
రైతులను నట్టేట ముంచిన చంద్రబాబు
దేవరపల్లి: రుణమాఫీ ప్రకటనతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులను, డ్వాక్రా మహిళలను నట్టేటముంచారని వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మండల కన్వీనర్ గడా జగదీష్ అధ్యక్షత జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు రుణమాఫీపై పొంతనలేని ప్రకటనలు చేస్తూ రైతులను, మహిళలను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు. టీడీపీ కర్యకర్తలు గ్రామాల్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై రౌడీయిజం చేస్తూ దాడులు చేస్తున్నారని తలారి ఆరోపించారు. టీడీపీ గూండాయిజం, రౌడీయిజాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
మండల పార్టీ కన్వీనర్ గడా గదీష్ మాట్లాడుతూ గౌరీపట్నం పార్టీ నాయకుడు ఆండ్రు రమేష్‌బాబు టీడీపీ డబ్బుకు అమ్ముడుపోయాడని ఆరోపించారు. మండలంలో 12 మంది ఎంపీటీసీలను ప్రజలు గెలిపించి ఎంపీపీ అధికారం కట్టబెట్టగా ధనబలంతో టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలను కొనుగోలు చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నారన్నారు. సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కేవీకే దర్గారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఎన్.రాజేంద్రబాబు, మండల యూత్ కన్వీనర్ కొఠారు ధృవకాంత్, పార్టీ నేతలు పల్లి వెంకట రత్నారెడ్డి, కవల సుబ్బారావు, కె.వీరభద్రరావు, కాండ్రు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.