మరో నిబంధనం
భారతేతిహాసంలో.. కురుక్షేత్ర కదనంలో మహాదాత కర్ణుడు నేలకొరగడానికి ఆరు కారణాలు! మరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో‘రుణమాఫీ’ పేరుతో చంద్రబాబు చేస్తున్న క్రూరపరిహాసంలో..అన్నదాత ఆశలు కుప్పకూలడానికి? ఈ ప్రశ్నకు జవాబు ఇప్పుడప్పుడే సాధ్యం కాదు. ఎందుకంటే.. రైతుల్ని మాఫీకి అనర్హుల్ని చేసే కొత్త ఎత్తుగడలు రంగంలోకి వస్తున్నాయి. వరికుప్పంత హామీనిచ్చిన బాబుకు.. అమలుపై వడ్లగింజంత చిత్తశుద్ధి లేనప్పుడు.. రైతుల్ని హతాశుల్ని చేసే ఆంక్షల జాబితా హనుమంతుడి తోకలా పెరిగితే ఆశ్చర్యమేముంది!
అమలాపురం :తిమ్మిని బమ్మి చేసైనా; ఆశతో ఓటేసిన వారి నమ్మకాన్ని నిర్దాక్షిణ్యంగా వమ్ము చేసైనా.. రుణమాఫీ భారాన్ని తగ్గించుకోవడానికి కుయుక్తులు పన్నుతున్న చంద్రబాబు సర్కారు మరో కొత్త అస్త్రాన్ని అందిపుచ్చుకుంది. విస్తరి వేసి, వడ్డన ఎగ్గొట్టినట్టు.. ఆర్భాటంగా ఇచ్చిన రుణమాఫీ అమలు నుంచి ఎలా తప్పించుకోవాలా అని గద్దెనెక్కిన నాటి నుంచి కసరత్తు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పటికే కుటుంబంలో ఒక్కరే మాఫీకి అర్హులని, ఉద్యానవన రైతులకు మాఫీ వర్తించదని ప్రకటించింది. ఆధార్, రేషన్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం వంటి నిబంధనలను విధించింది. తాజాగా..అడ్డగోలుగా సర్వే నంబరు అడ్డంకినిసృష్టించింది. రుణమాఫీకి సంబంధించిన వివరాల్లో సర్వే నంబరు కూడా నమోదు చేయాలనడంతో జిల్లా రైతుల్లో 60 శాతం పైగా రుణమాఫీకి దూరం కానున్నారు. ‘రోగి కోరిందీ, వైద్యుడు చెప్పిందీ ఒకటే’ అన్నట్టు.. మాఫీని ఎగ్గొట్టాలన్న దురుద్దేశంతో ఉన్న ప్రభుత్వానికి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల తప్పిదాలు కలిసి వస్తున్నాయి. భూమి క్రయవిక్రయాలు, వారసులకు రాసిచ్చిన తర్వాత అధికారులు రెవెన్యూ అడంగళ్లలో మార్పులు చేయకుండా, ఒకే సర్వే నంబరును నమోదు చేయడం ఇప్పుడు ఎందరో రైతులకు రుణమాఫీ లబ్ధి దక్కకుండా పోవడానికి కారణమవుతోంది.
‘టెక్నికల్’గా ఒక్కరే అర్హులు..
ఇప్పటికే ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మాఫీ అర్హతకు 31 అంశాలకు సంబంధించిన సమాచారం పొందుపరచాలి. ఇందులో రైతులు పూర్తి చేయాల్సినవి కొన్ని కాగా, మిగిలినవి బ్యాంకులు నమోదు చేయాల్సినవి. ఇందుకు ప్రభుత్వం రూపొందించి, బ్యాంకులకు అందజేసిన సాఫ్ట్‌వేర్‌లో సర్వే నంబరును కూడా చేర్చింది. ఒకే సర్వే నంబరుతో ఇద్దరు, అంతకన్నా ఎక్కువ మంది రైతులు మాఫీకి దరఖాస్తు చేసుకుంటే.. కేవలం ఒక్కరి రుణమే మాఫీ అవుతుంది. ఒకే సర్వే నంబరుపై వేర్వేరు బ్యాంకుల్లో రుణాలు పొందినా, ఒకరి కన్నా ఎక్కువ మంది ఒకే సర్వే నంబరు ఇచ్చినా దానిని సాఫ్ట్‌వేర్ గుర్తిస్తుంది. అప్పుడు ప్రభుత్వం నియమించే టెక్నికల్ కమిటీ ఒకరిని మాత్రమే రుణమాఫీకి అర్హుడిగా ఎంపిక చేస్తుంది.
