‘తెలంగాణ’పై కౌంటర్ ఎటాక్ | ap counter attacks on telangana | Sakshi
Sakshi News home page

‘తెలంగాణ’పై కౌంటర్ ఎటాక్

Published Mon, Jun 15 2015 3:24 AM | Last Updated on Sat, Aug 18 2018 6:00 PM

‘తెలంగాణ’పై కౌంటర్ ఎటాక్ - Sakshi

‘తెలంగాణ’పై కౌంటర్ ఎటాక్

- అవకాశం ఉన్న అంశాల్లో కేసుల నమోదుకు నిర్ణయం
- పాత విషయాలు తిరగదోడమని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు
- కేసీఆర్, తెలంగాణ అధికారులపై ఏపీలో నమోదైన 70 కేసులు
- వీటిలో నోటీసుల జారీకి ఉన్న అవకాశాలను పరిశీలించాలని స్పష్టీకరణ
- తనకు ‘నోటీసులు జారీ’ అంశంపై రాష్ట్ర ఏసీబీ అధికారులతో చర్చ
 
సాక్షి, హైదరాబాద్:
‘ఓటుకు నోటు’ వ్యవహారంలో పీకల్లోతున కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదురుదాడి (కౌంటర్ ఎటాక్)కి దిగాలని యోచిస్తున్నారు. వీలున్నంత వరకు తెలంగాణ సర్కారు, నేతలను ఇబ్బందులకు గురిచేయాలని వ్యూహరచన చేస్తున్నారు. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) నుంచి తనకు నోటీసులు రావడానికి ముందే దీన్ని కార్యరూపంలో పెట్టాలని నిర్ణయించుకున్నారు.

ఆదివారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఏపీ సీఎం ఈ మేరకు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. ఈ మేరకు తనకు నోటీసులు జారీఅయ్యేలోపే తెలంగాణ నేతలు, అధికారులపై కేసుల నమోదుకు గల అవకాశాలను పరిశీలించాలని కోరినట్టు సమాచారం. మరోవైపు తనకు నోటీసులు జారీ అయిన పక్షంలో అనుసరించాల్సిన వ్యూహంపై వరుసగా మూడోరోజూ రాష్ట్ర ఏసీబీ అధికారులతో సీఎం చర్చించారు.

అన్నీ సిద్ధం చేయండి...
‘ఓటుకు నోటు’ కేసుకు సంబంధించి తెలంగాణ ఏసీబీ అధికారులు సీఎం చంద్రబాబునాయుడుకు నోటీసులు జారీ చేయడం ఖాయమనే సంకేతాలు వెలువడుతుండటంతో కౌంటర్ ఎటాక్‌పై ఆయన దృష్టి పెట్టారు. ఈ నోటీసులు జారీ అయ్యేలోపే తెలంగాణ నేతలు, అధికారులపై కేసుల నమోదు అంశాన్ని పరిశీలించాల్సిందిగా అధికారుల్ని సీఎం ఆదేశించారు. ‘ఓటుకు నోటు’ ఆడియో టేపులు వెలుగులోకి వచ్చిన తరవాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర నేతలు, అధికారులపై టీడీపీ శ్రేణులు, నేతలు ఇచ్చిన ఫిర్యాదులతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో దాదాపు 70 కేసులు నమోదయ్యాయి. వీటి దర్యాప్తును సాకుగా చూపి ఆయా నేతలు, అధికారులకు నోటీసులు జారీ చేసే అంశాలను పరిశీలించడంతోపాటు జారీ చేసే అవకాశముంటే వాటిని సిద్ధం చేసి ఉంచాల్సిందిగా సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం.

మరోవైపు తెలంగాణకు చెందిన నేతలు, టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులపై గతంలో ఏపీతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఏవైనా కేసులు నమోదై ఉన్నాయా? ప్రస్తుతం అవి ఏ స్థితిలో ఉన్నాయి? తదితర అంశాలనూ ఆరా తీసి సిద్ధంగా ఉంచుకోవాలని కూడా సీఎం ఆదేశించినట్లు తెలిసింది. ఆయా కేసులకు సంబంధించిన బాధితులు ఇప్పుడు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అనే విషయాలను సిద్ధం చేయడంతోపాటు తాజాగా వారితో ఫిర్యాదులు చేయించి... తెలంగాణకు చెందిన వారిపై కేసులు నమోదు చేయడానికున్న అవకాశాలను పరిశీలించాలని సీఎం ఆదేశించినట్టు సమాచారం.

నోటీసులు జారీ అయితే ఏం చేద్దాం..
ఇదిలా ఉండగా ‘ఓటుకు నోటు’ కేసులో నోటీసులు జారీ అయితే అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం రాష్ట్ర ఏసీబీ అధికారులతో చర్చించారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ వాంగ్మూలాన్ని (సీఆర్‌పీసీ 164 స్టేట్‌మెంట్) తెలంగాణ ఏసీబీ అధికారులు సోమ, మంగళవారాల్లో మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేసే అవకాశముంది. దీంతోపాటు ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో వెలుగులోకొచ్చిన వివరాలు, కస్టడీలో నిందితులు వెల్లడించిన వివరాలతో న్యాయస్థానంలో సమగ్ర నివేదిక సమర్పించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఫోన్ సంభాషణల ఆడియో టేపుతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుతోపాటు మరికొందరినీ ఈ కేసులో నిందితులుగా చేర్చేందుకు అనుమతి కోరుతూ మెమో దాఖలు చేసేందుకు తెలంగాణ ఏసీబీ కసరత్తు చేస్తోంది. ఇదే జరిగితే చంద్రబాబుకు అవినీతి నిరోధక చట్టం కింద నోటీసులు జారీ చేసే అవకాశముంది. దీంతో వీటిని ఎదుర్కోడమెలా? అనే అంశాలపై ఆయా అధికారులు, న్యాయనిపుణులతో చంద్రబాబు చర్చించినట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement