రుణమాఫీపై రగడ
చీపురుపల్లి: రుణమాఫీ పథకం అమలులో ప్రభుత్వం కాలయూపన చేస్తుండడంతో రైతులు ఆగ్రహించారు. ప్రభుత్వం తీరును ఎండగట్టారు. ఇంకెంత కాలం తమను మోసం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే టీడీపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబును రైతులు విమర్శించడాన్ని తట్టుకోలేని టీడీపీ నాయకులు రైతులతో వాగ్వాదానికి దిగారు. మండలంలోని పత్తికాయవలసలో సోమవారం జన్మభూమి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో రుణమాఫీ విషయమై ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత, సర్పంచ్ భర్త దన్నాన జనార్దన్‌తో పాటు మరికొంత మంది రైతులు అధికారులను నిలదీశారు. చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. దీన్ని తట్టుకోలేని టీడీపీ వర్గీయులు వారితో వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య ప్రారంభమైన ఘర్షణ చివరకు కొట్లాటకు దారి తీసింది.
ఎవరిని ఎవరు తోసుకుంటున్నారో ఎవరినెవరు కొడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఉన్న ఒక్క పోలీసు కానిస్టేబుల్ ఇరువర్గాల మధ్య అలాగే ఉండిపోయూరు. ఇదంతా తహశీల్దార్, మండల ప్రత్యేకాధికారి సమక్షంలోనే జరిగింది. ముందుగా సర్పంచ్ భర్త దన్నాన జనార్దన్ మాట్లాడుతూ అధికారం లోకి రాగానే తొలి సంతకం రుణమాఫీపై పెడతానని రైతులను నమ్మించిన చంద్రబాబు సంతకం చేయలేదు సరికదా, రైతులను బ్యాంకులకు వెళ్లకుండా చేశారని, ఇప్పుడేమో కొత్తగా సాధికారత కమిటీ పేరుతో మరోసారి మోసం చేస్తున్నారని విమర్శించారు. కనీసం రైతులకు రీషెడ్యూల్ అవకాశం కూడా లేకుండా చేశారని తెలిపారు. ఆయనకు మరికొంత మంది రైతులు మద్దతు పలకడం తో అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు దన్నాన రామచంద్రుడు మాట్లాడుతూ ఇదేమీ రాజకీయ సమావేశం కాదని, తమ నాయకుడ్ని విమర్శించరాదని చెప్పడంతో ఇరువర్గాలకు చెందిన వారు ఘర్షణకు దిగారు.
ఘర్షణ కాస్త తోపులాట అక్కడి నుంచి స్వల్ప కొట్లాటకు దారి తీసింది. అయితే ఒకే ఒక కానిస్టేబుల్ ఉండడంతో ఏమీ చేయలేని దుస్థితి నెలకొంది. ఈ సమయంలో తహశీల్దార్ డి.పెంటయ్య మైక్‌లో ఇరువర్గాలను అదుపు చేసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. చివరకు ఇరు వర్గాలు అలసి పోయిన వరకు తోసుకుని అక్కడితో విశ్రమించారు. కాగా ఇదే సమావేశంలో జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ నేత దన్నాన జనార్దన్ అడ్డు తగులుతూ 79 శాతం వికలాంగత్వం ఉన్న వారికి పింఛన్లు ఇస్తారా ఇవ్వరా అం టూ ప్రశ్నించారు. 80 శాతం వికలాంగత్వం ఉంటే తప్ప వికలాంగ పింఛను ఇవ్వరని జెడ్పీటీసీ స్పష్టం చేసారు. 79 శాతం విక లాంగత్వం కలిగిన వారిని ఈ ప్రభుత్వం గుర్తించదా అని జనార్దన్ ప్రశ్నించారు. ఇలా ఆయన ఓ వైపు ప్రశ్నలు వేస్తున్నప్పటికీ మరో వైపు సమావేశాన్ని ముగించడం కొసమెరుపు.
ఎమ్మెల్యే కోళ్లను నిలదీసిన పింఛన్‌దారులు
కొత్తవలస: కొత్తవలస పంచాయతీలో జరిగిన జన్మభూమి సభలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారిని కొంతమంది పింఛన్‌దారులు నిలదీశారు. 70 ఏళ్ల వయస్సు ఉన్నా.. తమను ఎందుకు అనర్హులుగా గుర్తించారని ప్రశ్నించారు. ఐదేళ్లుగా పింఛన్లు అందుకుంటున్న తమకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా పింఛన్ తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ పరిధిలో 170 మంది అర్హులకు పింఛన్లు తొలగించారని ఎంపీటీసీలు మేళాస్త్రి సరస్వతి, మేళాస్త్రి అప్పారావు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ వాస్తవంగా అర్హులను తప్పిస్తే వారికి పింఛన్లు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
బాడంగిలో రసాభాస
బాడంగి: మండల కేంద్రంలో సోమవారం జరిగిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. సర్పంచ్, ఎంపీటీసీల మధ్య పంచాయతీ అభివృద్ధి పనుల విషయమై తీవ్ర వాగ్వాదం జరిగింది. గ్రామంలో అభివృద్ధి పనులు జరగకుండా వైఎస్సార్ సీపీ మెం బర్లు అడ్డుకుంటున్నారని సర్పంచ్ చెప్పగా.. ఎంపీటీసీల తరుఫున స్వామినాయుడు తాము చేసిన పనులు, ప్రతిపాదించిన పనుల గురించి సభలో చెబుతుండగా మాజీ ఎంపీటీసీ కుమారుడు చల్ల కృష్ణ అడ్డు తగిలారు. దీంతో అక్కడే ఉన్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తమ నాయకుడు మాట్లాడుతుండగా అడ్డుతగలడమేమిటని వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. అలాగే ఎన్‌టీఆర్ శుద్ధజలం విషయంలో నిర్వాహకులు 20 లీటర్ల నీటిని క్యాన్‌తో రూ. 250 లకు అమ్ముతున్నారని, మా ర్కెట్‌లో రూ. 150 లకే దొరుకుతుందని ఎంపీటీసీ కుమారుడు రవిప్రకాష్ తహశీల్దార్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమయంలో టీడీపీకి చెందిన గుణుపూరు శ్రీను జోక్యంతో చేసుకోవడంతో ఇరువర్గాల కార్యకర్తల మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. చివరకు పోలీసులు ఇరువర్గాలను సముదారుుంచి, సభ సక్రమంగా జరిగేలా చూశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్ముం నాయుడు, ఎంపీడీఓ బాబూరావు, ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.