మాట తప్పడానికే ఇన్ని మాయోపాయాలు..
చాలాచోట్ల ఒక సర్వే నంబరుపై భూమి క్రయవిక్రయాలు జరిగాయి. సాధారణంగా తండ్రి ఆస్తిని అదే సర్వే నంబరుపై వారసులకు పంపిణీ చేసి, రిజిస్టర్ చేస్తుంటారు. దీని ఆధారంగానే రెవెన్యూ అధికారులు వారికి టైటిల్ డీడ్, పట్టాదారు పాస్ పుస్తకాలను మంజూరు చేస్తున్నారు తప్ప సర్వే నంబరు సబ్ డివిజన్ చేసి, అడంగళ్లలో నమోదు చేయడం లేదు. సర్వే నంబర్ల సబ్ డివిజన్‌కు అనుమతి ఇవ్వాల్సిన ప్రభుత్వం కూడా కొన్నేళ్లుగా పట్టించుకోవడం లేదు. ఉదాహరణకు.. ఓ గ్రామంలో సర్వే నంబరు 160పై రామారావు అనే వ్యక్తికి పది ఎకరాల భూమి ఉంది. దానిని అతడి నలుగు కుమారులకు రెండున్నర ఎకరాల చొప్పున పంచి, రిజిస్టర్ చేయించాడు. వారు టైటిల్‌డీడ్, పట్టాదారు పాస్‌పుస్తకాలకు దరఖాస్తు చేసుకున్న సమయంలో రెవెన్యూ అధికారులు వారి సర్వే నంబరును 160ఎ, 160బి,160సి, 160డిగా సబ్ డివిజన్ చేసి పాస్ పుస్తకాలు ఇవ్వాలి. అయితే చాలా మంది ఈ విధానంలో కాకుండా సర్వే నంబరు 160 మీదనే పాస్ పుస్తకాలు ఇచ్చేశారు.
వారసులకు ఇచ్చేటప్పుడే కాదు.. ఓ వ్యక్తి తన భూమిని ఇద్దరు, ముగ్గురు వ్యక్తులకు అమ్మిన సమయంలో కూడా ఇలాగే చేశారు. సాధారణంగా బ్యాంకులు సర్వే నంబరుతో సంబంధం లేకుండా టైటిల్ డీడ్, పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగా రుణాలు మంజూరు చేస్తుంటాయి. పంట నష్టపోతే ప్రభుత్వం కూడా వీటి ఆధారంగానే పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్ సబ్సిడీ) ఇస్తోంది. దీనివల్ల చాలా మంది రైతులు ఇప్పటి వరకు సర్వే నంబరు విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు రుణమాఫీకి సర్వే నంబరును కూడా నమోదు చేయాలని చెప్పడంతో లబోదిబోమంటున్నారు. భూమి సొంతమైనా, స్వయంగా సాగు చేస్తున్నా, బ్యాంకు నుంచి పంట రుణం పొందినా.. కేవలం సర్వే నంబరు మారనందున రుణమాఫీ అర్హత కోల్పోయే దుస్థితి ఏర్పడడంతో నిశ్చేష్టులవుతున్నారు. గతంలో ఎన్నడూ, ఎవరూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నీరుగార్చడానికి ఇన్ని మాయోపాయాలు, ముందరి కాళ్ల బంధాలు ప్రయోగించలేదని నిష్టూరమాడుతున్నారు. ప్రభుత్వం ఈ నిబంధనను ఎత్తివేయాలని లేదా రెవెన్యూ అడంగళ్లలో మార్పులు చేసి తమను రుణమాఫీకి అర్హులను చేయాలని అభ్యర్థిస్తున్నారు.