలో చంద్రబాబు చేస్తున్న ప్రజాభిప్రాయ సేకరణ సర్వేలో గోరంట్లకు ఓటు వేయనని గన్ని ప్రకటించడం చర్చనీయాంశమైంది. గన్ని రాజమండ్రిలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించడాన్ని బట్టి సార్వత్రిక ఎన్నికలు వేదికగా మరోసారి గోరంట్లపై కయ్యానికి కాలు దువ్వినట్టేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. చంద్రబాబు సామాజికవర్గానికే చెందిన గన్ని, గోరంట్లల మధ్య సమన్వయం సాధించలేక పార్టీ అధిష్టానం, వారిద్దరి విభేదాల మధ్య తలదూర్చే సాహసం చేయలేక జిల్లా నాయకత్వం ఏనాడో చేతులెత్తేశాయి.
2014 ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేయనున్నట్టు గత డిసెంబరులో ప్రకటించిన గన్ని అప్పట్లో గోరంట్లతో అమీతుమీకి సిద్ధమయ్యారు. ప్రతి ఎన్నికలప్పుడు పార్టీలో రాజమండ్రి సిటీ అభ్యర్థిత్వం ఆశించడం, చివరి వరకు పోరాడినా.. నిరాశే మిగలడం గన్నికి పరిపాటిగా మారింది. అలాంటి నేత ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని, అధిష్టానం నుంచి సానుకూలత లభిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వర్గం వ్యక్తం చేస్తోంది. 2004, 2009 ఎన్నికల్లో ఓటమి పాలైన గోరంట్లకు టిక్కెట్టు ఇస్తే మరోసారి ఓటమి ఖాయమనే ప్రచారం చేస్తున్న గన్ని వర్గానికి సినీనటుడు, రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థి మురళీమోహన్ తెరవెనుక మద్దతు ఇస్తున్నారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఈ క్రమంలోనే ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన సినీనటుడు అలీని వచ్చే ఎన్నికల్లో బరిలోకి దింపాలనే ప్రయత్నంలో గన్ని, మురళీమోహన్ ఉన్నారు. అలీని బరిలోకి దింపితే సినీ గ్లామర్‌తో పాటు కోస్తా జిల్లాల్లో ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంక్ పార్టీకి కలిసివస్తుందని కూడా చంద్రబాబు దృష్టికి ఇటీవల మురళీమోహన్ తీసుకువెళ్లారని సమాచారం. అలీ కూడా ఇటీవల ప్రైవేటు కార్యక్రమానికి రాజమండ్రి వచ్చినప్పుడు పోటీకి ఆసక్తి కనబరిచినా.. ఎక్కడి నుంచి, ఏ పార్టీ తరఫున అనేది స్పష్టం చేయలేదు.
రాజమండ్రిలో మళ్లీ ‘పచ్చ’ రచ్చ
Published Fri, Apr 4 2014 12:48 AM | Last Updated on Fri, Jul 12 2019 5:45 PM
Advertisement