
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులెత్తేశారు. పోలవరం టెండర్లు వద్దంటే కేంద్రానికి వదిలేసి ఓ నమస్కారం పెడతానంటూ ఆయన గురువారం అసెంబ్లీ లాబీలో మీడియాతో జరిగిన చిట్ చాట్‌లో అన్నారు. పోలవరంపై అన్ని పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ...‘కేంద్రం నిర్ణీత గడువు పెట్టుకుని పూర్తి చేస్తామంటే రేపు ఉదయమే ప్రాజెక్ట్‌ను కేంద్రానికి అప్పగిస్తాం. పోలవరం టెండర్లు ఆపాలంటూ కేంద్రం లేఖతో గందరగోళం ఏర్పడింది.
కేంద్ర మంత్రితో చర్చించాకే టెండర్లకు పిలిచాం. కేంద్రం ఆపమంటే పోలవరం టెండర్లు ఆపేస్తా. ప్రాజెక్ట్ పనులు ఆరు నెలలు ఆగిపోతే మళ్లీ మొదలుపెట్టడం కష్టం అవుతుంది. అందుకే పోలవరంపై ఒత్తిడి తేవాలని బీజేపీ నేతలను కోరాను. బీజేపీ మిత్రపక్షం కాబట్టే సహనంతో వ్యవహరిస్తున్నాం...లేకుంటే మరోలా ఉండేది. పోలవరం సమస్య ప్రభుత్వం వద్ద ఉందో, అధికారుల వద్ద ఉందో అర్థంకావటం లేదు.కేంద్రం సహకరిస్తే...లేకుంటే మాకు కష్టం మిగులుతుంది.’ అని వ్యాఖ్యానించారు.
పోలవరం ప్రాజెక్టు పనులు ఆపాలన్న కేంద్రం లేఖపై చంద్రబాబు నాయుడు స్పందిస్తూ... పోలవరం కోసం ఇంకా 60వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు ప్రాజెక్టుకు 12వేల కోట్లు ఖర్చుపెట్టామని... ఇంకా 42 వేల కోట్లు అవసరం అవుతాయని చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహాకారం చాలా అవసరమన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొత్తచట్టం వల్లే భూసేకరణ అంచనాలు పెరిగాయన్నారు.
కాగా పోలవరం ప్రాజెక్టులో టెండర్లకు కేంద్రం బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. చాలా రోజులుగా కొంతమంది కాంట్రాక్టర్లను పోలవరం పనులు అప్పగించాలని భావిస్తున్న సీఎం చంద్రబాబు ప్లాన్‌కు.. ఎన్డీయే సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. పారదర్శకత లోపించిన స్పిల్వే, స్పిల్ ఛానల్ టెండర్లను నిలిపివేయాలని ఆదేశించింది. అక్టోబర్ 13 తేదీన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన సమావేశంలో కొత్త టెండర్ల వలన అంచనాలు పెరిగి ప్రభుత్వం భారం పడుతుందని భావించి పాత కాంట్రాక్టర్నే పనులు చేయాలని ఆదేశించింది.
ఆ సమయంలో ఏపీ ప్రభుత్వం కొన్ని పనులకు కొత్త టెండర్లను పిలుస్తామని.. ఆ నిధులను ఏపీ ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పుకొచ్చింది. అనుకున్నదే తడువుగా ఏపీ ప్రభుత్వం నవంబర్ లో టెండర్లను పిలిచేసింది. ఇంతలోనే టెండర్లు నిలిపివేయాలన్న కేంద్రం ఆదేశంతో చంద్రబాబు సర్కార్పై కేంద్రం మొట్టికాయలేసినట్లు అయింది. దీంతో చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ విషయంలో తనదేమీ లేదని, కేంద్రానిదే అంతా అంటూ కొత్త పాట పాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment