ఏపీ విద్యార్ధులను చదివించేందుకు సిద్ధం
విజయవాడ : రాష్ట్రాభివృద్ధిలో కలెక్టర్ల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం విజయవాడలో ఆయన జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సరైన పాలన అందిస్తేనే మనుగడ ఉంటుందన్నారు. విభజన తర్వాత తొలిసారి కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తున్నామని...రాష్ట్రాభివృద్ధికి దశా నిర్దేశం కోసమే ఈ సమీక్ష ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విభజన తర్వాత కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామని... సున్నిత సమస్యలపై జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.
తెలుగువారి కోసమే తెలుగుదేశం పార్టీ పుట్టిందని ఆయన అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు తనకు ముఖ్యమన్నారు. అధికార, ప్రతిపక్షంగా తనకు ఇరు రాష్ట్రాల అభివృద్ధి అవసరం అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విభజన ఇంకా పూర్తి కాలేదని, విభేదాలపై కూర్చొని చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్థానికత అంశాన్ని తెలంగాణా ప్రభుత్వమే తేల్చాలని చంద్రబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులెవరో ఆ ప్రభుత్వమే తేల్చాలని, 58 శాతం బోధనా రుసుం చెల్లిస్తామన్నా తెలంగాణ సర్కార్ ముందుకు రావటం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను చదివించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఫీజుల విషయంలో వివాదాలు వద్దని, కలిసి పని చేద్దామని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. బ్యాంకులు రైతుల రుణాలు రీ షెడ్యూల్ చేయకుంటే తామే చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు.
చేయాల్సిందంతా చేస్తామని చంద్రబాబు అన్నారు. పేదరికపు నిర్మూలనే తమ లక్ష్యమన్నారు. ఈ సమీక్షా సమావేశానికి సీఎస్ కృష్ణారావుతో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. మరోవైపు చంద్రబాబు సమావేశాన్ని అడ్డుకునేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వారు సమావేశం జరుగుతున్న కార్యాలయం వద్ద బైఠాయించారు.